మెదక్ జిల్లాలో స్థానిక, ఎమ్మెల్సీ ఎలక్షన్​కు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు

మెదక్ జిల్లాలో స్థానిక, ఎమ్మెల్సీ ఎలక్షన్​కు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
  • కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్న నేతలు  
  • పోలింగ్​ నిర్వహణపై బిజీగా మారిన అధికారులు

సిద్దిపేట, వెలుగు: స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పోటీకి రాజకీయ పార్టీలు సిద్ధమవుతుండగా మరోవైపు పోలింగ్ నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం బిజీగా మారింది. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. బీఆర్ఎస్​ గ్రామాల్లో జెండా పండుగ, కాంగ్రెస్​ మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. మరోవైపు బీజేపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునే దిశగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తోంది. ఈ నెల 27 న గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండడంతో పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాలు, పోలింగ్ నిర్వహణ, ఎలక్షన్ కోడ్ అమలుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.  

స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు 

జిల్లాలో 230 ఎంపీటీసీ, 26 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి మండల, జిల్లా పరిషత్  అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా నిర్వహణకు సిద్ధంగా ఉండేలా అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో మొత్తం  508 గ్రామ పంచాయతీలు 4508 వార్డుల ఓటరు జాబితాను విడుదల చేసిన అధికారులు, తుది జాబితాలను సిద్దం  చేయడానికి కసరత్తు చేస్తున్నారు. మరోవైపు 11,737  మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొననున్నారు. పోలింగ్ నిర్వహణపై ఇప్పటికే 10 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ను పూర్తి చేయగా సోమ, మంగళవారాల్లో  రెండు విడతల్లో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు ఏడు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు 63 పోలింగ్ కేంద్రాలు

గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్దిపేట జిల్లాలో 63 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 31,546 మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్లుండగా వీరిలో 20,922 పురుషులు, 10,624 మంది మహిళా ఓటర్లున్నారు. మొత్తం 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 3,052 మంది టీచర్​ఓటర్లుండగా 1,948 మంది పురుష,1,104 మంది మహిళా టీచర్​ఓటర్లుండగా వీరి కోసం 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 

పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు తమ శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మండలాల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ మండలా వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌‌చార్జి పూజల హరికృష్ణ సన్నాహాక సమావేశాలు ప్రారంభించగా బీఆర్ఎస్ తరపున గ్రామాల్లో జెండా పండుగతో పాటు మాజీ సీఎం కేసీఆర్ బర్త్​డేను పురస్కరించుకుని క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు.

 మరోవైపు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్​ పెట్టి కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే రాజకీయ పార్టీల నేతలు గ్రామాల్లో తిరుగుతుండడంతో జిల్లాలో ఎన్నికల సందడి నెలకొంది.