
- ప్రగతిభవన్ కు వెళ్లిన ఎమ్మెల్యే.. మంత్రుల బుజ్జగింపులు
- మాజీ ఎంపీ గొడం నగేశ్ ఆశలు గల్లంతు
- అనిల్ ఇంటికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న కార్యకర్తలు
ఆదిలాబాద్, వెలుగు : బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు హైకమాండ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం రిలీజ్ చేసేందుకు పార్టీ సిద్ధం కాగా.. ఆ జాబితాలో బాపూరావు పేరు లేనట్లు సమాచారం. ఆయన స్థానంలో నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ కు చోటు దక్కినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాపూరావుపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, కొంతకాలంగా బోథ్ టికెట్ తనకే అంటూ నేరడిగొడ జడ్పీటీసీ అనిల్ జాదవ్ ప్రచారం చేస్తుండగా చివరకు అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
దీంతో బాపూరావు సీఏంను కలిసేందుకు శనివారం హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. ఎమ్మెల్యే అనుచరవర్గం మాత్రం సైలెంట్‌గా ఉండటంతో టికెట్ రేసులో ఆయన లేరని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుతోంది. అనిల్‌కు టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం జరగడంతో నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.
అనిల్‌కు నేతల మద్దతు
బోథ్ నియోజకవర్గంలో ముందు నుంచీ బీఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే బాపూరావుకు అనిల్ జాదవ్ తో పాటు ఆయనకు మద్దతుగా బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, మాజీ ఎంపీ గొడం నగేశ్ మధ్యముందు నుంచి విభేదాలు ఉన్నాయి. అనిల్‌కు ఆదిలాబాద్ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మద్దతు సైతం ఉంది. ఈ నేపథ్యంలోనే అనిల్ జాదవ్ టికెట్ రేసులోకి దూసుకొచ్చారు. అయితే, రెండుసార్లు బీఆర్ఎస్ నుంచి, అంతకుముందు కూడా గెలిచిన బాపూరావుకు నియోజకవర్గంలో బలమైన కేడర్ కూడా ఉంది.
కానీ ఇప్పుడు ఆయనపై నియోజకవర్గంలో వ్యతిరేకత కారణంగా టికెట్దక్కనట్లు తెలుస్తోంది. తొలి జాబితా రిలీజ్‌కు ముందు శనివారం మంత్రులు కేటీఆర్, హరీశ్ రావును కలిసి బాపూరావు తన ప్రయత్నాలు చేశారు. దీంతో సోమవారం ప్రకటించే ఫస్ట్ లిస్టులో ఎవరి పేరు ఉంటుందా? అనేది ఉత్కంఠంగా మారింది. అయితే, అనిల్ కు టికెట్ ఇస్తే బాపూరావు, ఆయన వర్గం సహకరిస్తుందా? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మాజీ ఎంపీ గొడం నగేశ్ ఆశలు గల్లంతు
బోథ్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ గొడం నగేశ్ ఎప్పటి నుంచో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే అవినీతిపై ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బహిరంగా విమర్శలు చేసేవారు. అధిష్టానం మెప్పుకోసం గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయనకు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఈసారి కూడా అధిష్టానం ఆయన్ను పక్కనపెట్టినట్లు సమాచారం.
మొదటి జాబితా రిలీజ్‌కు పార్టీ సిద్ధం కావడంతో టికెట్ ఆశిస్తున్న నగేశ్ సైతం హైదరాబాద్‌కు బయల్దేరారు. అయితే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నుంచి ఆయనకు ఎలాంటి హామీ రాకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.