రజకులకు రాజకీయంగా వాటా దక్కాలి: ఓయూ జేఏసీ ఉపాధ్యక్షుడు గొంపల శ్రీనివాస్​

రజకులకు రాజకీయంగా  వాటా దక్కాలి:  ఓయూ జేఏసీ ఉపాధ్యక్షుడు గొంపల శ్రీనివాస్​
  • రజకులు సామాజిక సేవకులు

ఖైరతాబాద్, వెలుగు: రజకులు నిరంతర సామాజిక సేవకులని ఓయూ జేఏసీ ఉపాధ్యక్షుడు గొంపల శ్రీనివాస్​అన్నారు. ప్రజలకు ఎంతో సేవ చేసినా రజకులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదన్నారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో బుధవారం తెలంగాణ రాష్ట్ర రజక ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 గత ప్రభుత్వ హయాంలో రజకుల ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి ఉప్పల్​లో 2 ఎకరాల స్థలం కేటాయించారన్నారు. అయితే, భవన నిర్మాణానికి ఇప్పటివరకు పునాది పడలేదన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలో తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.  ‘మేమెంతో మాకంత’ అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. 

ముఖ్యంగా రజక ఫెడరేషన్​కు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్​ చేశారు. గ్రామాల్లో ఇప్పటికీ రజకులు బహిష్కరణకు గురవుతున్నారని, ప్రభుత్వం తమ సమస్యల పట్ల స్పందించాలని కోరారు. సమావేశంలో రజక సంఘం నాయకులు పోషం వెంకన్న, అభహేందర్, శేఖర్, శివకుమార్, మురళి  పాల్గొన్నారు.