
- బెస్ట్ క్యాండిడేట్స్ కోసం వెతుకుతున్న పొలిటికల్ పార్టీలు
- కాంగ్రెస్ అప్లికేషన్ల స్వీకరణ
- బీజేపీ అభిప్రాయ సేకరణ
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాడానికి బెస్ట్ క్యాండిడేట్స్కోసం పొలిటికల్ పార్టీలు వెతుకుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఆశావహుల నుంచి అప్లికేషన్లు స్వీకరించగా, బీజేపీ ఫీల్డ్లెవల్సర్వేలు చేయిస్తూ, నియోజకవర్గ స్థాయి మీటింగ్ లు నిర్వహిస్తూ క్యాడర్ నుంచి అభిప్రాయ సేకరణ చేస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి చాలా మంది రేసులో ఉండగా ఎవరిని బరిలోకి దించాలనే దానిపై పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది.
11 మంది దరఖాస్తు
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌నుంచి టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇటీవల పార్టీ హైకమాండ్ ఆశవహుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానించగా 11 మంది అప్లై చేసుకున్నారు. సిద్దిపేటకు చెందిన పీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి, అక్బర్ పేట - భూంపల్లి మండలం ఖాజీపూర్ కుచెందిన మద్దుల సోమేశ్వర్‌రెడ్డి, దుబ్బాక అసెంబ్లీ స్థానంలో పోటీచేసి ఓడిపోయిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన భార్య నిర్మల మరో 8 మంది అప్లై చేసుకున్నారు. సామాజిక సమీకరణలు, ప్రత్యర్థి అభ్యర్థి ఎవరుంటారనేదాన్ని దృష్టిలో పెట్టుకొన కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఫీల్డ్ సర్వేలు.. క్యాడర్ అభిప్రాయాలు
బీజేపీ మెదక్లోక్సభఅభ్యర్థి కోసం ఎంపిక ప్రక్రయ మొదలు పెట్టింది. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్, 2018 ఎన్నికల్లో మెదక్అసెంబ్లీ స్థానంలో పోటీచేసి ఓడిపోయిన ఆకుల రాజయ్యతోపాటు మరికొందరు నేతలు మెదక్ లోక్‌సభ టికెట్ ఆశిస్తున్నారు. కాగా పార్టీ హైకమాండ్లోక్సభ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ క్యాడర్అభిప్రాయాలు సేకరించారు. ఇటీవల మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో ఈ మీటింగ్ నిర్వహించగా పార్టీ నుంచి వచ్చిన ఆఫీస్ బేరర్లు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు, ఆ పై స్థాయి లీడర్లతో మాట్లాడి లోక్‌సభ ఎన్నికల్లో మెదక్అభ్యర్థి ఎవరైతే గెలుస్తారని అడిగి తెలుసుకున్నారు. పార్టీ క్యాడర్ ఎక్కువగా ఎవరివైపు మొగ్గు చూపారనేదానిపై నివేదిక రూపొందించి పార్టీ హైకమాండ్‌కు అందజేసినట్టు తెలిసింది. దీంతోపాటు ఫీల్డ్లెవల్లో నిర్వహించిన వివిధ సర్వేల్లో వెల్లడైన అభిప్రాయాలను క్రోడీకరించి అభ్యర్థిత్వం విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అధినేతదే తుది నిర్ణయం
మెదక్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుచోట్ల బీఆర్ఎస్ గెలుపొందడంతో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు పక్కా అని బీఆర్ఎస్ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ టికెట్ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, పటాన్‌చెరుకు చెందిన గాలి అనిల్ కుమార్, సంగారెడ్డికి చెందిన బీరయ్య యాదవ్ ఎంపీ టికెట్ఆశిస్తున్నారు. పార్టీ హైకమాండ్ పరిశీలనలో ఎమ్మెల్సీలు వెంకట్రామ్రెడ్డి, కవిత పేర్లు ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా మెదక్ ఎంపీ టికెట్ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్‌దే తుది నిర్ణయం కానుంది.