కుల సంఘాల్లో.. రాజకీయ కుంపటి

  • ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కొత్త కార్యవర్గాలు ఏర్పాటు
  • కుల సంఘాల పదవులపై పార్టీల ఫోకస్
  • తమకు అనుకూలంగా ఉన్న లీడర్లకే పదవులు దక్కేలా పావులు
  • ఎమ్మెల్యే టికెట్లపై పార్టీలకు అల్టిమేటం జారీ చేస్తున్న సంఘాలు

ఆదిలాబాద్, వెలుగు; ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుల సంఘాల్లో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. రాజకీయ జోక్యం కారణంగా నేతల మధ్య ఐక్యత కరువై, మనస్పర్థలు వస్తున్నాయి. ఇవి కాస్తా గొడవల వరకూ వెళ్తున్నాయి. మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉండడంతో ఆయా పార్టీలు కుల సంఘాల పదవులపై ఫోకస్ చేశాయి. ఇందులో భాగంగానే అన్ని పార్టీలు కుల సంఘాల బాధ్యులతో మీటింగ్​లు నిర్వహిస్తున్నారు. ఆయా కులాల్లో తాము చెప్పిన లీడర్లే పదవుల్లో ఉంటే ఆ వర్గం ఓట్లన్నీ తమకే వస్తాయనే ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం పాకులాడుతున్నారు.

  • మద్దతుగా ఉన్న లీడర్లను గెలిపించుకునేలా..

ఇప్పటి వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, యువజన సంఘాల్లోనే రాజకీయ పరంగా నేతలు జోక్యం చేసుకునేవారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కుల సంఘాలను సైతం టార్గెట్ చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి కుల సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కుల సంఘాల్లోని కీలక పదవులు దక్కించుకుంటే ఎన్నికల్లో తమకు అనుకూలంగా తీర్మానాలు చేయించే అవకాశం ఉంటుందని అధికార బీఆర్ఎస్ తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ లీడర్లు భావిస్తున్నారు. దీంతో ఆదిలాబాద్​జిల్లాలో కుల సంఘాల ఎన్నికలు సైతం నిర్వహిస్తున్నారు.

ఏ కుల సంఘమైనా సరే తమకు అనుకూలంగా ఉన్న లీడర్లకు పదవులు దక్కేలా పావులు కదుపుతున్నారు. బీసీ, యాదవ, గౌడ, మున్నూరు కాపు, రెడ్డి, దళిత, పద్మశాలి ఇలా పలు కుల సంఘాల ఎన్నికలు జరగ్గా ఆయా పార్టీలు ఇప్పటికే తమకు మద్దతుగా ఉన్న లీడర్లను గెలిపించుకున్నారు. అయితే ఈ వ్యవహారం సంఘాల లీడర్ల మధ్య చిచ్చురేపుతోంది. ఒక్కో లీడర్ ఒక్కో పార్టీకి సపోర్టు చేస్తుండటం, దీంతో వారి మధ్య పొసగక మనస్పర్థలు వస్తున్నాయి. దీంతో కుల సంఘాల్లోనే కాకుండా సదరు సామాజికవర్గంలోనూ చీలికలు ఏర్పడుతున్నాయి. ఇవి గొడవలకు దారి తీస్తున్నాయి.


పార్టీల ‘బీసీ’ ఫార్ములా..

ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికార బీఆర్​ఎస్​ పార్టీ గతేడాది నుంచే బీసీ సామాజికవర్గంలోని వివిధ కులాలను చేరదీస్తోంది. ఇందులో భాగంగానే కుల సంఘాలకు రీడింగ్ రూమ్​ల పేరిట కమ్యునిటీ హాల్స్​కు నిధులు, స్థలాల కేటాయింపు లాంటి నజరానాలు ఇస్తూ ఆ కులంలో పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనికి తోడు కులాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రకటిస్తోంది.

కేవలం ఓటు బ్యాంకు రాజకీయంపైనే గురిపెట్టిన ఆ పార్టీ.. బీసీ కులాల ప్రాతిపాదికనే ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్ తదితర చోట్ల నామినేటెడ్ పదవులను కేటాయించిందనే విమర్శలు ఉన్నాయి. నిర్మల్​లో అత్యధిక సామాజిక వర్గంగా ఉన్న పద్మశాలి సంఘానికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అప్పజెప్పగా.. ఖానాపూర్​లో అధిక జనాభా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఆ పదవిని కట్టబెట్టింది. వీటితో పాటు పార్టీ పదవులు, మరికొన్ని నామినేటెడ్ పదవులను ఎక్కువగా బీసీలకే ఇచ్చారు.

కాంగ్రెస్, బీజేపీలు కూడా బీసీ ఫార్ములానే అమలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.   బీజేపీ బీసీల్లోని సంప్రదాయ కులాలను ప్రధానంగా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా బీసీ కులాల్లోని యూత్​పై ఫోకస్ పెడుతోంది. అనుబంధ సంఘాల కార్యవర్గాల్లో బీసీ సామాజికవర్గంలోని కులాల వారికి ప్రాధాన్యత ఇస్తోంది. కాంగ్రెస్ సైతం దాదాపు ఇదే ఫార్ములాని ఫాలో అవుతోంది.