నాలాలపైనే లీడర్ల ఇండ్లు!

అయినా కూలుస్తలేరు
ఎమ్మెల్యే ఇంటికాడ నాలానే పక్కకు మలిపిన్రు
వరంగల్లో టాస్క్ ఫోర్స్ పనితీరుపై విమర్శలు
ఇలాగైతే సిటీ ముంపు కష్టాలు తీరేదెలా?

నాలాలపై ఆక్రమణల వల్లే వరద నీరు రోడ్ల మీదకు వచ్చిందనేది నూటికి నూరుపాళ్లు నిజం. జనం కూడా ఇదే చెప్పిన్రు. సిటీలో ఏ నాలా మీద చూసినా పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు కనపడుతున్నయ్. వాటిని వెంటనే తొలగించాలే. ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఆఫీసర్లకు ఎటువంటి పొలిటికల్ ప్రెజర్ ఉండదు. భారీ క్రేన్లు, జేసీబీలు తెప్పించండి. అక్రమ నిర్మాణాలన్నీ పోవాలే. భవిష్యత్తులో మళ్లీ ఎవరు నాలా లోపలకు రాకుండా ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టించాలే.
– ఈ నెల 18న వరంగల్ సిటీ పర్యటనలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్

సిటీలోని నాలాల మీద అక్రమ నిర్మాణాలు చేపట్టినవారు ఏ పార్టీకి చెందినవారైనా ఊరుకునేది లేదు. అధికార పార్టీకి చెందినవారి నిర్మాణాలు
ఉన్నా కూల్చివేతలు ఆపే ప్రసక్తిలేదు. ఏ ఒక్క ఆక్రమణ వదిలే ప్రసక్తేలేదు.
-19న ఎమ్మెల్యేలతో కలిసి ప్రెస్ మీట్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ రూరల్, వెలుగు: వరంగల్ సిటీ మునగడానికి కారణమైన నాలాల ఆక్రమణలు, వాటిపై నిర్మాణాలను కూల్చడంలో మంత్రి కేటీఆర్ చెప్పినదానికి, ఫీల్డు లెవల్లో జరుగుతున్నదానికి మ్యాచ్ అవట్లేదు. ఆక్రమణల్లో ఏ పార్టీవారున్నా వదలొద్దని, ఎట్టి పరిస్థితుల్లో పొలిటికల్ ప్రెజర్ ఉండదని మున్సిపల్ మంత్రి కేటీఆర్తో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టంగా చెప్పారు. అయినా చర్యలు తీసుకోవడంలోఆఫీసర్లు ఎందుకో జంకుతున్నారు. వరంగల్ సిటీలోని దాదాపు 15 నాలాలు,వాటి అనుబంధ మోరీలపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల నిర్మాణాలున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

ఇదిగో.. ఎమ్మెల్యే, కార్పొరేటర్ల ఆక్రమణలు
హన్మకొండ హంటర్ రోడ్డులోని టైర్ రిట్రేడింగ్ సెంటర్ పక్కన వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఇల్లు భద్రకాళి చెరువు వైపు వెళ్లే నాలాకు అడ్డుగా
ఉంది. వరంగల్ సిటీలోని శివనగర్లో ఆర్యవైశ్య భవన్ వైపు నుంచి వచ్చే నాలా మీద తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఇంటి ప్రహరీ ఉంది. దీనిని ఇటీవలే వేరొకరికి అమ్మారు. ఎమ్మెల్యే అనుచరుడు ఓ మూడొంతస్తుల ప్రైవేటుస్కూల్ ను పూర్తిగా నాలా మీదే నిర్మించాడు. వీళ్లిద్దరి కారణంగా ఈ నాలా కుంచించుకుపోవడంతో మొన్నటి వర్షాలకు కాలనీ మొత్తం నీట మునిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఉంటున్న ఇంటి దగ్గర సైతం వరద నీరొచ్చే మోరీపై అక్కడి నుంచి ఇక్కడి వరకు స్లాబ్ వేసిమూసేశారు. నన్నపునేని కార్పొరేటర్ గా పనిచేసిన సమయంలో తన డివిజన్ పరిధిలో నిర్మాణాలకు ఇష్టారీతిన అనుమతులు ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే ఇంటికి నాలుగు అడుగుల దూరంలో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద అదే పార్టీ కార్పొరేటర్ ‘దిడ్డి’ ఫ్యామిలీకి న్యూ వాహిని బార్ ఉంది. ఈ బిల్డింగూ పూర్తిగా నాలా మీదే ఉంది.

లీడర్ల ఇండ్లను ముట్టుకోని ఆఫీసర్లు
నాలాలకు అడ్డుగా ఉన్న ఏ ఇంటినైనా కూల్చివేయాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు అధికారులు జంకుతున్నారు. మంత్రి వచ్చి వెళ్లాక గడిచిన ఐదు రోజుల్లో నాలాలపై ఉన్న 24 ఆక్రమణలు, శిథిలావస్థలో ఉన్న 227 ఇండ్లను కూల్చివేసినట్లు టాస్క్ఫోర్స్
అధికారులు తెలిపారు. అదే సమయంలో మున్సిపల్ అధికారులు నాలాకు అడ్డుగా ఉన్న ఎమ్మెల్యే అరూరి క్యాంప్ ఆఫీస్ జోలికి ఇంతవరకు వెళ్లలేదు. అక్కడ నాలానే ఎడమ వైపునకు తిప్పారంటే ఆఫీసర్లు ఎంతలా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. రమేశ్ ఇంటిని ఆనుకుని ఉన్న రోడ్డును తవ్వి పైపులు వేసి మట్టిపూడ్చారు. వరంగల్ తూర్పు ఏరియాలో టీఆర్ఎస్ కార్పొరేటర్ కు చెందిన బార్ పూర్తిగా నాలాపైనే ఉన్నప్పటికీ దాని జోలికి వెళ్లలేదు. ఆర్యవైశ్య భవన్ వద్ద ఎమ్మెల్యే అనుచరుని స్కూల్, చుట్టాల ఇండ్లను ముట్టుకోలేదు. ఇదే ఇప్పుడు తీవ్రవిమర్శలకు తావిస్తోంది.

యాక్షన్‍ తీసుకుంటాం
వరంగల్‍ సిటీలో నాలాలపై ఆక్రమణల్లో ఎవరున్నా ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పకుండా యాక్షన్‍ తీసుకుంటాం. కూల్చివేతల్లో భాగంగా ఒక
లొకేషన్‍లో స్టార్ట్ చేసి వన్‍ బై వన్‍ అదే రూట్‍లో వెళుతున్నాం. ఆక్రమణలను గుర్తించే పనిలో మా సిబ్బంది పనిచేస్తున్నారు. ఇవికాక ఇంకేమైన
అక్రమ నిర్మాణాలు మా దృష్టికి వచ్చినా చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే విషయమై మా టాస్క్ పోర్స్ టీంకు ఆదేశాలు ఇస్తాం. -రాజీవ్‍గాంధీ హన్మంతు, వరంగల్‍ అర్బన్‍ కలెక్టర్‍ & టాస్క్ ఫోర్స్ చైర్మన్

For More News..

డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల అవస్థలు డబుల్

సర్కారు స్కూళ్లు షురూ..

కొత్త రూల్స్ తో రిజిస్ట్రేషన్లు ఢమాల్