రాబోయే వేసవి కాలంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల వేడి సెగలతో రాజకీయ పార్టీలు ఇప్పటి నుండే ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ‘ఇండియా’ కూటమి ముచ్చటగా మూడోసారి ముంబాయిలో ఆగస్టు 31న సమావేశమయ్యింది. ముంబాయిలో కూటమి దశ-దిశ నిర్ణయిస్తామని ఇండియా కూటమి ప్రధాన నేతలు చెబుతున్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా పలు రాష్ట్రాల్లో సీట్లపై అవగాహన, కూటమి చైర్‌పర్సన్, కన్వీనర్ ఎంపిక, ఢిల్లీ లో ‘ఇండియా’ ప్రధాన కార్యాలయం ఏర్పాటుతో పాటు లోగో ఎంపిక తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. వీటికంటే ప్రధానంగా రాజకీయ సమీకరణాలు, ఓట్ల బదిలీలపై ‘ఇండియా’ పార్టీలు దృష్టి పెడితే ఫలితముంటుంది.
2004 కు, 2024 కు తేడా ఉంది
రెండు పర్యాయాలు వరుసగా అధికారంలో ఉన్న వాజ్‌పేయి ప్రభుత్వాన్ని 2004లో పడగొట్టినట్టు 2024లో కూడా రెండు సార్లు వరుసగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపుతామనే ధీమాతో ‘ఇండియా’ కూటమి ఉంది. 2004లో ‘యూపీఏ’ ప్రయోగం వలె 2024లో ‘ఇండియా’ ప్రయోగం విజయవంతం అవుతుందని వారు ఆశిస్తున్నారు. అయితే వాజ్‌పేయి ప్రభుత్వంలా మోదీ ప్రభుత్వాన్ని ఓడించడం అనుకున్నంత తేలిక కాదని ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. వాజ్‌పేయి ప్రభుత్వంలో ధరల పెరుగుదల ఎన్నికలపై ప్రభావం చూపిందని, మోదీ ప్రభుత్వంలో కూడా ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య అధికంగా ఉండడంతో ఇండియా కూటమి గెలుపు సులభమనే వాదన ఉంది. వీటిపై పలు సర్వేలు తీసుకున్న ప్రజాభిప్రాయాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను సున్నితమైన జాతీయత అంశాలు, అభివృద్ధి అంశాలు కప్పిపెడుతున్నాయని తేలింది. బీజేపీ ప్రభుత్వం చెప్పుకునే ‘సబ్ కా వికాస్’పై 2014లో 27% సంతృప్తి వ్యక్తం చేయగా, 2023లో దీనిపై 38% సంతృప్తి వ్యక్తం చేయడం మోదీ ప్రభుత్వానికి అదనపు బలం.
ఇండియా కూటమి ఎమ్మెల్యేలే అధికం
‘ఎన్‌డీఏ’–‘ఇండియా’ బలాబలాలను చూస్తే సంఖ్యా బలంగా లోక్‌సభలో ఎన్‌డీఏకు భారీ ఆధిక్యం కనిపిస్తుంటే, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ లెక్కలు చూస్తే ఇండియా కూటమికి ఆధిపత్యం కనిపిస్తుంది. రాష్ట్రాల అసెంబ్లీల్లో ఉన్న ఇండియా కూటమి బలం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందా అనేదే మిలియన్ డాలరు ప్రశ్న. ఇండియా కూటమి11 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే, ఎన్‌డీఏ 14 రాష్ట్రాలను పాలిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఈ రెండు కూటముల్లో లేవు. ఎన్‌డీఏ అధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్టు కనిపిస్తున్నా సంఖ్యాపరంగా ఇండియా కూటమిదే ఆధిపత్యం. దేశవ్యాప్తంగా మొత్తం 4120 అసెంబ్లీ సీట్లలో ప్రస్తుతం 1852 సీట్లు ఇండియా కూటమిలోని పార్టీల చేతిలో ఉన్నాయి. ఎన్‌డీఏ కూటమి పార్టీలు1585 సీట్లను కలిగున్నాయి. ఈ రెండు కూటముల్లో లేని పార్టీలకు 683 స్థానాలున్నాయి. ఓట్ల శాతాలను పరిశీలిస్తే ఇండియా కూటమిలోని పార్టీలు 39.7%, ఎన్‌డీఏ 34.7%, ఇతర పార్టీలు 25.5% ఓట్లను కలిగున్నాయి. ఈ సంఖ్యలను చూస్తే ఇండియా కూటమి ఎన్‌డీఏ కూటమిపై స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది.
‘ఇండియా’ మ్యూజికల్ చైర్స్?
ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ లోని అన్ని స్థానాలకు పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించిందనే వార్తలపై ‘ఆప్’ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాహుల్ ప్రధాని అభ్యర్థికి సరైన వారంటూ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు వ్యాఖ్యానించారు. మరోవైపు ఆప్ కేజ్రీవాల్, టీఎంసీ మమతాబెనర్జీ పేర్లను తెరమీదకు తెస్తున్నాయి. బెంగళూరు సమావేశానంతరం ఇండియా కూటమిలోని పార్టీలు పార్లమెంట్ సమావేశాల్లో కలిసికట్టుగా ప్రతిపక్ష పాత్రను పోషించడంలో విజయవంతమయ్యాయి. ఇదే స్పూర్తిని ఇకపై కూడా కొనసాగిస్తే ఎన్‌డీఏ ఆత్మరక్షణలో పడే అవకాశాలుంటాయి. మోదీకి సరితూగే ప్రత్యామ్నాయాన్ని ఇండియా కూటమి తెరమీదకు తెస్తే ఎన్‌డీఏకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలుంటాయి. లేకపోతే ఇండియా కూటమి ఆశలు అడియాసలవడం ఖాయం. ముంబాయి వేదికగా ‘బీజేపీ చలేజావ్’ అంటూ ఇండియా కూటమి ఇస్తున్న నినాదం నిజమవ్వాలంటే కూటమిలోని పార్టీలన్నీ ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే కూటమిలోని పార్టీలు ‘మ్యూజికల్ చైర్స్’ ఆట ఆడుతున్నాయని వ్యాఖ్యనిస్తున్న బీజేపీ మాటలు నిజమవుతాయి.
ఎన్‌డీఏ బలమే ఎక్కువ
2018 చివరిలో జరిగిన రాజస్థాన్, ఛత్తీసగఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, తెలంగాణలో బీఆర్‌ఎస్, మిజోరంలో బీజేపీ గెలిచాయి. ఐదు నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన రాష్ట్రాల్లో కూడా మంచి ఫలితాలు సాధించింది. లోక్‌సభ ఎన్నికల పరిణామాలు వేరుగా ఉంటాయి. గతంలో బీహార్‌లో ఎన్‌డీఏతో జతకట్టిన జేడీ(యూ) ఇప్పుడు ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిలో చేరింది. బెంగాల్‌లో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు టీఎంసీతో జతకట్టాయి. లోక్‌సభలో వీటి సంఖ్యా బలాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం ఇండియా కూటమికి 141, ఎన్‌డీఏ కూటమికి 330 స్థానాలున్నాయి. ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఇండియా కూటమి 37.2%, ఎన్‌డీఏ కూటమి 42.3%, ఇతర పార్టీలకు 20.5% ఓట్ల శాతం ఉంది. ఇలా ఇండియా కూటమిపై ఎన్‌డీఏ ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవలి సర్వేలో ఎన్‌డీఏ 43% ఓట్లతో 306 స్థానాలు, ఇండియా కూటమి 41% ఓట్లతో 193 స్థానాలను, ఇతరులు 16% ఓట్లతో 44 స్థానాలు సాధిస్తాయని తేలింది. 3% ఓట్ల తేడాతోనే ఎన్‌డీఏకు, ఇండియా కూటమి కంటే 113 స్థానాలు ఎక్కువొస్తాయని తెలిపింది. పశ్చిమ బెంగాల్, కేరళలో ఓట్ల బదిలీ సమస్య, యూపీ, బీహార్‌లో రాజకీయ సమీకరణల సమస్య ఇండియా కూటమికి ఎదురు కావొచ్చు.