కవితకు బెయిల్ తో మూడు పార్టీల మధ్య పొలిటికల్ హీట్

కవితకు బెయిల్ తో  మూడు పార్టీల మధ్య పొలిటికల్ హీట్
  • బీఆర్ఎస్, బీజేపీ బంధం బయటపడిందంటున్న కాంగ్రెస్
  • కాంగ్రెస్ అభ్యర్థి రాజ్యసభ, కవితకు బెయిల్ అన్న బండి 
  • బండి సంజయ్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమేనంటున్న కేటీఆర్
  •  మూడు పార్టీల మధ్య కొనసాగుతున్న పొలిటికల్ ఫైట్
  • రేపు మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ కు ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడంతో మరో సారి రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని అందుకే కవితకు బెయిల్ వచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి సామరామ్మోహన్ సైతం ఈ అంశంపై స్పందించారు. కవితకు బెయిల్ వచ్చిందని, బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందంటూ వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో చేసిన అవినీతికి కవిత శిక్ష అనుభవించిందని, తెలంగాణలో చేసిన అవినీతికీ కల్వకుంట్ల కుటుంబం శిక్ష అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు. కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీకి పోయిందే బీజేపీతో డీల్ కుదుర్చుకొని కవితకు బెయిల్ ఇప్పించడానికేనని మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కలిసి ఢిల్లీలో ఉన్న బీజేపీ ఆఫీసు ముందు పరేడ్ చేసి కాళ్ల బేరానికి వెళ్లి కవితకు బెయిల్ తెచ్చారని తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి విమర్శించారు.   కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇదే అంశంపై మాట్లాడారు. బీఆర్ఎస్ మద్దతులో కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభకు వెళ్లారని, కవితకు బెయిల్ వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు ఒక్కటేనంటూ కామెంట్ చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని పేర్కొన్నారు. సీజేఐ కేంద్ర మంత్రి వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.