నల్గొండ, వెలుగు : నల్గొండలో రంజాన్ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయ న మరోసారి స్పష్టం చేయడం ప్రత్యర్థులను కలవపాటుకు గురిచేస్తోంది. ఇటీవల నల్గొండ నియోజకవర్గ కేంద్రంగా ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి తను పోటీ చేసేదానిపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చెరుకు సుధాకర్ ఎపిసోడ్ తర్వాత రంజాన్ వేడుకల్లో వెంకటరెడ్డి పాల్గొనడం, తన పొలిటికల్ కెరీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.
ఓవైపు నల్గొండలో జరుగుతున్న అభివృద్ధి పైన నమ్మకం పెట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో తనకు తిరుగులేదనే విశ్వాసంతో ఉన్నారు. నల్గొండలో వెంకట్‌రెడ్డి కాకుండా వేరెవ్వరు పోటీ చేసినా తమకు ఢోకా ఉండదని కంచర్ల వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు వెంకట్‌రెడ్డికి బదు లు నల్గొండ సీటును మైనార్టీలకు లేదంటే బీసీ లకు ఇస్తారని బీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని ఆయన వ్యతిరేకవర్గం ప్రచారం చేయడం సంచలనం రేపింది. తన పైన జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకే నల్గొండకు వచ్చిన ప్రతిసారీ వెంకట్‌రెడ్డి తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తాననే క్లారిటీ ఇస్తున్నారు. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.
మైనార్టీలకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్...
నల్గొండ పట్టణంలో మైనార్టీ ఓటర్లు కీలకం. టౌన్లో సుమారు 34 వేల మంది ఓటర్లు ఉండొచ్చని అంచనా. అధికార, ప్రతిపక్ష పార్టీల లీడర్లు మైనార్టీ ఓటర్లపై నమ్మకం పెట్టుకుని రాజకీయ వ్యూహం రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా వెంకటరెడ్డికి ఇన్నాళ్లు వెన్నుదన్నుగా నిలిచిన మైనార్టీలను తిరిగి తన వైపు తిప్పుకునేందుకు ఆయన ఏకంగా ఆ వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు సమద్ భార్య ప్రస్తుతం కాంగ్రెస్ కౌన్సిలర్‌గా ఉన్నారు. రంజాన్ సందర్భంగా సమద్ ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించిన వెంకట్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పవర్లోకి వస్తే సమద్‌ను ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల టైంలో కూడా వెంకట్‌రెడ్డి తన ప్రధాన అనుచరుడైన పట్టణంలోని ఓ సీనియర్ కాంగ్రెస్నేతను గవర్నర్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో ఆ హామీ నెరవేర్చలేకపోయారు. కానీ ఇప్పుడు ఏకంగా మైనార్టీ వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేయడం ప్రత్యర్థులకు ఝలక్ ఇచ్చినట్టేనని భావిస్తున్నారు.
ఆశవాహుల్లో అలజడి...
వెంకట్‌రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేయపోతే తర్వాత చాన్స్ పార్టీ సీనియర్‌నేత దుబ్బాక నర్సింహారెడ్డికి వస్తుందని ఆశించారు. బీసీలు లేదంటే మైనార్టీలకు ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ వెంకట్‌రెడ్డి క్లారిటీ ఇవ్వడంతో నల్గొండ నియోజకవర్గంలోని ఆశవాహుల్లో అలజడి మొదలైంది. నిన్నామొన్నటి వరకు నల్గొండ సీటు పైన ఆశపెట్టుకున్న దుబ్బాక రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసిన దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడం రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపాయి. ఇంకోవైపు అదే దుబ్బాక మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కొడుకు అమిత్‌రెడ్డితో కలిసి పొటోలకు ఫోజులిచ్చారు. ఈ రెండు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెండు పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2018 ఎన్నికల్లో భూపాల్‌రెడ్డికి టికెట్ఇవ్వడంతో అలిగిన దుబ్బాక వెంకట్‌రెడ్డితో చేతులు కలిపారు. మళ్లీ ఇప్పుడు అదే భూపాల్, అమిత్‌తో కలిసి దుబ్బాక ఫొటోలు దిగడం ఆసక్తికరంగా మారింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి సమీప బంధువులు కాగా, భూపాల్, గుత్తా రాజకీయ ప్రత్యర్థులు. దీంతో వీరి కలయిక రాజకీయంగా ఎటు వైపు దారితీస్తోందనేని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.