జిట్టా ఆశలు నెరవేరేనా..? 2009 నుంచి ఇండిపెండెట్​గానే..

  • గ్రూప్​ రాజకీయాల్లో ఇమడగలరా..? 
  • ఈ వారంలోనే కాంగ్రెస్​లో చేరిక
  • సర్వే ప్రకారమే టికెట్ ఇస్తామన్న రేవంత్​ 

యాదాద్రి, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జిట్టా బాలకృష్ణారెడ్డి పొలిటికల్​ లైఫ్​ మలుపులు తిరుగుతూ ఉంది. ఇన్నాళ్లు అటుఇటు తిరిగిన ఆయన చివరికి హస్తం గూటికి చేరేందుకు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే  పీసీసీ చీఫ్ రేవంత్‌‌ రెడ్డిని కలిసిన ఆయన త్వరలోనే కాంగ్రెస్​ కండువా కప్పుకోనున్నారు. అయితే గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్​ పాలిటిక్స్‌‌ ఆయన ఇమడుతారా.?, అసలు ఆయనకు హైకమాండ్ టికెట్‌‌ ఇస్తుందా..? అనే చర్చ జరుగుతోంది. భవనగిరి నుంచి మూడుమార్లు పోటీ చేసి ఓడిపోయిన జిట్టా ఆశలు ఈసారైనా నెరవేరుతాయో.. లేదో..? చూడాలి.

2009 నుంచి ఇండిపెండెంట్‌‌గా..

యువజన సంఘాల సమితి స్టేట్​ ప్రెసిడెంట్‌‌గా చాలా కాలంగా వ్యవహరించిన  జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారు. భువనగిరి డివిజన్​లో బీఆర్‌‌‌‌ఎస్‌‌ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. తెలంగాణ భవన్​ ఏర్పాటు చేసి ఉద్యమానికి వేదికగా చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్​ఇవ్వకపోవడంతో బీఆర్‌‌‌‌ఎస్‌‌ను వీడి భువనగిరి నుంచి ఇండిపెండెంట్​గా పోటీ చేసి ఉమామాధవ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత యువ తెలంగాణ పార్టీని స్థాపించి 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2022 ఫిబ్రవరి 16న ఆయన బీజేపీలో చేరడంతో పాటు యువ తెలంగాణ పార్టీని విలీనం చేసినట్టు ప్రకటించారు. బీజేపీలో ఉన్నది కొన్నిరోజులే అయినా క్రియాశీలకంగా పని చేశారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉండడం, అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో జిట్టాను బీజేపీ నుంచి సస్పెండ్​ చేస్తున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్​ రెడ్డి ప్రకటించారు. 

కుంభం వీడడంతో.. లైన్​ క్లియర్​

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డితో ఉన్న విభేదాల కారణంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి బీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరిన విషయం తెలిసిందే. దీంతో అప్పటివరకూ చేరాలా వద్దా..? అన్న మీమాంసలో  ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డికి లైన్‌‌ క్లియర్‌‌‌‌ అయ్యింది. కాంగ్రెస్​కు చెందిన కొందరు లీడర్లు కూడా జిట్టాను ఆహ్వానించినట్లు తెలిసింది. దీంతో   ఆయన బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన మహబూబ్​నగర్​మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాసరెడ్డితో కలిసి మూడు రోజుల కింద పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డిని కలిశారు. వారితో గంటకుపైగా చర్చించిన రేవంత్ రెడ్డి వారంలోనే చేరిక తేదీని ఖరారు చేస్తామని చెప్పారు.

ALSO READ: వైద్య రంగానికి మహర్దశ : ఇంద్రకరణ్​ రెడ్డి

భువనరిగి నుంచి 11 మంది అప్లై

భువనగిరి అసెంబ్లీ టికెట్ కోసం భువనగిరి టికెట్​ కోసం ఇప్పటికే 11 మంది అప్లయ్​ చేసుకున్నారు. కాంగ్రెస్​ పాత కాపు చింతల వెంకటేశ్వర్​రెడ్డి కూడా టికెట్​హామీ ఇస్తే చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. మరోవైపు సర్వేలో బలమైన అభ్యర్థిగా తేలిన లీడర్​కే అవకాశం ఇస్తామంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్​లో చేరబోతున్న జిట్టాకు   పోటీ చేసే ఛాన్స్​ దక్కుతుందా..? అన్నదే ఇప్పుడు జిల్లాలో హాట్​ టాపిక్‌‌గా మారింది. అంతేకాదు బీజేపీలోనే ఇమడలేక బయటకు వచ్చిన ఆయన కోమటిరెడ్డి, నాన్​ కోమటిరెడ్డి గ్రూపులు మధ్య ఇమడగలరా..? అన్న చర్చ కూడా నడుస్తోంది. 

కోమటిరెడ్డి వెంటే 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం బలంగా ఉంది. నకిరేకల్, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి మాటే చెల్లుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఆయన సూచించిన వారిని అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా కోమటిరెడ్డి వెంట నడవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయన ద్వారా తమ లీడర్ జిట్టాకు కాంగ్రెస్ టికెట్ వస్తుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు.