సోషల్‌ మీడియా సొంత ‘కోడ్​’

సోషల్‌ మీడియా సొంత ‘కోడ్​’

ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీలు ఏ ఒక్క మీడియానీ మిస్​ చేసుకోవు. పోలింగ్​ పూర్తయ్యే చివరి క్షణం వరకూ ఓటర్లను ప్రభావితం చేయాలనే చూస్తాయి. ఫేస్​బుక్​, ట్విట్టర్​, ఇన్​స్టాగ్రామ్​ వంటి​ ఫ్లాట్​ఫామ్​లు అందుబాటులోకి రావటంతో క్యాంపెయిన్​​కి మరింత కలిసొచ్చింది. కానీ.. ఆన్​లైన్​, ఆఫ్​లైన్​… ప్రచార వేదిక ఏదైనా ఎన్నికల కోడ్ పాటించటం తప్పనిసరి. రూల్స్​ అంటే లెక్కలేని పార్టీలను, సోషల్​ మీడియాను ఈసీ లైట్​గా తీసుకోవడంపై ఎలక్షన్‌ రిఫార్మ్స్​ కోరుకునేవాళ్లు అభ్యంతరం చెబుతున్నారు.

ఆదివారంతో ఆరో విడత లోక్​సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా ఒక్క రౌండే మిగిలి ఉంది. ఇప్పటివరకు జరిగిన ప్రచారంలో వివిధ పార్టీలు ఫేస్​బుక్​కి ఇచ్చిన యాడ్స్ 2,235. వీటికోసం చేసిన ఖర్చు రూ.కోటీ 59 లక్షలు. ఈ యాడ్స్‌‌ అన్నీ ఆయా దశల ఎన్నికల ప్రచారం ముగిశాక పబ్లిష్​ అయినవే.​ రూల్స్​ ప్రకారం పోలింగ్​కి 48 గంటల ముందే​ క్యాంపెయిన్​ ఆపేయాలి. ఈ ‘సైలెన్స్​ పీరియడ్’​లో ప్రచారం​ చేస్తే ‘కోడ్​ దాటిన క్రైమ్‌‌’గా పరిగణిస్తారు. దీన్నిబట్టి ఈ యాడ్స్‌‌ అన్నీ​ ‘రూల్స్​ని పట్టించుకోని’​ కోవలోకే వస్తాయి.

ఈ అడ్వర్టయిజ్​మెంట్లలో అధికార పక్షానిదే అగ్ర స్థానం. సెకండ్​ ప్లేస్​లో ఉన్న కాంగ్రెస్​తో పోల్చితే బీజేపీ ఈ యాడ్స్​కోసం మూడు రెట్లు ఎక్కువ​ చెల్లించింది. హస్తం పార్టీ కన్నా కమలదళం రెండు వేలకు పైగా రూల్‌‌​ ఉల్లంఘనలకు పాల్పడింది. ‘# మై ఫస్ట్ ఓట్​ ఫర్​ మోడీ’ పేరిట చేపట్టిన ప్రచారంలో భాగంగా బీజేపీ స్పాన్సర్​ చేస్తున్న ఓ యాడ్​ ఫేస్​బుక్​ యూజర్లలో 18–24 ఏళ్ల యూత్​ని టార్గెట్​గా పెట్టుకుంది. ఏప్రిల్​ 21న ప్రారంభమైన ఈ అడ్వర్టయిజ్​మెంట్​ ప్రసారం ఈ నెల 19న లాస్ట్​ ఫేజ్​ ఓటింగ్​ ముగిసే వరకు ఫేస్​బుక్​లో రానుంది. ఈ డేటాని గ్రాఫ్‌‌ అప్లికేషన్‌‌ ప్రోగ్రామింగ్‌‌ ఇంటర్‌‌ఫేస్‌‌ (ఏపీఐ) సమకూర్చిన టూల్స్‌‌ ఆధారంగా రూపొందించారు.

కట్టడి చేయలేమా!

మన దేశంలో ఎలక్షన్లు దశలవారీగా జరుగుతాయి. దీనికితోడు ఇప్పుడు సోషల్​ మీడియానికూడా ప్రచారానికి బాగా వాడుతున్నారు. దీంతో సైలెన్స్​ పీరియడ్​లో క్యాంపెయిన్​ని అడ్డుకునే పరిస్థితి లేదు. అందుకే అన్ని పార్టీలు వలంటరీగా చట్టాన్ని తూచా తప్పక పాటించాలని ఎలక్షన్​ కమిషన్​ కోరుతోంది. ‘ప్రచార గడువు పూర్తికాని సెగ్మెంట్లలోని పార్టీలు లేదా అభ్యర్థులు… ప్రచారం గడువు పూర్తయిన నియోజకవర్గాల్లోని పార్టీలు లేదా అభ్యర్థులకి డైరెక్ట్​గా గానీ ఇన్​డైరెక్ట్​గా గానీ సాయం చేయకూడదు’ అని సూచిస్తోంది. కానీ, దీన్ని అమలు చేయటం చెప్పినంత తేలిక కాదు.

డిజైన్​లోనే అసలు లోపం

ప్రస్తుతం జరుగుతున్నవి సార్వత్రిక ఎన్నికలు కాబట్టి యాడ్స్​ని డిజైన్​ చేసేటప్పుడు మల్టీ ఫేజ్​ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోలేదు. దేశ ప్రజలందర్నీ ఆకర్షించాలనే ఉద్దేశంతో ఒక యూనివర్సల్‌‌ కాన్సెప్ట్‌‌తో రూపొందించారు. ‘ఫలానా యాడ్​ ఫలానా ఏరియాకే’ అని అనుకోలేదు. ప్రత్యేకంగా కొంత మంది ఆడియెన్స్‌‌ని, వాళ్ల జెండర్​ని, ఏజ్​ గ్రూప్​ని, ఇంట్రస్ట్​లను మాత్రమే పట్టించుకున్నారు. కాబట్టి ఆయా అడ్వర్టయిజ్​మెంట్లను అకారణంగా కొన్ని లొకేషన్లకే, కొన్ని సమయా​లకే పరిమితం చేయటం సాధ్యం కావట్లేదు. అందుకే ఎక్కువ యాడ్​లు​ ‘సైలెన్స్​ పీరియడ్’ రూల్స్​ పాటించట్లేదు.

ఉద్దేశపూర్వకమా?

సైలెన్స్​ పీరియడ్​ రూల్స్​ని కావాలనే పట్టించుకోవట్లేదా? లేక  పరిమితులు విధించే వెసులుబాటు యాడ్స్​లో లేకపోవటం వల్ల పాటించట్లేదా అనేది అర్థం కావట్లేదు. పైగా ఎలక్షన్​ యాడ్స్ అన్నింటి​కీ పబ్లిషర్లు ‘నేషనల్​ ఇంపార్టెన్స్’ అనే లేబుల్​ వేయలేరు. దీనికితోడు వివిధ పొలిటికల్​ పార్టీల తరఫున ఆన్​లైన్​ ప్రచార బాధ్యతలు తీసుకుంటున్న ఎన్నో కంపెనీల్లో ఫేస్​బుక్​ కూడా ఒక మాధ్యమమే.అన్నింటికీ అదే మెయిన్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ కాదు. అందువల్ల ఆ సంస్థలన్నింటినీ కంట్రోల్​ చేయటం పెద్ద పనే. దీనికంటూ భారీ యంత్రాంగం ఉండాలి. అలాంటిది ప్రస్తుతానికి ఎన్నికల కమిషన్‌‌లో లేదు.

అయితే.. ఫేస్​బుక్​ వంటి సోషల్​ మీడియా ఫ్లాట్​ఫామ్‌‌ల్లో కొన్ని పార్టీలు తెలివిగా ఈ ఉల్లంఘన​ని తప్పించుకోగలుగుతున్నాయి. సోషల్‌‌ మీడియా మూడు గంటలకోసారి ఈసీకి తమంతట తామే రిపోర్ట్​ చేయాలి. తద్వారా వాలంటరీ కోడ్​ ఆఫ్​ ఎథిక్స్​ని పాటించినట్లవుతుంది. దీనివల్ల ఎలక్షన్​ ప్రచారం స్వేచ్ఛగా, పక్షపాతం లేకుండా, నీతినిజాయితీలతో జరిగే వేదికలుగా నిలవగలుగుతాయి. ఫస్ట్​ ఫేజ్​ ఎలక్షన్స్​కి ముందు బీజేపీ.. పోలింగ్​ ప్రాంతాలకు సంబంధించిన యాడ్స్​నే రిలీజ్​ చేసింది. టెక్నికల్​గా ఇలా ముందుచూపు ప్రదర్శించటం, తెలివిగా వ్యవహరించటం కమలదళం ప్రత్యేకత. ఇది అన్ని పార్టీలూ పాటించాల్సిన విధానం. అయితే, ఇప్పటివరకు వచ్చిన యాడ్స్‌‌లో ఈ వాలంటరీ కోడ్‌‌ పాటించిన వైనం తక్కువ.

అన్ని పార్టీలకూ అలవాటైంది

సైలెన్స్​ పీరియడ్​లోనూ ప్రచారం చేసుకోవటం ఈ మధ్య షరా మామూలైంది. ఒకటీ రెండూ అని కాదు. అన్ని పొలిటికల్​ పార్టీలూ ఇలాగే రూల్స్​ అనే లక్ష్మణరేఖ​ని​ భయమూ భక్తీ లేకుండా దాటేస్తున్నాయి. గ్రాఫ్​ అప్లికేషన్​ ప్రోగ్రామింగ్​ ఇంటర్​ఫేస్​ (ఏపీఐ) అందుబాటులోకి తెచ్చిన టూల్స్​ సాయంతో యాడ్స్​ని అనాలసిస్ చేయగా ఈ విషయం తేలింది. తొలి నాలుగు దశల ఎన్నికల్లో ఏకంగా 16 పొలిటికల్​ పార్టీలు ఇలా యాడ్స్​ని​ ప్రసారం చేసినట్లు వెల్లడైంది. వాటిని సాక్ష్యాలతో సహా బయట పెట్టేందుకు ప్రస్తుతం ఈ డేటాబేస్​లో సెర్చింగ్​ జరుగుతోంది.

చట్టం ఏమంటోంది?

ఎన్నికలు ప్రశాంతంగా, పక్షపాతం లేకుండా జరిగితేనే డెమొక్రసీకి ఒక అర్థం పరమార్థం. అలాంటి వాతావరణాన్ని వంద శాతం కల్పించేందుకుగాను పక్కాగా ఎన్నికల ఏర్పాట్లకు సర్కార్లు ప్రయత్నిస్తాయి. ఇందులో భాగంగా పోలింగ్​కి రెండు రోజుల ముందే బహిరంగ ప్రచారాన్ని నిలిపేస్తాయి. ‘ఓటింగ్​ ప్రారంభానికి ఇంకా 48 గంటల సమయం ఉందనగా పార్టీలు, క్యాండిడేట్లు యాక్టివ్​ క్యాంపెయినింగ్​ చేయకూడదు. ఎలక్ట్రానిక్​ మీడియాలోనూ ఇది నిషేధం’ అని ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్​–126’ స్పష్టంగా చెబుతోంది.