బీసీ కార్డుతో బీజేపీ బలం పెరిగేనా? : డాక్టర్ తిరునాహరి శేషు

బీసీ కార్డుతో  బీజేపీ బలం పెరిగేనా? : డాక్టర్ తిరునాహరి శేషు

తెలంగాణ రాష్ట్ర శాసనసభకు మూడోసారి జరగబోతున్న ఎన్నికల్లో  బీసీ నినాదం బలంగా వినపడుతోంది. పార్టీల జయాపజయాల్లో  బీసీల ఓట్లు కీలకం కాబోతున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బీసీల జపం చేస్తున్నాయి. బీసీల ఓట్లను పొందటానికి, బీసీ కులాలను ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ ఎత్తుగడలతో పాటు అనేక రకాలైన హామీలు ఇస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో కూడా బీసీలు 50 శాతం కంటే ఎక్కువ జనాభానే  ఉన్నారు. దశాబ్దాలుగా ఈ వర్గాలు ఓట్లు వేసే యంత్రాలుగానే మిగిలిపోయాయి. 

రాజ్యాధికారంలో సరైన వాటా, భాగస్వామ్యం దక్కలేదనే అభిప్రాయం ఈ వర్గాల్లో బలంగా నాటుకుపోయింది. 58 సంవత్సరాలు కొనసాగిన సమైక్యాంధ్రప్రదేశ్​లో ఒక్కసారి కూడా బీసీ వర్గాలకు ముఖ్యమంత్రిగా అవకాశం దక్కలేదు.అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా శాసనసభలో కానీ, మంత్రిమండలిలో కానీ బీసీ వర్గాలకు బీఆర్ఎస్​ సముచితమైన స్థానం ఇవ్వలేదు. 

తెలంగాణ రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు ప్రస్తుత శాసనసభలో 18.4 శాతం,  మంత్రిమండలిలో 16.6 శాతం మాత్రమే ప్రాతినిధ్యం దక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. తన పది సంవత్సరాల పాలనా కాలంలో రాజకీయ అధికారంలో బీసీ వర్గాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తితో బీసీలు ఉన్నారు.

 ముఖ్యంగా ఈసారి శాసనసభకు పోటీ చేయడానికి కేవలం 22 మంది బీసీలకు మాత్రమే బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. దీంతో తమకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదని బీసీ వర్గాలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో మంత్రివర్గంలో,  నామినేటెడ్ పదవుల్లో, బడ్జెట్ కేటాయింపుల్లో, ఫీజు రియింబర్స్​మెంట్​ చెల్లింపులో అన్యాయం జరిగిందనే భావన బీసీల్లో వ్యక్తం అవుతోంది.

బీసీలకు కాంగ్రెస్​ అన్యాయం

కర్ణాటక శాసనసభకి జరిగిన ఎన్నికలో బీసీల ఓట్లతో ‘అహిందా’ పొలిటికల్ ఇంజినీరింగ్​తో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూడా గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్లపై కన్నేసింది. కాంగ్రెస్ ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో రెండు శాసనసభ స్థానాలు బీసీలకు కేటాయిస్తూ మొత్తం 34 శాసనసభ స్థానాలు కేటాయిస్తామనే హామీ ఇచ్చింది. కానీ, కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలను ఎంపిక చేసే క్రమంలో బీసీలకు సీట్లు కేటాయిస్తే ఓడిపోతారు అనే అభిప్రాయానికి వచ్చింది. 

హామీ ఇచ్చిన సీట్లను కూడా కేటాయించటానికి సిద్ధంగా లేని నేపథ్యంలో.. తమ వాటా కోసం పట్టుబడుతున్న బీసీ నాయకులకి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం అపాయింట్​మెంట్​ఇవ్వడంలేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్టులో భాగంగా 55 శాసనసభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. వీటిలో 12 ఓడిపోయే స్థానాలను బీసీలకు కేటాయించిందనే అభిప్రాయాన్ని బీసీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలను అవమానిస్తుంది. అన్యాయం చేస్తుందనే ఆరోపణలతో ఇప్పటికే బీసీ నాయకులైన పొన్నాల లక్ష్మయ్య, నందికంటి శ్రీధర్​ లాంటి వారు కారు ఎక్కేశారు. మరికొందరు పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నారు. 

బీజేపీ జెండా బీసీలకు అండ

బలమైన రెడ్డి సామాజికవర్గ అండదండలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్​పార్టీని.. బీసీ వర్గాల అండతో తెలుగుదేశం పార్టీ  ఎదుర్కొని నిలబడగలిగింది. అలాగే కేశవ ప్రసాద్ మౌర్యలాంటి బలహీన వర్గాల నేతతో,  వెనుకబడిన వర్గాల పార్టీ అయినా సోనేలాల్ అప్నా దళ్ లాంటి పార్టీల సహకారంతో ఉత్తరప్రదేశ్​లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో బీసీ వర్గాల అండతో తెలుగుదేశం పాత్రను పోషించాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్లుగా కనపడుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై అసంతృప్తిగా ఉన్న బీసీ సామాజిక వర్గాల ఓట్లను తమవైపు తిప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నది. తెలంగాణ శాసనసభకు జరిగే ఎన్నికల్లో  బీసీలకు 40 శాసనసభ స్థానాలను కేటాయించడం,  మేనిఫెస్టోలో బీసీల అభివృద్ధికి సంక్షేమానికి పెద్ద పీట వేయడం, బీజేపీ జెండా బీసీలకు అండ అనే నినాదంతో కమలం పార్టీ తన రాజకీయ వ్యూహాలను రూపొందిస్తున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్​కి లేని అనుకూలత బీసీల విషయంలో ఒక్క బీజేపీకి మాత్రమే ఉంది.  బీసీని ముఖ్యమంత్రి చేసే అవకాశం బీజేపీకి ఉంది. కాబట్టి బీసీలు బీజేపీ వైపు మొగ్గే అవకాశాలు ఉన్నాయి.  ప్రస్తుతం జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాల్లో బలమైన ముదిరాజ్, పద్మశాలి వర్గాలకు బీఆర్ఎస్ సరైన ప్రాతినిధ్యం కల్పించలేదు. ఇదికూడా బీజేపీకి రాజకీయంగా కలిసి వచ్చే అంశం.

ప్రధాని మోదీ బీసీ

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులైన ఈటల రాజేందర్, బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్, కోవా లక్ష్మణ్, బూర నర్సయ్య గౌడ్ లాంటి బీసీ నాయకులు ఆయా వర్గాలను ప్రభావితం చేయగల బలమైన నేతలు. ఇటీవల ఈటల రాజేందర్ తన సామాజిక వర్గంతో భారీ బహిరంగ సభను నిర్వహించి తమ సత్తా చాటి చెప్పారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ సామాజిక వర్గానికి చెందటం, కేంద్ర మంత్రివర్గంలో ఎన్నడూ లేనివిధంగా ఓబీసీలకు 27మంత్రి పదవులు కేటాయించటం, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్​కి రాజ్యాంగబద్ధమైన హోదా ఇవ్వడం తమకు కలిసి వస్తుందని బీజేపీ విశ్వసిస్తున్నది. 2019 లోక్​సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తన ఓటు బ్యాంకుని ఏడు శాతం నుంచి 19 శాతానికి అంటే.. అదనంగా 13 శాతం ఓటు బ్యాంకుని పెంచుకుంది. అదేవిధంగానే బీసీ కార్డుతో మరో పదిశాతం ఓటు బ్యాంకుని పెంచుకోగలిగితే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా ఎన్నికల రణక్షేత్రంలో బలమైన రాజకీయ శక్తిగా నిలుస్తుంది. దశాబ్దాలుగా రాజకీయ ప్రాధాన్యత, అధికారానికి దూరంగా నెట్టి వేయబడుతున్న బీసీలకు ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా పార్టీ తెలంగాణలో బలంగా ఎదిగే అవకాశం ఉంది.

- డాక్టర్ తిరునాహరి శేషు, కాకతీయ యునివర్సిటీ