నల్గొండ, వెలుగు : వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించాయి. ఇటు అధికార, అటు ప్రతిపక్ష పార్టీల్లో క్యాండిడేట్లు ఎవరనే అంశంపైన సీరియస్ చర్చ సాగుతోంది. మునుగోడు బైపోల్ నేర్పిన గుణపాఠంతో అధికార పార్టీ కాస్త ముందుగానే అలర్ట్ అయింది. బీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బలమైన క్యాండిడేట్లను బరిలో దింపాలన్న ఉద్దేశంతో క్యాండిడేట్ల కోసం ఇప్పటి నుంచే అన్వేషణ మొదలుపెట్టింది. ఇప్పటికైతే ఎంపీగా పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ, ఎన్నికల నాటికి ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు సీనియర్లు బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. నల్గొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీకి ఎంత బలం ఉంది ? బలమైన క్యాండిడేట్లు ఎవరు ? అన్న దానిపై రాజకీయ పార్టీలు ప్రైవేట్ ఏజెన్సీలతో సర్వే చేయిస్తున్నాయి.
స్ట్రాంగ్ లీడర్ల కోసం ప్రయత్నాలు
జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్ వాయిస్ గట్టిగా వినిపించేందుకు ఈ సారి బలమైన లీడర్లను బరిలో దింపాలని హైకమాండ్ భావిస్తోంది. నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకునేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఇప్పుడు బీజేపీ రూపంలో కొత్తగా ప్రత్యర్థులు తెరపైకి వస్తుండంతో వచ్చే ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ముందుగానే ప్లాన్ చేస్తోంది. జిల్లాలో పలువురు కాంగ్రెస్ సీనియర్లు బీజేపీలో చేరితే ముందు ముందు కష్టాలు తప్పవని భయపడుతున్న అధికార పార్టీ హైకమాండ్ స్ట్రాంగ్ లీడర్లను వెతికే పనిలో పడింది. 2014 ఎంపీ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరిలో పోటీ చేయగా భువనగిరిలో మాత్రమే గెలిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాలు కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్, 2019 ఎంపీ ఎలక్షన్స్‌లో భువనగిరి సిట్టింగ్ స్థానం కోల్పోవడమే కాకుండా నల్గొండలో కొత్త అభ్యర్థిని దింపి చేతులు కాల్చుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి బీఆర్‌ఎస్ పోటీ ఇవ్వలేకపోయింది. పైగా క్యాండిడేట్ల ఎంపికలో జరిగిన పొరపాట్లు పార్టీకి నష్టం కలిగించాయని హైకమాండ్ అభిప్రాయపడింది. మునుగోడు బైపోల్ టైంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరడంతో ఇప్పుడు భువనగిరితో పాటు, నల్గొండలోనూ కొత్త క్యాండిడేట్లను వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైతే జిల్లాకు చెందిన ముఖ్యనేత ఒకరు నల్గొండ నుంచి నిలబడతారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కొడుకు అమిత్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. కమ్యూనిస్టుల పొత్తులో భాగంగా భువనగిరి సీటు సీపీఐ అడుగుతోంది. ఒకవేళ బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటీలో ఉంటే ధీటైన క్యాండిడేట్ ఎవరు ఉన్నారనే దానిపై సీనియర్లు పరిశీలన చేస్తున్నారు. ఒకవేళ ఈ సీటు బీసీలకు ఇవ్వాల్సి వస్తే గౌడ సామాజిక వర్గానికే ప్రయారిటీ ఉంటుందని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.
కాంగ్రెస్‌కూ తప్పని కష్టాలు
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కూ కష్టాలు తప్పేలా లేవు. సిట్టింగ్ ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ నుంచి లోక్‌సభకు ఎవరు పోటీ చేస్తారన్నది సస్పెన్స్‌గా మారింది. కాంగ్రెస్, కమ్యూనిస్టుల ప్రాబల్యం కలిగిన నల్గొండ ఎంపీ సెగ్మెంట్‌లో ఈ రెండు పార్టీల క్యాండిడేట్లే గెలవడం ఆనవాయితీగా వస్తోంది. 2009, 2019 ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ గెలిచింది. తిరిగి సిట్టింగ్ స్థానాలు కాపాడుకోవడానికి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో కొత్త ముఖాలు బరిలో దిగనున్నాయి. జానారెడ్డి కొడుకు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి కొడుకు సర్వోత్తమ్‌రెడ్డి, చెరుకు సుధాకర్ గౌడ్ వంటి లీడర్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. భువనగిరిలో గౌడ సామాజిక వర్గం బలంగా ఉన్నందున చెరుకు సుధాకర్ పోటీ చేసే అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. నల్గొండ స్థానం రెడ్డి సామాజిక వర్గంతోనే భర్తీ చేసే అవకాశం ఉంది.
బీజేపీలో తాజా.. మాజీలు రెడీ
బీజేపీ నుంచి పోటీకి తాజా, మాజీ లీడర్లు సిద్ధమవుతున్నారు. మునుగోడు బైపోల్‌లో బీజేపీ బలం పెరగడంతో ఆ పార్టీ నుంచి నేతల తాకిడి ఎక్కువగానే కనిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన భార్య లక్ష్మిని భువనగిరి ఎంపీగా నిలబెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. నల్గొండ ఎంపీగా గత ఎన్నికల్లో పోటీ చేసిన గార్లపాటి జితేందర్‌కుమార్ టికెట్ వస్తదనే నమ్మకంతో నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి పలువురు సీనియర్ నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, పార్టీ సీనియర్ నాయకులు శ్యాంసుందర్, జిట్టా బాలకృష్ణారెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.