పొలిటికల్​ పార్టీల తీరు

ఉత్తరప్రదేశ్‌‌‌‌ అసెంబ్లీతో పాటు అయిదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు దేశంలో కొత్త రాజకీయ క్రమాన్ని వెల్లడిస్తున్నాయి. ఆధిక్యత సాధించాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా కాస్త విభిన్న వ్యూహాలు, కార్యాచరణ నిబద్ధత, కఠోర శ్రమతో వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు నొక్కి చెప్పాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌‌‌‌, పంజాబ్‌‌‌‌లో ఓటర్ల నిర్ణయం రాజకీయాలకు, రాగల పరిణామాలకు కొత్త సంకేతాలిచ్చినట్టుంది. మతం, కులం, అస్తిత్వం వంటి అంశాల్లో ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్న అభిప్రాయాలకు మంగళం పాడుతూ సరికొత్త సమీకరణాలు, వినూత్న అన్వయాలు తెరపైకి వచ్చాయి. అవి భారత రాజకీయాలకే కొత్తగా ఉన్నాయి. రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు, కార్యాచరణ అంచనాలకు మించి సత్ఫలితాలనిచ్చాయి. కొత్త రక్తంతో నిండిన భారతీయ ఓటర్లు సంప్రదాయ రాజకీయాలను ఖాతరు చేయక తిప్పికొట్టారని తాజా ఫలితాలు స్పష్టం చేశాయి.

జనరల్​ఎలక్షన్స్​కు సెమీఫైనల్స్​గా భావించే అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మెజారిటీ సర్వేల అంచనాల్ని నిజం చేసిన తీరు ఒకింత ఆశ్చర్యం కలిగించింది. పోలింగ్‌‌‌‌ అంచనాల పట్ల ఎన్నో సందేహాలు, ఉద్దేశాలు ఆపాదించడం వంటివి  మీడియా రంగంలో చక్కర్లు కొడుతున్న వేళ, ఆయా కథనాలకు భిన్నంగా సర్వేల తీరులోనే తుది ఫలితాలు రావడం గమనార్హం. ఇటీవలి పశ్చిమ బెంగాల్‌‌‌‌ ఎన్నికలప్పుడు మెజారిటీ సర్వే పోల్‌‌‌‌ అంచనాలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి విజయావకాశాలు ఉన్నట్టు చెప్పాయి. అయితే ఫలితాలు అందుకు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఇంకో ఆశ్చర్యకర విషయమేమంటే.. మతం, కులం, అస్తిత్వం వంటి అంశాల్లో ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్న అభిప్రాయాలకు మంగళం పాడుతూ సరికొత్త సమీకరణాలు, వినూత్న అన్వయాలు తెరపైకి వచ్చేలా చేశారు. అవి భారత రాజకీయాలకే కొత్తగా ఉన్నాయి. రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు, కార్యాచరణ అంచనాలకు మించి సత్ఫలితాలనిచ్చాయి. కొత్త రక్తంతో నిండిన భారతీయ ఓటర్లు సంప్రదాయ రాజకీయాలను ఖాతరు చేయక తిప్పికొట్టారని తాజా ఫలితాలు స్పష్టం చేశాయి. అయిదింట నాలుగు రాష్ట్రాల్లోని తమ ప్రభుత్వాల్ని నిలబెట్టుకున్న భారతీయ జనతాపార్టీకి ఈ ఫలితాలు కొత్త ఉత్సాహాన్నిస్తే, వారి ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్‌‌‌‌కు ఇవొక పెద్ద గుణపాఠం. ఢిల్లీ బయట రాజకీయంగా, సంస్థాగతంగానూ విస్తరించాలనుకుంటున్న ఆమ్‌‌‌‌ ఆద్మీ పార్టీ(ఆప్‌‌‌‌) వంటి వారికిది కొత్త ఊపిరి. ప్రభుత్వాలు విఫలం చెందాయని ప్రచారం చేస్తే చాలు, ప్రజలే తమను ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా గుర్తిస్తారనుకునే సమాజ్‌‌‌‌వాది, అకాలీదళ్‌‌‌‌వంటి ఇతర ప్రాంతీయ పార్టీలకు ఈ ఫలితాలొక గట్టి చెంపదెబ్బ!

కుల ప్రాధాన్యత తగ్గించి..
ఉత్తరప్రదేశ్‌‌‌‌, పంజాబ్‌‌‌‌ రాష్ట్రాల ఎన్నికల్లో చాలా కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. పనిచేయని కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వాన్ని పడదోయాలని నిర్ణయించుకున్న పంజాబ్‌‌‌‌ ఓటర్లు, బలమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడంలో ఏ మాత్రం తొట్రుపడలేదు. దశాబ్ద కాలంగా పలు ప్రయోగాలు చేస్తూ, కార్యాచరణ ద్వారా విశ్వాసం కలిగిస్తున్న ఆప్‌‌‌‌ ను సందేహాలకు అతీతంగా ఎంచుకొని భారీ మెజారిటీతో గెలిపించారు. శిరోమణి అకాలీదళ్‌‌‌‌(ఎస్‌‌‌‌ఏడీ)నే కాదు, దాంతో లోగడ అధికారం పంచుకున్న బీజేపీని ఏ రకంగానూ, ఎస్‌‌‌‌ఏడీ చీలిక వర్గంతో, కాంగ్రెస్‌‌‌‌ వీడిన కెప్టెన్‌‌‌‌ కొత్త పార్టీతో చేతులు కలిపినా.. పంజాబ్‌‌‌‌ ఓటర్లు విశ్వసించలేదు. 2017 ఎన్నికలప్పుడు ఆప్‌‌‌‌ను దెబ్బతీయడానికి వాడిన అస్తిత్వ వాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చినా, ఓటర్లు స్థిర చిత్తంతో దాన్ని తిప్పికొట్టి ఆప్‌‌‌‌ కే పట్టం కట్టారు. ఎన్నికలకు తగినంత ముందుగానే, బహుళ సంఖ్యాకులైన ఎస్సీల ప్రతినిధిగా చరన్​జిత్‌‌‌‌ సింగ్‌‌‌‌ చన్నీని ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్‌‌‌‌ ఆడిన నాటకం వికటించింది. మొత్తమ్మీద 33 శాతం ఓటింగ్‌‌‌‌ ఉండి, 30 శాతం కన్నా ఎక్కువ ఎస్సీ ఓటర్లున్న నియోజకవర్గాలు 54 ఉన్నప్పటికీ, పాలకపక్షం పఠించిన ‘చన్నీ.. ఎస్సీ’ జపాన్ని పంజాబీలు బేఖాతరన్నారు. ఉత్తరప్రదేశ్‌‌‌‌లోనూ ఇలాగే జరిగింది. కేవలం కులాల సర్దుబాటు, కూటమి ఏర్పాటుతోనే గెలిచిపోయామని భావించిన సమాజ్‌‌‌‌వాది(ఎస్పీ) పార్టీ కలల్ని ఓటర్లు కల్లలు చేశారు. కేశవ్‌‌‌‌ దేవ్‌‌‌‌ మౌర్య అన్నట్టు ‘అతి విశ్వాసమే’ వారి కొంప ముంచింది. 2017 ఎన్నికల్లో ‘సామాజిక సంతులన’లతో రికార్డు స్థానాలు(312) దక్కించుకున్న బీజేపీ కూటమి ఈసారీ వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. కులాల ప్రతినిధులుగా, సంక్షేమ పథకాల అమల్లో(రాజకీయ ప్రాపకంతో) మధ్య దళారులుగా వ్యవహరించే వారి పెత్తనాలకు ఒక రకంగా కత్తెర వేసింది. కుల ప్రమేయాన్ని ఎన్నికల్లో తగ్గించే ఎత్తుగడ అమలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన38 సంక్షేమ పథకాల్లో నేరుగా లబ్ధిదారులకు నగదు రూపంలో చేరేలా ‘జన్‌‌‌‌ధన్‌‌‌‌ ఆధార్‌‌‌‌ మొబైల్‌‌‌‌(జామ్‌‌‌‌)’ ను పకడ్బందీగా అమలు చేసింది. ప్రభుత్వ పథకాల నుంచి నగదు పొందే వారితో ఒక విశాలమైన ఓటు బ్యాంకును కొత్తగా తయారు చేసింది. ఫలితంగా అట్టడుగున ఉండే కోట్లాది మంది లబ్ధిదారులు మధ్యదళారుల బారిన పడే అగత్యం తప్పింది. తద్వారా కుల ప్రాధాన్యత తగ్గించినట్టయింది.

ఆ ఇద్దరు కొత్తగా అంటరానివారవుతారా?
గెలుపు మార్గం తేలిక చేసుకునే క్రమంలో కులం కన్నా మతానికి బీజేపీ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ముస్లిం ఓటులోనూ విభజన తెచ్చేలా బయటకు కనిపిస్తున్నా, వారు విధిలేక ఎస్పీ వెనుక చేరే వాతావరణం కల్పించడం ఒక ఎత్తుగడ! ఫలితంగా మెజారిటీ హిందూ ఓట్లు బీజేపీ వైపు ఏకీకృతం కావడం లక్ష్యం. ఈ ఎత్తుగడతో పాటు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌‌‌‌ యోగి 80–20 రాజకీయ వ్యాఖ్య ఒక పాచికలా పారింది. ‘కిత్నా బదలా యూపీ’ పేరుతో రెండు రోజుల దూరదర్శన్‌‌‌‌ సదస్సు చివరిరోజున యూపీ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 80 శాతం పాజిటివ్‌‌‌‌ ఎనర్జీతో ముందుకు వెళుతుంటే .. ఈ 20 శాతం మంది ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటారని, వారు వ్యతిరేకులుగానే మిగులుతారని విమర్శించారు. 2022 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, సబ్‌‌‌‌కా సాథ్‌‌‌‌, సబ్‌‌‌‌కా వికాస్‌‌‌‌ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళుతుందని పేర్కొన్నారు. బీజేపీకి ఇబ్బంది అనుకున్న జాతవ్‌‌‌‌, యాదవ్‌‌‌‌ ఓట్లతో పాటు ముస్లిం ఓట్లలోనూ ఈ సారి ఎక్కువ శాతం వారికి అనుకూలంగా పడటం వ్యూహాలు, ఎత్తుగడల ఫలితమే! కులాల వారీగా ఎవరెటు మొగ్గారనే విషయంలో శాస్త్రీయ గణాంకాలు లేకపోయినా, ఈ విషయంలో ‘లోక్‌‌‌‌నీతి–సీఎస్‌‌‌‌డీఎస్‌‌‌‌’ జరిపిన ఎగ్జిట్‌‌‌‌పోల్‌‌‌‌ సర్వేనే ఉన్నంతలో ప్రామాణికం. ఈ సర్వే ప్రకారం ఆరేడేండ్లుగా, ముఖ్యంగా 2017 నుంచి బీజేపీ రచించి అమలు చేస్తున్న ‘సామాజిక సంతులన(సోషల్‌‌‌‌ ఇంజనీరింగ్‌‌‌‌)’ వారికి ఇంకా ఫలాలిస్తూనే ఉంది. యాదవేతర వెనుకబడిన తరగతులు ప్రధానంగా(అయిదింట మూడొంతులు), జాతవేతర ఎస్సీలు(అయిదింట రెండొంతులు) ఈ సారి బీజేపీకి ఓటు వేశారు. ఈ రెండూ కూడ 2017 నాటి కన్నా మెరుగైన గణాంకాలే! ఎస్సీల విషయంలో అది గతంతో పోలిస్తే రెట్టింపు కన్నా ఎక్కువ! ఈసారి విచిత్రంగా, ఆయా సామాజిక వర్గాల్లో 2017 కన్నా యాదవుల ఓట్లు(10 నుంచి 12 శాతానికి), జాతవ్‌‌‌‌ల ఓట్లు(8 నుంచి 21 శాతానికి), ముస్లిం ఓట్లు (8 నుంచి 12 శాతానికి) బీజేపీ ఈసారి మెరుగుపరచుకున్నట్టు సీఎస్‌‌‌‌డీఎస్‌‌‌‌ లెక్కలు చెబుతున్నాయి. బయట జరిగే ఆలోచనలు, ప్రచారాలకు ఇది పూర్తి భిన్నం! వాస్తవం ఒకలా ఉండి, ప్రచారంలో ఇంకోలా ముద్రపడటం వల్ల యూపీలో ముస్లింలు, యాదవులు కొత్తగా రాజకీయ అస్పృశ్యులయ్యే ప్రమాదాన్ని విశ్లేషకులు, పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆధిపత్య రాజకీయాల విషయంలోనూ ఇట్లాగే జరిగి, అది రాజకీయ పునరేకీకరణల్ని బీజేపీకి సానుకూలం చేస్తోంది. యోగి నేతృత్వపు పాలనలో అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈసారి వచ్చిన ప్రజాభిప్రాయం(43 శాతం) కన్నా, 2017 సర్వేలో, అఖిలేష్‌‌‌‌ యాదవ్‌‌‌‌ నేతృత్వపు ఎస్పీ ప్రభుత్వంలో యాదవుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన జనాభిప్రాయమే (54 శాతం) ఎక్కువ!  ప్రస్తుతం బహుజన సమాజ్‌‌‌‌ పార్టీ(బీఎస్పీ) బలహీనపడిన నేపథ్యంలో వారి ఓటు బ్యాంకులో అత్యధికులు ఎస్పీ వైపు కాకుండా బీజేపీ వైపు మొగ్గడం తుది ఫలితాన్ని ప్రభావితం చేసింది.

మహిళా ఓటు స్రవంతి విడిగా ఉంటుందా?
భారతీయ ఎన్నికల ఓటింగ్‌‌‌‌ సరళిలో ఉమ్మడి కుటుంబ నిర్ణయం కాకుండా మహిళలు విడిగా ఆలోచిస్తారా? అన్న ప్రశ్న తలెత్తడం సహజం!  కానీ, భిన్నంగానూ ఉండే ఆస్కారం ఉందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. లోక్‌‌‌‌నీతి–సీఎస్‌‌‌‌డీఎస్‌‌‌‌ సర్వే ఫలితాల్లోనూ ఇదే వెల్లడయింది. 2022 ఎన్నికల్లో మహిళా ఓటు ప్రాంత, కుల, మత వైవిధ్యాలకు అతీతంగా బీజేపీ కూటమికి లాభించింది. వివిధ సంక్షేమ పథకాలు, ఉచిత ఎల్పీజీ గ్యాస్‌‌‌‌ వంటి ప్రయోజనాలు, వారి భద్రతకు సంబంధించిన శాంతి–భద్రత అంశాలే ఇందుకు కారణమనే విశ్లేషణలున్నాయి. యాక్సిస్‌‌‌‌ పోస్ట్‌‌‌‌ పోల్‌‌‌‌ సర్వే ప్రకారం, ఎస్పీ, బీజీపీ కూటముల మధ్య మహిళల మొగ్గు 2017 కన్నా పోల్‌‌‌‌ పర్సెంటేజ్‌‌‌‌ పాయింట్స్(పీపీపీ) ప్రాతిపదికన చూసినప్పుడు, ఈ సారి ఎక్కువ వ్యత్యాసంతో మహిళల మొగ్గు బీజేపీ పక్షంలో ఉంది. కిందటిసారి ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళల మొగ్గు వ్యత్యాసం బీజేపీ పక్షంలో 5 పీపీపీ ఉంటే, ఈ సారి అది 13 పీపీపీగా నమోదయింది. విపక్షంగా తాను ఆరోపించిన ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో, ఎండగట్టడంలో ఎస్పీ విఫలమైంది. పొత్తుల యావలో పడి ప్రచారం ఆలస్యంగా మొదలెట్టింది. ఎన్నికల ప్రణాళికను సకాలంలో, నమ్మించే విధంగా ప్రజల్లోకి తీసుకుపోవడంలో విఫలమైంది. అదే సమయంలో, తాను చేసిన పనుల్ని చెప్పుకోవడంలో, ప్రజల్ని నమ్మించడంలో బీజేపీ నాయకత్వం సఫలమైంది. ఇందుకు పూర్తి విరుద్ధంగా పంజాబ్‌‌‌‌లో జరిగింది. అందుకే, ఫలితాలు అలా ఉన్నాయి. మొత్తమ్మీద ఈ ఫలితాలు అనేక అంశాలతో ముడిపడిన కొత్త రాజకీయ వాతావరణానికి సంకేతాలిచ్చాయి.
- దిలీప్‌‌‌‌రెడ్డి పొలిటికల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌