20 ఏళ్లు నాన్​స్టాప్​గా: మామిడి టెంకలతో గంజి తాగే రోజులవి..!

నమ్మరుగానీ, లోకల్​ జనాలతో మాట్లాడడం రాని వ్యక్తి… ఏకంగా 20 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్నారు!
ఆయన జనాన్ని అడిగేదొకటే…‘అపనా మానే ఖుసీ తా (మీరు హేపీగాఉన్నారా)’ అని.
పవర్​లోకి వచ్చేసరికి లోటు బడ్జెట్​, సరైన తిండి గింజలు లేక మామిడి టెంకలతో గంజి కాచుకు తాగే పరిస్థితులు.
వీటన్నింటి నుంచి బయటపడేశారు. అధికారులు, ప్రజలు ‘మో గవర్నమెంట్​ (నా ప్రభుత్వం)’ అనుకునేలా చేశారు.
దేశంలో ఓటమి లేకుండా వరుసగా నెగ్గిన సీఎంల్లో మూడో స్థానంలో ఉన్నారు. ఆయనే నవీన్​ పట్నాయక్​.

దేశంలో ఎక్కువకాలం ముఖ్యమంత్రులుగా కొనసాగిన లిస్టులో… ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​ మరో మెట్టు పైకెక్కారు. 2000 సంవత్సరం నుంచి గ్యాప్​ లేకుండా వరుసగా నెగ్గుతున్నారు. ప్రస్తుతం నవీన్​ సీఎంగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయనకంటే పైన సిక్కిం మాజీ సీఎం పవన్​కుమార్​ చామ్లింగ్​ (24 ఏళ్ల ఆరు నెలలు), పశ్చిమ బెంగాల్​ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు (23 ఏళ్ల మూడు నెలలు) ఉన్నారు. వీళ్లు కాకుండా, సీఎంలుగా 20 ఏళ్లకు పైగా పనిచేసినవాళ్లు ముగ్గురున్నప్పటికీ.. వాళ్ల పదవీకాలంలో మధ్య మధ్య గ్యాప్​లున్నాయి. కాబట్టి, ఏకబిగిన సీఎం సీటులో కొనసాగుతున్న సీఎంగా నవీన్​ మూడో స్థానంలో ఉన్నారు.

నవీన్​ పట్నాయక్​పై ప్రత్యర్థులు అనేక జోకులు పేలుస్తున్నా జనాలు మాత్రం ఆయన అడ్మినిస్ట్రేషన్​పై బాగా నమ్మకంతో ఉన్నారు. నవీన్​ చదువు మొత్తం ఇంగ్లిష్​ మీడియంలో సాగడం, తర్వాత విదేశాలకు వెళ్లడం తదితర కారణాలతో ఆయనకు ఒడియా భాష రాదు. సీఎంగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారుగానీ, ఇప్పటికీ లోకల్​ జనాలతో మాట్లాడలేరు. సభలు, సమావేశాల్లో ఒడియాని ఇంగ్లిషులో రాసుకుని చదువుతారు. ఇదొక్కటే ఆయనకున్న ఇబ్బంది. దాన్ని జనాలు పట్టించుకోనప్పుడు పొలిటికల్​ అపోనెంట్లు ఎన్ని సెటైర్లు వేసినా అనవసరం అంటారు ఎనలిస్టులు.  2000లో జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేతో కలిసి పోటీ చేసి, అధికారంలోకి వచ్చారు. తొమ్మిదేళ్ల తర్వాత ఎన్డీయే నుంచి బయటకొచ్చేసి సొంతంగానే పోటీ చేస్తూ ఓటమి అనేది లేకుండా నెగ్గుతున్నారు.

ఈ 20 ఏళ్లలో ఒడిశాకి కొత్త రాజకీయాలు నేర్పారు. కేవలం ఓట్లు, సీట్లు లెక్కలతో కాకుండా జనాలకు కావలసినవి సమకూరుస్తున్నారు. ఆయన దరిదాపుల్లోకి మరో పార్టీగానీ, మరో నాయకుడుగానీ లేరంటారు పొలిటికల్​ పరిశీలకులు. రాష్ట్రంలో ఆయన మూడు అజెండాలతో… డెవలప్​మెంట్​, ప్రజా సంక్షేమం, మచ్చ లేని పరిపాలనలతో ముందుకు సాగుతున్నారు.ఇది ఆయన తండ్రి బిజూ పట్నాయక్​కిసైతం సాధ్యం కాని టాస్క్​! బిజూ రెండుసార్లు సీఎంగా చేసినా వరుసగామాత్రం నెగ్గలేకపోయారు. నవీన్​కి జనంలో చాలా మంచి ఇమేజ్​ ఉంది. ఆయన ‘గుడ్​ పాలిటిక్స్​’ నడుపుతుంటారని, ఈ మోడల్​ దేశంలో ఏ పొలిటీషియన్​ వల్ల కాలేదని ఎనలిస్టులు అంటున్నారు. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నవీన్​ నమూనానే ఆప్​ పార్టీ తీసుకుందని, ‘గుడ్​ బాయ్​’ ట్యాగ్​తో అరవింద్​ కేజ్రీవాల్​ సక్సెసయ్యారని అంటారు. నవీన్​ ఎక్కడా కాంట్రవర్సీలోకి వెళ్లరు. ఆయన ప్రచారం ఎప్పుడూ పాజిటివ్​ థింకింగ్​తోనే సాగుతుంది. సరిగ్గా ఇదే స్ట్రేటజీతో ఆప్​ ప్రచారం సాగింది. ఒడిశా ఓటర్ల మాదిరిగానే ఢిల్లీ జనాలుకూడా గుడ్​ పాలిటిక్స్​కి ఓటేశారని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రజల రోజువారీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఇబ్బందులే నవీన్​ ప్రచారంలో ఉంటాయి. వాటినే ప్రస్తావిస్తూ, గతంతో పోలుస్తూ, తనకు ఓటేస్తే మరింత అభివృద్ధిని చూపిస్తామని చెప్పుకుంటారు. పోయినేడాది లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నవీన్​ పాలనను వేలెత్తి చూపడానికి ఆపోనెంట్​ పార్టీల దగ్గర ఏమీ లేదు.  అందువల్లనే యాంటీ–ఇంకబెన్సీ అనే పదం నవీన్​ దగ్గరకు రావడం లేదు.

మామిడి టెంకలతో గంజి తాగే రోజులవి…

2000లో ఆయన అధికారానికి వచ్చేటప్పటికి ఒడిశాలో కరువు పరిస్థితులున్నాయి. ఆర్థికంగా రాష్ట్ర ఖజానా లోటులో ఉంది. సాధారణ ప్రజలు, ట్రైబల్స్​ సరైన తిండిగింజలు లేక మామిడి టెంకల్ని ఎండబెట్టుకుని గంజి కాచుకు తాగేవారు. నవీన్​ ఈ పరిస్థితిని చూసి చలించిపోయారు. రాష్ట్రంలో రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణం స్పందించేలా అడ్మినిస్ట్రేషన్​ని తయారు చేశారు. రాష్ట్ర బడ్జెట్​ని నాలుగింతలు పెంచారు. 2004–05లో రూ. 30,861 కోట్లున్న బడ్జెట్​ని, ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షా 20 వేల కోట్ల రూపాయలకు తీసుకురాగలిగారు. ఎకానమీలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుతూ జీతాలు సకాలంలో చెల్లించే స్థాయికి తీసుకెళ్లారు. ఉద్యోగులు, పించన్​దారులు, ప్రజలు ‘ఇది మో గవర్నమెంట్​ (నా ప్రభుత్వం)’ అనుకునేలా చేశారు. ఆహార్​ మీల్స్​, ఫ్రీ మొబైల్​ ఫోన్లు, స్కూలు పిల్లలకు సైకిళ్లు, కాలేజీ స్టూడెంట్లకు లాప్​టాప్​లు వంటి పాప్యులిస్ట్​ స్కీమ్​లుకూడా ప్రవేశపెట్టారు.

నవీన్​ పాలనను రెండు భాగాలుగా విడదీసి చూడాలి. ఫస్ట్​ టర్మ్​లో ఎన్డీయేతో కలిసి నడిపిన ప్రభుత్వాన్ని, సెకండ్​ టర్మ్​లో ఎన్డీయేకి దూరంగా ఒంటరిగా నడుపుతున్న ప్రభుత్వాన్ని చూడాలంటున్నారు ఎనలిస్టులు. తన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులకోసం పోరాడుతుంటారు. అలాగని, కేంద్రంతో తగాదాకి దిగరు నవీన్.  నవీన్​ పాలిటిక్స్​లోకి వచ్చేసరికి 50 ఏళ్లు దాటిపోయాయి. అది నిజానికి పాలిటిక్స్​లో ప్రవేశించే వయసు కాదు.  గాంధేయ మార్గంలో ఆయన ప్రజలకోసం పనిచేయడమే వరుస విజయాలకు కారణంగా తేల్చారు. ఆయన ప్రభుత్వాల్లో ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలొస్తే క్షమించరు. తన కేబినెట్ల నుంచి ఇప్పటివరకు 44 మంది మినిస్టర్లను తొలగించారు. ప్రజలనుద్దేశించి మాట్లాడేటప్పుడు ‘అపనా మానే ఖుసీ తా (మీరు హేపీగా ఉన్నారా)’ అని అడుగుతారు. ఈ మాటతోనే జనాన్ని ఆకట్టుకుంటున్నారు.

వ్యతిరేకించింది తక్కువే!

ఎన్డీయేలో లేకపోయినా మోడీ సర్కారుతో కయ్యానికి దిగిన సందర్భాలు లేవు. నవీన్​ పట్నాయక్​ ఫస్ట్​ ప్రయారిటీ ఒడిశానే. అందుకే ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన చాలా బిల్లులకు, తీసుకున్న నిర్ణయాలకు సపోర్ట్​ ఇచ్చారు.

మైన్స్​ అండ్​ మినరల్స్ (డెవలప్​మెంట్​ అండ్​ రెగ్యులేషన్​) అమెండ్​మెంట్​ బిల్లు–2015కి మద్దతు

2017లో ఎన్డీయే ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి రామ్​నాథ్​ కోవింద్​కీ సపోర్ట్​.

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడి ఎన్నికకు మద్దతు

మోడీ సర్కారు–1పై నాన్​–ఎన్డీయే పక్షాలు అవిశ్వాస తీర్మానంపై మౌనం. తెలివిగా బీజేడీ వాకౌట్.

పెద్ద నోట్ల రద్దు, గూడ్స్​ అండ్​ సర్వీసెస్​ ట్యాక్స్​ (జీఎస్​టీ) వంటి నిర్ణయాలపై సమర్థన.

ట్రిపుల్​ తలాక్​ నిషేధ బిల్లు, బాలాకోట్​లో సర్జికల్​ స్ట్రయిక్స్​, ఆర్టికల్​–370 రద్దులపై సపోర్ట్​

సిటిజెన్​షిప్​ అమెండ్​మెంట్​ చట్టం రావడానికి లోక్​సభలో పూర్తి మద్దతు

అలా అని ఆయన ప్రతిసారీ కేంద్రాన్ని మెచ్చుకున్నారనుకుంటే పొరపాటు. జాతీయ, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారు. మహానది నీళ్ల గొడవ, పోలవరం ప్రాజెక్టు పంచాయతీ వంటి అంశాల్లో మోడీ గవర్నమెంట్​ని తీవ్రంగా విమర్శించారు. వరికి కనీస మద్దతు ధర పెంచాలని కోరుతూ… రైతులతో ఢిల్లీకి ర్యాలీ కూడా నిర్వహించారు.

సడెన్​గా వచ్చారు… స్థిరపడిపోయారు

ఒడిశా రాజకీయాల్లో నవీన్​ ఎంట్రీ అకస్మాత్తుగా జరిగింది. పాలిటిక్స్​తో సంబంధం లేకుండా విదేశాల్లో గడుపుతున్న రచయిత ఆయన. 1997లో తండ్రి బిజూ పట్నాయక్ చనిపోవడంతో నవీన్​ పొలిటికల్​ ఎంట్రీ ఇచ్చారు. బిజూ చనిపోయేవరకు జనతాదళ్​లోనే ఉండేవారు. నవీన్  ‘బిజూ జనతా దళ్​ (బీజేడీ)’ స్థాపించారు. అస్కా నుంచి బై ఎలక్షన్​లో పోటీచేసి లోక్​సభకు ఎన్నికయ్యారు.

సహాయంతో జనానికి చేరువ

ఒడిశాని ఈ 20 ఏళ్లలో కుదిపేసిన సూపర్​ సైక్లోన్​, ఫణి, ఫైలిన్​ తుపాన్​ సమయాల్లో ప్రజలకు అండగా నిలిచారు.  నవీన్​ ప్రభుత్వం స్పందించిన తీరుకు ఇంటర్నేషనల్​గా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. 1999లో వచ్చిన సూపర్​ సైక్లోన్​ సహాయక కార్యక్రమాల్లో అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం ఫెయిలైంది. దాంతో, 2000లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేతో కలిసి అధికారానికి వచ్చారు.  అప్పటినుంచి ఆయనకు తిరుగనేది లేకుండా పోయింది.

see also: మార్చి 31 వరకు కరోనా సెలవులు

ఒక్కొక్కరు ఆరుగుర్ని కనండి