- ఆసక్తికరంగా ఖమ్మం రాజకీయం
- అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ చేసిన కాంగ్రెస్
- ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించేందుకు ప్రయత్నాలు
- సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునే పనిలో బీఆర్‌ఎస్
- కూటమిలో భాగంగా కాంగ్రెస్‌కే సీపీఎం, సీపీఐ మద్దతు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్, కంచుకోటలో మరోసారి సత్తా చాటేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ పరిధిలోని ఏడు స్థానాలను కాంగ్రెస్ కూటమికే దక్కాయి. ఆరు సెగ్మెంట్లలో కాంగ్రెస్ క్యాండిడేట్లు గెలువగా, మరో స్థానంలో కాంగ్రెస్ మద్దతు తెలిపిన సీపీఐ క్యాండిడేట్ విజయం సాధించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో సత్తా చాటేందుకు కాంగ్రెస్ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
కార్యకర్తలే కాంగ్రెస్ బలం
కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే ప్రధాన బలంగా మారారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో లేకున్నా కేడర్ పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. 2014లో ఖమ్మంలో వైసీపీ గెలవగా, 2019లో బీఆర్‌ఎస్ గెలిచింది. కానీ 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి జిల్లాలో ఎక్కువ స్థానాలను కాంగ్రెస్సే గెల్చుకుంది. ఈ మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితమైంది. 2018లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐదుగురు, టీడీపీకి చెందిన ఇద్దరు బీఆర్‌ఎస్‌లో చేరారు. కానీ 2023 ఎన్నికలొచ్చే వరకు కార్యకర్తల సపోర్ట్‌తో మళ్లీ కాంగ్రెస్సే స్వీప్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం ఖాయమని భావించి ఈ టికెట్ కోసం 12 మంది అప్లై చేసుకున్నారు. కానీ నామినేషన్ల చివరి రోజు వరకు కూడా క్యాండిడేట్‌ను ఖరారు చేయలేదు.
తమ కుటుంబ సభ్యులను పోటీ చేయించాలన్న ఆలోచనతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల ప్రయత్నించినా హైకమాండ్ నో చెప్పింది. వ్యాపారవేత్తలు, సీనియర్లను కాదని పొంగులేటి వియ్యంకుడైన రామసహాయం రఘురాంరెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. దీంతో ఖమ్మం ఇన్‌చార్జిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇతర మంత్రులు, సీనియర్లను కలుపుకొని, అసంతృప్తులను బుజ్జగిస్తూ విజయం కోసం ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఇండియా కూటమిలో భాగంగా ఖమ్మంలో కాంగ్రెస్‌కు సీపీఐ, సీపీఎం కూడా మద్దతు ఇస్తున్నాయి.
కారు దిగుతున్న నేతలతో బీఆర్‌ఎస్ వీక్
ఖమ్మం సెగ్మెంట్‌లో 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బోణీ కొట్టింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు తిరిగి బీఆర్‌ఎస్ తరఫున బరిలో నిలిచారు. గతంలో ఒకసారి టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన నామా నాగేశ్వరరావు 2019 ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌లో చేరి విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలో కొంత కేడర్ ఉన్న టీడీపీ ఆ ఎలక్షన్లలో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ మరింత బలంగా మారింది. ఈ ప్రభావం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్‌గా కనిపించింది. ఆ తర్వాత కూడా బీఆర్‌ఎస్ లీడర్లు ఒక్కొక్కరుగా కారు దిగారు. వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ ఇటీవల బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. అసెంబ్లీ ఫలితాల తర్వాత పలువురు కార్పొరేటర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా ఖమ్మం మున్సిపన్ కార్పొరేషన్ మేయర్ నీరజ సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పోటీలో ఉన్నానంటున్న బీజేపీ
ఓ వైపు కాంగ్రెస్ కాంగ్రెస్, మరో వైపు బీఆర్‌ఎస్ మధ్య పోటీ నడుస్తుండగానే తన బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ ట్రై చేస్తోంది. గెలుపు అవకాశాలు లేకపోయినా, కనీసం ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పోరాడుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కేవలం 20 వేల ఓట్లను మాత్రమే సాధించగా, ఈ సారి లక్షకు పైగా ఓట్లు తెచ్చుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. తమ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని బీజేపీ అభ్యర్థి సహ, ఆ పార్టీ నేతలు చెబుతున్నా, ఖమ్మం నగరంలో ఒక్క కార్పొరేటర్ తప్ప మరో ప్రజాప్రతినిధి లేకపోవడం ఆ పార్టీకి మైనస్‌గా మారింది.
11 సార్లు కాంగ్రెస్‌దే విజయం
ఖమ్మం లోక్‌సభ స్థానంలో ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 11 సార్లు కాంగ్రెస్క్యాండిడేట్లే విజయం సాధించారు. అలాగే సీపీఎం రెండు సార్లు గెలువగా, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్, టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఒక్కోసారి మాత్రమే గెలిచారు. రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ కూడా 2019లో మాత్రమే ఇక్కడ బోణీ కొట్టింది.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మొత్తం 16,31,039 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 8,43,749 మంది మహిళలు, 7,87,160 మంది పురుషులు ఉండగా, 130 మంది థర్డ్‌జండర్లు ఉన్నారు.