అరువు అభ్యర్థులతో ఆశల పల్లకి!

‘మొదలు మొగురం కానిది కొన దూలమౌతుందా?’ అన్న సామెతను గుర్తుకు తెస్తున్నాయి తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌‌‌‌, బీజేపీలు. సొంత సరుకు దొరక్క, అరువు అభ్యర్థుల కోసం అర్రులు చాస్తున్నాయి. ఎన్నికల ఏడాది.. అంతటా ‘ఆయారామ్‌‌‌‌ – గయారామ్‌‌‌‌’ల సందడి పెరిగింది. అమిత్‌‌‌‌ షా చేవెళ్ల సభలో ఎందరు బీజేపీలో చేరుతారు? ప్రియాంక గాంధీ సభ పెడితే మరెందరు కాంగ్రెస్‌‌‌‌లో చేరుతారనే ఉత్కంఠ పెరుగుతోంది. నాడు పక్కా ఉద్యమ పార్టీ, రాష్ట్రం వచ్చాక తమది ఫక్తు ‘రాజకీయ’ పార్టీ అంటున్న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఈ విషయంలో తానేమీ తక్కువ తినలేదు. అధికారం చేపట్టిన నుంచి ‘సముద్రం’లా అన్ని ప్రవాహాలను అక్కున చేర్చుకొని, ఇప్పుడు ‘భారం పెరిగి’ నాయకుల్ని అరువిచ్చే  స్థితికి చేరింది. పార్టీల ఈ వైఖరుల వల్ల ఎందరు సిట్టింగ్‌‌‌‌ల టిక్కెట్లు గల్లంతవుతాయి? మరెందరు ‘జంప్‌‌‌‌ జిలానీ’ల తలరాతలు మారనున్నాయో చూడాలి. 

సొంత బలంపై నమ్మకం కన్నా, కొత్తగా పార్టీలో 

కొచ్చేవారి బ‌‌‌‌లాబ‌‌‌‌లాల‌‌‌‌పై ఆశలు పెట్టుకుంటున్న తీరు ప్రధానపార్టీల దుస్థితికి నిలువుటద్దం. నిన్నటి ఉపఎన్నికలైనా, రేపటి సాధారణ ఎన్నికలైనా, జరిగింది, జరగబోయేదీ అదే! సదరు పార్టీ మార్పిళ్లు కూడా సిద్ధాంతాల్లో తేడా వచ్చో, ప్రత్యర్థి పార్టీ విధానాలు తెగనచ్చో కాదు. ఉన్నపార్టీల్లో ఊపిరి సలపనప్పుడు, ఎదుటి పార్టీలో ఏదో ఆశ లీలగా కనిపించినప్పుడు... అవకాశాల వేట, అదృష్టాల పరీక్ష, అంతే! ఎన్నికల్ని ఖరీదైన వ్యవహారం చేసిన రాజకీయపక్షాల పాపం కూడా ఉంది. పార్టీలను సంస్థాగతంగా బలోపేతం చేసుకోకపోవడం, సరైన విధానాలతో ప్రజావిశ్వాసం చూరగొనకపోవడం ఫలితమే ఇదంతా! మొన్న విశ్వేశ్వర్​రెడ్డి, ఈటల రాజేందర్‌‌‌‌, దాసోజు శ్రావణ్‌‌‌‌, నిన్న మహేశ్వరరెడ్డి రేపు పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, జూపల్లి కృష్ణారావ్‌‌‌‌.. పేర్లు ఏవైతేనేం? జరుగుతున్నదిదే! ‘కొత్త నాయకత్వం వస్తోంది, కార్యకర్తల్ని తయారు చేసే ఫ్యాక్టరీలు మావి’ అని డాంబికం చూపే కాంగ్రెస్‌‌‌‌, బీజేపీల పరిస్థితి రాష్ట్రంలో ఈ విషయమై నానాటికీ తీసికట్టుగానే ఉంది. అరువు అభ్యర్థుల వేటలో తలమునకలైన పార్టీలు, పాలకపక్షానికి ‘ నేను ప్రత్యామ్నాయమంటే.. కాదు నేను’ అని పోటీ పడుతున్నాయి.

బీజేపీలో తెగని స్పర్ధ

జెండా మోసిన పార్టీ నాయకులకు, అరువుకొచ్చే అభ్యర్థులకు మధ్య బీజేపీలో ఓ నిరంతర ఘర్షణ సాగుతుంది. ‘కేంద్రంలోనే కాదు దేశంలోని ఇరవై-పాతిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, తెలంగాణను కైవసం చేసుకుంటాం’ అని చెప్పుకునే బీజేపీ తెలంగాణలో సంస్థాగతంగా ఎదగలేకపోతోంది. ప్రతి ఎన్నికల్లోనూ చెప్పే బూత్‌‌‌‌స్థాయి కమిటీలు ఎప్పటికి ఏర్పాటయ్యేనో? ఎవరికీ తెలియదు. రాష్ట్రంలో మూడోవంతు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులెవరో? అర్హులైన ఆశావహులెవరో? ఇంకా స్పష్టత లేదు. మోత్కుపల్లి నర్సింహులు, దాసోజు శ్రావణ్‌‌‌‌, స్వామిగౌడ్‌‌‌‌, తీన్మార్‌‌‌‌ మల్లన్న వంటి వారు పార్టీలోకి వచ్చి, ఎందుకు ఇమడలేకపోయారో ఎవరికీ తెలియదు. ఇంకా పార్టీలోనే ఉన్నా, ఇమడలేకపోతున్న వారెందరో! ఒకప్పుడు తెలుగుదేశంలో కీలకపాత్ర పోషించిన పర్వతనేని ఉపేంద్ర, దివంగత ప్రధాని వాజ్‌‌‌‌పేయ్‌‌‌‌ని కలిసి, బీజేపీలో చేరాలనుకుంటున్నానన్నారు. ‘బయటి వాళ్లని అంత తేలిగ్గా మావాళ్లు ఇముడ్చుకోలేరు, ఆలోచించుకో!’ అన్నారట. చివరకు అదే జరిగి, ఆయన బయటకు వస్తున్నపుడు, ‘నే చెప్పాను గుర్తుందా?’ అని వాజ్‌‌‌‌పేయ్‌‌‌‌ గుర్తుచేసినట్టు ఉపేంద్రే ఒక పుస్తకంలో రాసుకున్నారు.

 ఆమ్‌‌‌‌ఆద్మీ పార్టీ (ఆప్‌‌‌‌) బాగా చదువుకున్నోళ్లకు టిక్కెట్లు ఇచ్చి ఒక ప్రయోగం చేసింది. పార్టీలోనే ఎదిగి, మండల, జడ్పీ స్థాయిల్లో ప్రజాప్రతినిధులైన చొరవగల వారిని బీజేపీ ఎందుకు అభ్యర్థుల్ని చేయదు? అనే ప్రశ్న వస్తోంది. పార్టీ గొప్పగా చెప్పుకునే ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్‌‌‌‌, రఘునందన్‌‌‌‌రావు, ఓడిన రాజగోపాల్‌‌‌‌రెడ్డి బయటి నుంచి వచ్చిన వారే! ‘గాలితోనే గెలుస్తున్నాం, ఈసారి మనకనుకూలంగా గాలి ఉంది. ఇచ్చేదేదో ఆ టిక్కెట్లు పార్టీ జెండా మోసిన వారికే ఇద్దాం, బయటివారికి వద్దు’ అని కరాఖండిగా చెబుతున్న వారూ బీజేపీలో ఉన్నారు. పార్టీ పట్ల సానుభూతితో మాట్లాడేవారు కూడా ‘ఎప్పుడూ ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థల్ని నమ్ముకోవడమేనా? యువమోర్చా, మహిళామోర్చా తదితర అనుబంధ విభాగాలనూ క్రియాశీలం చేసి, తదుపరి తరం నాయకుల్ని తయారు చేయొచ్చు కదా?’ అని వ్యాఖ్యానిస్తుంటారు. బయటి నుంచి వచ్చే వారినే గుడ్డిగా నమ్ముకుంటే, పశ్చిమబెంగాల్‌‌‌‌ పరిస్థితి పునరావృతం కావచ్చు. ముఖ్యనేత ‘ముకుల్‌‌‌‌రాయ్‌‌‌‌’తో సహా, ఎన్నికల ముందొచ్చి తర్వాత కట్టగట్టుకొని అంతా మళ్లీ తృణమూల్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌కు వెళ్లిపోయిన చేదు అనుభవాన్ని బీజేపీ మరువగలదా?

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ది మరో సమస్య

ప్రతిపక్షాల్ని బలహీనపరచి, తాను బలోపేతమయ్యే కసరత్తులో.. అందరినీ చేర్చుకొని పాలకపక్షం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ భారం పెంచుకుంది. ఒకరకంగా ఇవాళ అది ‘ఓవర్‌‌‌‌ బర్డెన్‌‌‌‌’ అయింది. సగానికి మించి, అంటే 50 పైగా నియోజకవర్గాల్లో ఇద్దరు, అంతకు మించి ఆశావహులున్నారు. సిట్టింగ్‌‌‌‌లతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్​పర్సన్లు, ఎంపీపీలు, మున్సిపల్‌‌‌‌ చైర్‌‌‌‌పర్సన్లు, ఇతర రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల అధ్యక్షులు టిక్కెట్లు ఆశిస్తున్నారు. వారందరికీ ప్రత్యామ్నాయాలు చూపడం, బుజ్జగించడం పార్టీ నాయకత్వానికి శక్తికి మించిన పని అవుతోంది. ‘పోయేవాళ్లు పోతే పోనీ’ అనే పంథా ఫలితమే పొంగులేటిలు, జూపల్లిలు. అంతర్గత విబేధాలను ఎంత గుంబనంగా ఉంచాలనుకున్నా... ‘ఆత్మీయ సమ్మేళనా’ల్లో అవి బట్టబయలవుతూనే ఉన్నాయి.రాజకీయ పార్టీలు సిద్ధాంత భూమికను బలోపేతం చేసుకోవాలి. పాలనలో స్వచ్ఛత -పారదర్శకత, విధానాల్లో ప్రజల్ని మెప్పించే స్పష్టత తీసుకురావాలి. పార్టీలను మరింత ప్రజాస్వామ్యబద్దం చేస్తూ యువతరం నాయకత్వ ప్రోత్సాహం అవసరం. ఎన్నికల్లో డబ్బు పాత్ర- ప్రమేయాన్ని తగ్గిస్తే తప్ప రాజకీయాలు ప్రజల మెప్పు పొందలేవు. ఇవన్నీ ‘నీతి చంద్రిక’ వల్లించినట్టే ఉండొచ్చు! కానీ, అవే అవసరం, వాటితోనే ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టేది.

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఎందుకీ దురవస్థ?

నాయకత్వ లేమి, విశ్వసనీయత కోల్పోవటం వల్లే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎదురీదుతోంది. పార్టీలోకి వచ్చిన కొండా విశ్వేశ్వర్​రెడ్డి, దాసోజు శ్రావణ్‌‌‌‌‌‌‌‌ వంటి వారు ఎందుకు ఉండలేకపోయారు? డి.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ పునరాగమనం 24 గంటల్లో ఎందుకంత వివాదాస్పదమైంది? మొదట వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌, ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడే అయినా,  టీడీపీ వాసన ఇంకా పోలేదనే నింద రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డిపై ఎందుకు తొలగటం లేదు? పార్టీలోకి రావడనికి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎందుకు సంకోచిస్తున్నాడు? సమాధానం రావాల్సిన‌‌‌‌‌‌‌‌ ప్రశ్నలే! ఖమ్మం జిల్లా రాజకీయాలను పార్టీ ఏదైనా చాలాకాలం కమ్మ సామాజికవర్గం శాసిస్తూ వచ్చింది. శీలం సిద్ధారెడ్డి తర్వాత పొంగులేటి, రెడ్డి సామాజికవర్గం నుంచి ఒక ‘డామినేటింగ్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టర్‌‌‌‌‌‌‌‌’ అయ్యారు. ‘పీపుల్స్‌‌‌‌‌‌‌‌పల్స్‌‌‌‌‌‌‌‌’ జరిపిన సర్వేలో... ఆయన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరితే, జిల్లాపై పూర్తి పట్టు లభిస్తుందని, కాదని బీజేపీలో చేరితే తనవరకు కొత్తగూడెంలో గెలవచ్చేమోగానీ పార్టీకి ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదని వెల్లడైంది. బీజేపీలో చేరితే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరితే కేంద్ర సర్కారు ఇబ్బంది పెడుతాయేమోననే భయం ఆయనకు ఉండొచ్చన్న చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. 

కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థిగా1999 నుంచి వరుసగా గెలిచిన జూపల్లి కృష్ణారావు తటపటాయింపు ఏమిటి? టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో ఇమడలేక బయటకు వస్తున్న ఆయనకు బీజేపీలో ఉన్న డీకే అరుణతో, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో ఉన్న నాగం జనార్ధన్‌‌‌‌‌‌‌‌రెడ్డితో పొసగదు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీలో టిక్కెట్ల కేటాయింపు ప్రక్రియ తెలియనట్టు, నాయకులు ఇప్పటి నుంచే హామీలు ఇస్తున్న తీరు ఆశ్చర్యకరంగా ఉంది. ‘గెలుపు గుర్రాల’ను బయటి నుంచి తెస్తే, రేపు టిక్కెట్లు లభించని పార్టీ ఆశావహులు ఎలా స్పందిస్తారో తెలియనిది కాదు. కాలం మారింది. ఏఐసీసీ అధ్యక్షుడు, దేశ ప్రధానిగా పనిచేసిన పి.వి.నర్సింహారావుకు 1998లో పార్టీ టిక్కెట్టు ఇవ్వలేదు. ఆయనను కలవడానికి వెళ్లిన ఓ సీనియర్‌‌‌‌‌‌‌‌ జర్నలిస్టుతో ‘మీకు చాన్నాళ్లకు గుర్తొచ్చానే?’ అన్నారు పీవీ! ఆ మాటా, ఈ మాటా అయ్యాక, ‘ఏంటి మీకే టిక్కెట్టు కోసేశారు?’ అని ప్రస్తావిస్తే, ‘అందుకని నన్నిప్పుడు తిట్టమంటారా నాయకత్వాన్ని? కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ నాకు సర్వం ఇచ్చింది. నేను విధేయత కలిగిన కార్యకర్తను. టిక్కెట్టు నిరాకరించడాన్ని తప్పుపట్టలేను’ అన్నారట. ఇప్పుడెవరంటారు అలా?

దిలీప్ రెడ్డి  పొలిటికల్ ఎనలిస్ట్