
- లీడర్లే హీరోలు.. మారుతున్న ట్రెండ్
- మంత్రి కొండా ఫ్యామిలీ జీవిత కథతో కొండా!
- ఎమ్మెల్సీ అద్దంకి హీరోగా ఇండియా ఫైల్స్
- మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కథే ‘ఏ లవ్ ఆఫ్ వార్’
హైదరాబాద్: నిత్యం ప్రజల్లో ఉంటున్న నాయకులు రీల్ హీరోలుగా మారుతున్నారు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, రామకష్ణహెగ్డే, కృష్ణ, జయలలిత, దాసరి నారాయణరావు, రామానాయుడు, హరికృష్ణ, జయప్రద, జయసుధ, మోహన్ బాబు, శారద, మురళీమోహన్, కృష్ణంరాజు, విజయశాంతి, బాలకృష్ణ, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, చిరంజీవి, రోజా, పవన్ కల్యాణ్, సురేశ్ గోపి ఇలా ఎందరో నటీనటులు రీల్ లైఫ్ వదిలి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.
పొలిటికల్ లీడర్లు, వారి జీవిత కథలే సినిమాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. వారి జీవిత కథలు సినిమాలుగా మారుతున్నాయి. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా కొండా. కొండా మురళి రాజకీయ నేపథ్యం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మంత్రి కొండా సురేఖ దంపతుల కథే ఈ సినిమా. ఈ సినిమాను కొండా మురళి, సురేఖ దంపతుల కుమార్తె సుస్మితా పటేల్ నిర్మించారు.
కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హీరోగా వస్తున్న ఇండియా ఫైల్స్. ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ సినిమాలో అద్దంకి దయాకర్ అనే రోల్ లోనే ఎమ్మెల్సీ నటించారు. దయాకర్ సెమీ బయెగ్రఫీ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఇంద్రజ హీరోయిన్ గా నటించింది. సుమన్, సితార, శుభలేఖ సుధాకర్ కూడా ఈ సినిమాల్లో కనిపిస్తారు. పదివేల సంవత్సరాల చరిత్ర ఈ సినిమాలో ఉంటుందంటున్నారు అద్దంకి దయాకర్.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బయోగ్రఫీ ఆధారంగా మరో సినిమా తెరెకెక్కుతోంది. ‘జగ్గారెడ్డి.. ఎ వార్ ఆఫ్ లవ్’ అనే సినిమాకు సంబంధించిన ఆఫీసును ఉగాది రోజున ప్రారంభించారు. ఈ సందర్బంగా తాను విద్యార్థి దశ నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని అన్నారు. ఈ సినిమాలో జగ్గారెడ్డి స్వయంగా నటిస్తున్నారు. ఇందుకోసం ఆయన డైలీ ప్రిపేర్ అవుతున్నారు కూడా. సినిమా గురించి ఆయన మాట్లాడుతూ. ‘సినీ హీరోలు ఎవరో రాసిన కథల్లో నటిస్తుంటారు. ఆయా సినిమాల్లో పోలీసులను కొట్టినట్లు.. వారితో ఫైటింగ్ చేసినట్లు నటన చేస్తుంటారు. కానీ ఇవ న్నీ నేను నా నిజజీవితంలో చేశా! నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్నా!’ అని చెప్పారు.
రాజకీయాల్లో తాను పోషించిన పాత్ర, సాధించిన విజయాలను ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలిపారు. ‘‘నా రాజకీయ జీవితానికి సంబంధించి కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ అంతా నాదే.’ అని జగ్గారెడ్డి చెబతున్నారు. ఈ సినిమాకు రామానుజం దర్శకత్వం వహిస్తుండగా.. జగ్గారెడ్డి కూతురు జయలక్ష్మి రెడ్డి, కుమారుడు తూర్పు దత్తసాయి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే మన మధ్యలో ఉన్న నాయకులే సిల్వర్ స్క్రీన్ పై దర్శనమిస్తుండటం ఏదో కొత్తగా అనిపిస్తుంది.