పొలిటికల్​ లీడర్లు కోర్టులనుప్రభావితం చేస్తున్నరు

పొలిటికల్​ లీడర్లు కోర్టులనుప్రభావితం చేస్తున్నరు
  • హక్కుల కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి
  • సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.సింహాద్రి

ముషీరాబాద్, వెలుగు: రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి పిలుపునిచ్చారు. గురువారం బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. సింహాద్రితోపాటు పార్టీ అడ్వకేట్ ఫోరం జాతీయ అధ్యక్షుడు కిషన్ కన్నయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింహాద్రి మాట్లాడుతూ.. గ్లోబలైజేషన్​లో కొన్ని కులాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయన్నారు. అన్ని రంగాలను రెండు మూడు కులాలే శాసిస్తున్నాయని, రాజకీయ పార్టీలు ఆర్థిక అసమానతలను పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ నాయకులకు రూల్ ఆఫ్ లా మీద గౌరవం లేకుండా పోయిందని, కోర్టులను కూడా ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. సెక్యులరిజం రాజ్యాంగానికి ప్రాథమిక మూలమని చెప్పారు. దేశంలో కార్పొరేట్ శక్తులకు, పెద్ద కులాల వారికి మాత్రమే రక్షణ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో అరాచక పాలనకు అడ్డు వేయకపోతే బతకడం కష్టంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, సమాజ్ వాది పార్టీ ప్రధాన కార్యదర్శులు అక్కల బాలరాజ్, శ్రీహరి ముదిరాజ్, డాక్టర్ నిమ్మ తోట వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ తాటికొండ వెంకట రాజయ్య పాల్గొన్నారు.