మరో నాలుగు మాసాల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల్లో తమ ఉద్దేశాలు, విధానాలు, హామీలను వివరించే మ్యానిఫెస్టోలు ప్రజాస్వామ్యంలో ప్రధాన అంశం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా మ్యానిఫెస్టోలు కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కానీ గెలుపే ధ్యేయంగా నడుస్తున్న నేటి ‘ఉచిత’ రాజకీయాలు దేశాభివృద్ధికి పెనుముప్పుగా తయారయ్యాయి. ప్రభుత్వాల బడ్జెట్లను, దేశవనరులను ఆవిరి చేస్తున్న ఉచితాలు ప్రజలపై రుణ భారాన్ని నానాటికి పెంచుతున్నాయి.
ఎన్నికల సమయంలో పార్టీ ప్రణాళికలను విడుదల చేయడం చట్టబద్ధమైనప్పటికీ వాటి అమలుకు నైతిక బాధ్యత వహించవలసిన అవసరం పార్టీలకు ఉండడం లేదు. అలవికాని హామీలు ఇవ్వడం, ఓటర్లను ప్రలోభ పెట్టడం, గెలిచాక నిలబెట్టుకోలేక పోవడం రివాజుగా మారింది. తమిళనాడులో ఉచిత చీరలు, ప్రెషర్ కుక్కర్లు, వాషింగ్ మిషన్లు, టెలివిజన్లతో ప్రారంభమైన ‘రేబిడీ సంస్కృతి’ నేడు దేశం అంతా విస్తరించింది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఉచిత వాగ్దానాలకు బాగా అలవాటు పడ్డాయి. ఉచిత కరెంటు, గ్యాస్ సిలిండర్లు, టికెట్ లేని బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి, రుణమాఫీ, స్కూటీలు, లాప్టాప్ లు, తాళిబొట్లు, పెళ్లికి సహాయం, తదితర పేర్లతో ఓటర్లను ప్రలోభపెడుతున్న పార్టీలు ఆర్థికవ్యవస్థను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. రాజకీయ పార్టీలు నేడు ఉచితాలకు సంక్షేమ పథకాలకు మధ్య విభజన రేఖను చెరిపివేస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి ప్రజలకు రోజువారి కనీస సదుపాయాలు రాయితీ ధరతో సులభంగా పొందేందుకు ఇచ్చే సంక్షేమ పథకాలను, ఎలాంటి హేతుబద్ధత లేకుండా విలాసాలను కూడా అవసరాలుగా భ్రమింపజేస్తూ ఉచితంగా ఇస్తూ అవి సంక్షేమ పథకాలుగా పార్టీలు చెబుతున్నాయి. అధికారమే పరమావధిగా సరికొత్త ఉచిత హామీలు ఇవ్వడంలో పార్టీలు తమలో తామే పోటీపడుతున్నాయి.
అహేతుక హామీలు
భారత రాజకీయాలకు శాపంగా మారిన ఈ ‘ఫ్రీబి కల్చర్’ తొలగించకపోతే దీర్ఘకాలంలో దేశాభివృద్ధి కుంటుపడటమే గాక శ్రీలంక తరహా సంక్షోభాల పాలయ్యే అవకాశం ఉంది. నిరుడు కొందరు బ్యూరోక్రాట్లు ఈ విషయమై ఒక నివేదికను ప్రధానమంత్రికి సమర్పించడమే గాక, ప్రధాని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అహేతుకమైన ఉచితాలను ప్రకటించే పార్టీల గుర్తింపు రద్దు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని అశ్విని కుమార్ ఉపాధ్యాయ 2002 జనవరిలో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా సుప్రీం కోర్టు ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేసింది. సాధారణ బడ్జెట్ కంటే ఉచిత బడ్జెట్ ఎక్కువగా ఉంటుందని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
నిష్పక్షపాత ఎన్నికలకు విఘాతం
ఉచితాలు నిష్పక్షపాత ఎన్నికలు అనే భావనకు విఘాతంగా మారుతున్నాయి. ప్రజల డబ్బుని ఎగురవేసి ఓట్లు సంపాదించే మార్గాలుగా పార్టీలు ఉచితాలను తీర్చిదిద్దుతున్నాయి. ఉచిత విద్యుత్తు, ఉచిత రవాణా లాంటి దారి తెన్నులేని, ప్రణాళిక లేని పథకాలు ఆయా సంస్థలను నిర్వీర్యం చేసి మొత్తంగా మూసివేతకు దారి తీయవచ్చు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు రుణ భారం పెరిగి ప్రాధాన్య రంగాలపై తగిన నిధులను వెచ్చించలేకపోతున్నాయి. బడ్జెట్ పై ఒత్తిడి పెరగటం, విద్య, ఆరోగ్య రంగాలకు నిధుల కొరత, దేశ స్థూల ఉత్పత్తి సామర్థ్యం, ఆర్థిక సమతుల్యం దెబ్బ తినటం, వాంఛనీయం కాని వస్తు సేవల వినియోగం పెరగటం, వంటి నష్టాలు కలుగుతాయి. సంక్షేమం పేరుతో బడ్జెట్ లో సింహం భాగం ఖర్చు చేయడం వల్ల సామాజిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల వృద్ధి, ఆధునికీకరణ జరగకపోవడం, సమాజం వెనుకబాటుకు గురికావడం జరుగుతుంది.
ఉచితాలపై కమిటీ వేయాలి మేనిఫెస్టోలోని హామీలతో వనరుల వివరాల సమర్పణ తప్పనిసరి చేయడమే గాక, అమలు చేయని పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఇవ్వాలి. ఉచితానుచితాలను నిర్ణయించేలా, ఉచితాలకు సంక్షేమ పథకాలకు మధ్య విభజన రేఖను గుర్తించేందుకు నిపుణుల కమిటీని నియమించాలి. రుణ భారం పెంచే ఆర్థికవృద్ధిని నష్టపరిచే ఉచితాలను రద్దు చేయాలి. ఈసీ అధికారాలపై గల పరిమితులను తొలగించాలి. సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వరంగా మారాలి గానీ, పార్టీలకు ఓట్ల వరంగా మారకుండా చూడాలి.
హేతుబద్ధ సంక్షేమం కావాలి
రాజకీయ పార్టీల భవిష్యత్తును, అధికారాన్ని నిర్ణయిస్తున్న ఈ ఉచితాల వల్ల సానుకూల, వ్యతిరేక ఫలితాలు కలుగుతున్నాయి. సరైన ప్రణాళికతో ఉత్పాదకతను పెంచేలా పథకాలు ఉంటే ఆర్థిక అభివృద్ధికి దోహదకారి అవుతాయి. ఎంపిక చేసిన వస్తు సేవల ఉత్పత్తి పెరగటం, ఆదాయ అసమానతలు తగ్గటం, దీర్ఘకాలికంగా శ్రామిక శక్తి ఉత్పాదకత పెరగటం జరుగుతుంది. ప్రజలు పేదరికం నుంచి బయటపడడం, ప్రజలకు కనీస అవసరాలు తీర్చడం, మధ్యతరగతి వర్గాలు మిగిలిన డబ్బును పొదుపుకు మళ్ళించడం, దినసరి కూలీలకు భద్రత సమకూరటం, వృద్ధులు అసహాయులకు అపన్నహస్తం అందించటం, విద్య, వైద్య సదుపాయాల కల్పన వల్ల జీవన ప్రమాణం పెరిగి మానవ అభివృద్ధి జరుగుతుంది. ప్రజల వ్యక్తిగత ఆదాయాలు పెరిగి వస్తు వినియోగ సంస్కృతి పెరగటం, డిమాండ్ సప్లై చైన్లు పెరగటం, ఆదాయ వృద్ధి వల్ల స్థూల దేశీయ ఉత్పత్తి పెరగటం సంక్షేమ పథకాల ఉద్దేశమై ఉండాలి. కానీ ఇవాళ సంక్షేమమంటే ‘ఓటు పథకం’గా మార్చేశారు.
- తండ ప్రభాకర్ గౌడ్, సోషల్ ఎనలిస్ట్