- పొన్నం హుస్నాబాద్ వైపు చూస్తుండడంతో పెరిగిన ఆశావహులు
- ఆశలు పెట్టుకున్న ఎంఎస్సార్ మనవడు రోహిత్ రావు
- అప్లికేషన్ ఇచ్చిన సీఎం అన్న కూతురు రమ్యారావు
- టికెట్ వస్తుందనే ధీమాతో కాంగ్రెస్ లోకి జైపాల్ రెడ్డి
- రేపోమాపో మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కూడా..
- మిగతా నియోజకవర్గాల్లో పోటీ తక్కువే
కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తికావడంతో కాంగ్రెస్, బీజేపీలో టికెట్లు ఎవరికిస్తారనే చర్చ జోరందుకుంది. ఆశా వహుల నుంచి కాంగ్రెస్ హైకమాండ్దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే 10 మందికిపైగా అప్లయ్ చేసుకున్నారు. కరీంనగర్ జనరల్ సీటు కావడం, గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతుండడంతో ఇక్కడ క్యాండిడేట్ విషయంలో క్లారిటీ లేదు. దీంతో టికెట్ కోసం లోకల్ లీడర్లతోపాటు నాన్ లోకల్స్ కూడా పోటీ పడుతున్నారు. శుక్రవారం వరకు గడువు ఉండడంతో మరిన్ని అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది.
10కి పైగా అప్లికేషన్లు
కరీంనగర్ టికెట్ కోసం మాజీ మంత్రి ఎంఎస్సార్ మనవడు మేనేని రోహిత్ రావు ఆశలు పెట్టుకున్నారు. టికెట్ వస్తుందనే నమ్మకంతో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆశీస్సులతో కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా తిరుగుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కూడా కలిసొచ్చారు. బుధవారం గాంధీ భవన్లో అప్లికేషన్ ఇచ్చారు. తాజాగా కొత్త పేర్లు కొన్ని తెరపైకి వచ్చాయి. గురువారం వరకు కరీంనగర్ టికెట్ కోసం అప్లికేషన్లు పెట్టుకున్నోళ్ల సంఖ్య 10కి చేరింది.
రోహిత్ రావుతోపాటు పీసీసీ అధికార ప్రతినిధి కొనగాని మహేశ్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి, పీసీసీ సెక్రటరీ అంజన్ కుమార్, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సమద్ నవాబ్, సీఎం కేసీఆర్ అన్న కూతురు రేగులపాటి రమ్యారావు, ఆమె కుమారుడు రేగులపాటి రితీశ్‌రావు, జువ్వాడి చొక్కారావు మనవడు జువ్వాడి నిఖిల్ చక్రవర్తి ఇప్పటికే రూ.50 వేల చొప్పున చెల్లించి దరఖాస్తులు సమర్పించారు. తమకే టికెట్వస్తుందని ఎవరికివారు వారు లెక్కలు వేసుకుంటున్నారు.
ఇద్దరు ముగ్గురు మధ్యనే..
కరీంనగర్‌తో పోలిస్తే చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న టీమ్ మాజీ కన్వీనర్, రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య టికెట్ కోసం అప్లికేషన్లు సమర్పించారు. చొప్పదండి నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, నాగి శేఖర్, బండ శకుంతల, వెన్న రాజమల్లయ్య టికెట్ ఆశిస్తున్నారు. హుస్నాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తోపాటు సైదాపూర్ మండలం వెన్నెంపల్లికి చెందిన ఒంటెల లింగారెడ్డి అప్లికేషన్ ఇచ్చారు. ఈ టికెట్ విషయంలో ప్రవీణ్ రెడ్డి, పొన్నం మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మానకొండూర్ నుంచి డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, తిప్పారపు సంపత్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు.
టికెట్ ధీమాతో జైపాల్‌రెడ్డి ఎంట్రీ..
మైత్రి గ్రూప్స్ చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకుడు కొత్త జైపాల్ రెడ్డి గురువారం తన అనుచరులతో హైదరాబాద్‌లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ లో చేరారు. కరీంనగర్ నుంచి టికెట్ వస్తుందనే హామీతోనే కాంగ్రెస్‌లో చేరినట్లు ఆయన వెల్లడించారు. పార్టీలో చేరగానే ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లికేషన్ సమర్పించినట్లు తెలిసింది. మరోవైపు బీఆర్ఎస్ లో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదంటూ ఆ పార్టీకి బుధవారం రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కూడా సొంతగూటికి చేరేందుకు కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.