విలేజ్​ క్యాడర్​పై పార్టీల ఫోకస్.. అసంతృప్త లీడర్లే టార్గెట్

విలేజ్​ క్యాడర్​పై పార్టీల ఫోకస్.. అసంతృప్త లీడర్లే టార్గెట్
  • స్కీములు, డబ్బులు ఎరవేస్తూ చేరికలపై నజర్
  • గ్రామాల్లో ప్రత్యేక టీమ్ ల పర్యటనలు
  • అసంతృప్త లీడర్లే టార్గెట్
  • జంపింగ్  జిలానీలను బుజ్జగిస్తున్న లీడర్లు

గద్వాల, వెలుగు:  గ్రామ లీడర్లే టార్గెట్ గా ప్రధాన పార్టీలు ఫోకస్​ పెట్టాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అసంతృప్త లీడర్లకు గాలం వేస్తూ చేరికలను ముమ్మరం చేస్తున్నారు. చేరికల కోసం సపరేట్ గా టీమ్​లను ఏర్పాటు చేసి గ్రామాలకు పంపిస్తున్నారు. తమ పార్టీలో చేరాలంటే తమ పార్టీలో చేరాలంటూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఫోన్లు చేయడం, ఇండ్లకు వెళ్లడం, పార్టీలో చేరాలని ఒత్తిడి చేయడం, ముఖ్యమైన లీడర్లతో ఫోన్ లో మాట్లాడించడం ఇలా ఎన్నడూ లేనివిధంగా గద్వాల నియోజకవర్గంలో చేరికల తంతు కొనసాగుతోంది. గ్రామాల్లో, నియోజకవర్గంలో తమ పార్టీకి బలం పెరుగుతోందని హైప్  క్రియేట్ చేసేందుకు ప్రధాన పార్టీలు చేరికలను ఒక పావుగా వాడుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

స్కీములు, డబ్బులు ఎరవేస్తున్రు..

గ్రామాల్లో లీడర్లు, నాయకులను చేర్చుకునేందుకు పార్టీలు స్కీములు, డబ్బులను ఎరవేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 10  రోజుల క్రితం మల్దకల్ మండల కేంద్రానికి చెందిన ఒక ముఖ్య లీడర్ కు స్కీం ఎర వేసి పార్టీలో చేర్చుకున్నారనే విమర్శలున్నాయి. అలాగే ధరూర్ మండలంలోని ఒక ప్రజాప్రతినిధికి కూడా డబ్బులు ఎర వేసి పార్టీలో చేర్చుకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఒక పార్టీ ప్రతిరోజు చేరికలను ఒక తంతుగా మార్చుకొని చేరిన వారికి కండువా కప్పి అక్కడే విందు ఏర్పాటు చేసి, దారి ఖర్చుల కోసం డబ్బులు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

అసంతృప్త లీడర్లకు బుజ్జగింపులు..

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నియోజకవర్గంలో లీడర్లను, కార్యకర్తలను కాపాడుకునేందుకు మూడు పార్టీలకు చెందిన వారు బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. ఇక మీదట నిన్ను బాగా చూసుకుంటాం. ఏం పని కావాలన్నా నేరుగా వచ్చి కలువవచ్చు అంటూ కొందరిని తమ దగ్గరకు పిలిపించుకొని హామీలు ఇస్తున్నారనే టాక్ నడుస్తోంది. మరికొందరి ఇళ్లకు నేరుగా వెళ్లి వారి దగ్గర రహస్యంగా మంతనాలు జరిపి పార్టీలోనే కొనసాగేలా హామీ తీసుకుంటున్నారు. జడ్పీటీసీగా గెలిపిస్తామని, ఒక్క రూపాయి ఖర్చు పెట్టొద్దు.. మొత్తం పార్టీ చూసుకుంటుందంటూ అధికార పార్టీ లీడర్లతో పాటు ప్రతిపక్ష పార్టీలో ఇటీవల చేరిన ఒక లీడర్ హామీ ఇస్తూ చేరికలను ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఒక పార్టీలో చేరిన లీడర్లు పొద్దున్నే ఇతర పార్టీ లీడర్లకు ఫోన్లు చేస్తూ తమ పార్టీలో చేరాలని, ఆ పార్టీలో ఏమి న్యాయం జరగలేదని, తమ పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.

పోటీపోటీగా చేరికలు

మూడు పార్టీల ముఖ్య నాయకులు చేరికలపై ఫోకస్ పెడుతున్నారు. ఆయా పార్టీలలోని లీడర్లు, కార్యకర్తలను తమ పార్టీలో చేర్చుకొని కండువాలు కప్పుతున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్  చోటు చేసుకుంటోంది. ఈ రోజు ఓ పార్టీలో చేరిన లీడర్, మరో రోజు వేరే పార్టీ కండువా కప్పుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. గద్వాల మండలం గోన్పాడు విలేజ్ కి చెందిన వడ్డే వెంకటేశ్, బీఆర్ఎస్  యూత్  లీడర్ వారం కింద కాంగ్రెస్  లీడర్ తిరుపతయ్య సమక్షంలో పార్టీలో చేరి బర్త్ డే వేడుకలు చేసుకున్నారు. ఆ మరుసటి రోజే సర్పంచ్  మజీద్  ఆధ్వర్యంలో మళ్లీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సొంతగూటికి చేరుకున్నారు.