నిర్మల్​ జిల్లాలో మారుతున్న సమీకరణలు

  • ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడి రాజీనామా

  • బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్న మరికొంతమంది

నిర్మల్,వెలుగు: నిర్మల్ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు లీడర్లు బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. సోమవారం కాంగ్రెస్​ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామారావు పటేల్ పదవి, పార్టీకి రాజీనామా చేయడం చర్చకు దారితీసింది. అభిమానులు, అనుచరులతో కలిసి ఆయన కాషాయం గూటికి రావాలని నిర్ణయించుకున్నారు. నిర్మల్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్  సీనియర్ లీడర్​ ఒకరు కూడా పార్టీకి వీడేందుకు సిద్ధమయ్యారు. ఈయనకు సెగ్మెంట్​లో మంచి పట్టు ఉంది. బీసీ లీడర్​గా గుర్తింపు ఉంది. ఆయన భార్య ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్​పర్సన్​గా కూడా పనిచేశారు. కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన ఏ క్షణమైనా టీఆర్ఎస్​కు గుడ్​బై చెప్పే అవకాశాలు ఉన్నాయి.​  ఖానాపూర్ సెగ్మెంట్ పై  కూడా బీజేపీ హైకమాండ్ ​దృష్టి సారించిందని తెలిసింది. నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లను పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

అంతుపట్టని మహేశ్వర్ రెడ్డి అంతరంగం... 

ఇది ఇలాఉంటే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారనే చర్చ జరుగతోంది. ఈయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ బీజేపీలో చేరడంతో ఇప్పుడు అందరి చూపు మహేశ్వర్​రెడ్డిపై పడింది. ఆయన పరోక్ష సూచనల మేరకే రామారావు పటేల్ బీజేపీలో చేరుతున్నారని అభిమానులు చెబుతున్నారు. అయితే మహేశ్వర్ రెడ్డితో ఇప్పటికే  బీజేపీ జాతీయస్థాయి లీడర్లతో చర్చించినట్లు ప్రచారం జరుగుతుంది. వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణతో జిల్లాలో పొలిటికల్​సీన్​మారే అవకాశాలు లేకపోలేదు.