పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయ రగడ

పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయ రగడ

మహబూబ్‭నగర్,వెలుగు: పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయ రగడ మొదలైంది. కృష్ణా నదిపై కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా ప్రాజెక్టులను తామే పూర్తి చేశామని ఇటీవల పాలమూరులో జరిగిన సభలో సీఎం కేసీఆర్​ చెప్పడంతో ప్రతిపక్ష లీడర్లు గరం అవుతున్నారు. లిఫ్టు స్కీములన్నీ గత ప్రభుత్వాల హయాంలోనే పూర్తయ్యాయని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి పాలమూరులో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని, దమ్ముంటే రుజువు చేయాలని సవాల్​ విసురుతున్నారు. రాష్ర్ట ఏర్పాటు తర్వాత ప్రభుత్వం టేకప్​ చేసిన పాలమూరు-రంగారెడ్డి స్కీం (పీఆర్​ఎల్​ఐ) ఇంత వరకు అతీగతి లేదని విమర్శిస్తున్నారు. ఉన్న ప్రాజెక్టులనే మెయింటెయిన్​ చేయలేక వదిలేశారని, పంపులు మునిగి ఏండ్లు కావస్తున్నా రిపేర్లు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఫైర్​ అవుతున్నారు.

రిపేర్లు లేవు.. కెపాసిటీ పెంచలేదు

జలయజ్ఞంలో భాగంగా 2004లో నాటి కాంగ్రెస్​సర్కారు చేపట్టిన మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్ స్కీం (ఎంజీకేఎల్​ఎస్​)​ పనులు2014 వరకు 91 శాతం పూర్తయ్యాయి.  తెలంగాణ వచ్చేనాటికే 4టీఎంసీల సామర్థ్యంతో ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు ఎల్లూరు, జొన్నలబొగుడ వద్ద ఐదు చొప్పున మోటార్లను బిగించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్​ఎస్​ ప్రభుత్వం కేవలం గుడిపల్లిగట్టు వద్ద మోటార్లను ఫిట్​ చేయించింది. 4.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిస్తామ చెప్పినా రిజర్వాయర్లు, కాల్వల కెపాసిటీ పెంచకపోవడంతో లక్ష ఎకరాలకు మించి పారడం లేదు. 28, 29, 30 ప్యాకేజీల్లో కొన్ని  చోట్ల మాత్రమే బ్రాంచ్​ కెనాల్స్ పనులు పూర్తికాగా, అన్నిచోట్లా లైనింగ్​ పనులు, డిస్ట్రిబ్యూటరీలు పెండింగ్​లో ఉన్నాయి. 2020 ఆగస్టులో కృష్ణానదికి భారీ వరదలు రావడంతో, ఎల్లూరు పంపుహౌస్​నీటమునిగింది. మూడో పంపు బేస్​మెంట్​తో సహా ఊడొచ్చింది. ఈ మోటార్​కు ఇంత వరకు రిపేర్లే చేయలేదు. సర్జ్​పూల్​ వద్ద లీకేజీ అవుతుండటంతో ఐదో పంపునకు ముప్పు ఉంది. జొన్నలబొడుగ వద్ద రెండేండ్లుగా 4వ మోటార్​ పని చేయడం లేదు.

ఏడాదిన్నరగా ర్యాలంపాడుకు సీపేజీలు..

2014 నాటికే  నెట్టెంపాడు స్కీం పనులు 85 శాతం కంప్లీట్​అయ్యాయి. టీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చాక తట్టెడు మట్టి ఎత్తలేదు. 109వ ప్యాకేజీలో ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. గతేడాది స్కీం పరిధిలోని ర్యాలంపాడు రిజర్వాయర్​కు సీపేజీలు ఏర్పడినా  నేటికీ పనులు చేపట్టలేదు. కాలువలకు లైనింగ్​ చేయకపోవడంతో తరుచూ కోతకు గురవుతున్నాయి. డిస్ట్రిబ్యూటరీలు పెండింగ్​లోనే  ఉన్నాయి. రెండు లక్షల ఎకరాలకు గానుకేవలం లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది.

భీమా కాలువలకు నీళ్లు ఇడిస్తే గండ్లు..

జలయజ్ఞం కింద 2004లో ప్రారంభించిన భీమా-1, 2 పనులు 2014 జూన్​ నాటికి 89 శాతం పూర్తయ్యాయి. తెలంగాణ వచ్చాక ఎలాంటి పనులు చేపట్టకుండానే 20 టీఎంసీలు కేటాయించి, 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్దేశించారు.  ఫేజ్​-1 కింద ఎక్కడా రిజర్వాయర్లు నిర్మించలేదు. కాల్వల ద్వారా చెరువులను నింపి సాగైనట్లు చూపుతున్నారు.   పెద్దమందడి బ్రాంచ్​ కెనాల్​ తరుచూ కోతకు గురవుతోంది. రిజర్వాయర్ల పరిధిలో కెనాల్స్​, సబ్ కెనాల్స్, స్ర్టక్చర్ల వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. సంగంబండ రైట్​ కెనాల్ మధ్యలో పెద్ద బండరాయి అడ్డుగా వచ్చినా తొలగించకపోవడంతో కిలోమీటరే పారుతోంది. 

కోయిల్​సాగర్​ భూ సేకరణ పూర్తి కాలే..

1966లో అందుబాటులోకి వచ్చిన కోయిల్​సాగర్ ద్వారా 12 వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నారు. 2004లో  జలయజ్ఞం కింద జూరాల నుంచి నీటిని ఎత్తిపోసి 50,250 ఎకరాల ఆయకట్టుకు సాగునీరివ్వాలని పనులు ప్రారంభించారు. 2014 నాటికి 93 శాతం పనులు పూర్తి చేశారు. తెలంగాణ వచ్చాక ఇంత వరకు కాల్వల కెపాసిటీ పెంచలేదు. 

పీఆర్​ఎల్​ఐ పనులు జరిగింది 35 శాతమే..

 2016లో రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు గడిచిన ఆరేళ్లలో 35 శాతమే జరిగాయి. పర్యావరణ అనుమతులు లేకపోవడంతో గతేడాది అక్టోబర్​ నుంచి ఈ స్కీం పనులు నిలిచిపోయాయి. స్కీం కింద ఆరు రిజర్వాయర్లు ఉండగా, నార్లాపూర్​ రిజర్వాయర్​ పనులు ఇంకా జరుగుతున్నాయి. సర్జ్​పూల్​, పంప్​హౌస్​ పనులు సగం కూడా పూర్తి కాలేదు.  ఏదుల రిజర్వాయర్​ పంప్​హౌస్​ , సర్జ్​పూల్​  పెండింగ్​లో ఉన్నాయి. వట్టెం రిజర్వాయర్​ పనులు 50 శాతం పూర్తి కాగా, పంప్​హౌస్, సర్జ్పూల్​ పనులు జరగాల్సి ఉంది. కర్వెన రిజర్వాయర్​, సర్జ్​పూల్​, పంప్​హౌస్​ పనులు ప్రారంభించనే లేదు. ఉదండాపూర్​ కింద ఆర్​అండ్​ఆర్​ సమస్య పరిష్కరించలేదు. ఈ రిజర్వాయర్​ కోసం ఇంకా 60 మంది రైతుల నుంచి 200 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది. భూ సేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం ఇవ్వాలని రైతులు 2018లో కోర్టును ఆశ్రయించగా, స్టే వచ్చింది. షాద్​నగర్​ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​కు ఇంత వరకు భూ సేకరణే చేయలేదు.

థర్డ్​ పార్టీ ఎంక్వైరీ చేయాలి

పాలమూరు సభలో సీఎం పీఆర్​ఎల్​ఐ పనులు 90 శాతం పూర్తయ్యాయని చెబుతున్నారు. దీని మీద ప్రజల అనుమానాలు పటాపంచలు చేయాలి. ఇంజనీర్ల టీంను ఏర్పాటు చేయాలి. మొత్తం స్కీంలో ఎన్ని ప్యాకేజీల పని ఉంది? పూర్తయినవి ఎన్ని? ఎలక్ర్టిసిటీ పని ఎంత జరిగింది? ఎంత మిగిలింది? సివిల్​ వర్క్​, సిమెంట్​ వర్క్​, స్టీల్​ వర్క్​, సర్జ్​పూల్​, పంప్​హౌస్​ పనులు ఎంత వరకు పూర్తయ్యాయి? అనే వాటిపై థర్డ్​ పార్టీ ఎంక్వైరీ చేయాలి. అప్పుడే ప్రజలకు నిజాలు తెలిసి సీఎం నిజం చెప్పిండని నమ్మడానికి వీలుంటుంది.
– ఎం.రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్

'కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా ప్రాజెక్టులను దశాబ్దాల తరబడి పెండింగ్​లో పెట్టిండ్రు.. కోయిల్​సాగర్​ లాంటి చిన్న లిప్ట్​ను కూడా పెండింగ్​లో పెట్టిండ్రు.. ఎంత మొత్తుకున్నా సమైక్య పాలకులు వినలే.. కానీ, తెలంగాణ వచ్చిన వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు, ఆఫీసర్లందరూ కలిసి వీటిని కంప్లీట్​ చేసుకున్నం.. ఈ రోజు పాలమూరు అంటే కరువు జిల్లా కాదు, పచ్చబడ్డ పచ్చని పంటల జిల్లా అని పేరు వస్తా ఉంది.. పాలమూరు–-రంగారెడ్డి స్కీం పనులు 90 శాతం పూర్తి చేసినం.. 
–సీఎం కేసీఆర్​

'కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా ప్రాజెక్టులు తెలంగాణ రాకముందే పూర్తయ్యాయి. వాటికి ఇప్పటికీ బ్రాంచ్​కెనాల్స్​, డిస్ట్రిబ్యూటరీలు కట్టలేకపోయారు. టీఆర్ఎస్​ ప్రభుత్వం  వచ్చాక 2016లో ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అట్లనే ఉన్నది. ప్రాజెక్టుల రిడిజైన్ పేరుతో లక్షల కోట్లు మెక్కారు.. కృష్ణా జలాల విషయంలో ఏపీ సీఎంతో లాలూచీ పడి, తెలంగాణ వాటా అమ్ముకున్నారు. ఇప్పుడు కృష్ణానదిలో కేంద్రం వాటా తేల్చడం లేదంటున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారు..' 
–డీకే అరుణ , బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు 

‘పాలమూరు సభలో సీఎం కేసీఆర్​ చెప్పినవన్నీ అబద్ధాలే.. కృష్ణానది భూభాగం ఎక్కువగా ఉన్న తెలంగాణకు 69 శాతం వాటా ఉంది. మిగతా 31 శాతం ఏపీది. అలాంటిది నువ్వు, నీ అల్లుడు 299 టీఎంసీలు చాలని సంతకాలు చేసిండ్రు. భీమా-2 కింద ఉన్న సంగంబండ రిజర్వాయర్​కు రెండు కాల్వలున్నాయి. ఓ కాల్వ కిలోమీటర్​ పోగానే పెద్ద బండరాయి అడ్డుంది. దాన్నే ఇంత వరకు తీయలే. 'కల్వకుర్తి' కాల్వల డిజైన్​ మార్చాలని చెప్పినా అతీ గతి లేదు. అలాంటిది పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసినా అంటున్నవ్​. నీకు మాట్లాడే హక్కు లేదు.'     
–మాజీ మంత్రి నాగం జనార్దన్​రెడ్డి