పల్లా వర్సెస్‍ ఆ నలుగురు.. వరంగల్​లో మారిన పొలిటికల్​ సీన్​

ఇటీవల పల్లా ఎంట్రీతో ఉమ్మడి వరంగల్ జిల్లా పొలిటికల్​ సీన్​ మారిపోయింది. సరిగ్గా బీఆర్ఎస్ లో టికెట్ల ప్రకటన ముందు పల్లా ఝలక్​ ఇచ్చిన తీరుపై  సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను హైకమాండ్​ దూతనే తప్ప పార్టీలో తన సొంత నిర్ణయాలు ఏమీ ఉండవని పల్లా ఓపెన్​గా చెప్తున్నప్పటికీ ఎమ్మెల్యేలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. హైకమాండ్​ ఆదేశాలే అమలు చేయాలనుకుంటున్నప్పుడు ముత్తిరెడ్డి విషయంలో అంత హైడ్రామా అవసరం లేదని  ఆయన వ్యతిరేకులు సైతం అంటున్న పరిస్థితి! మొత్తం మీద పల్లా రాకతో అటు ముత్తిరెడ్డి, ఇటు పోచంపల్లి టికెట్లు ఆగిపోగా, స్టేషన్​ఘన్​పూర్​లో కడియం కోసం తనకు వ్యతిరేకంగా కుట్రపన్నాడని ఎమ్మెల్యే రాజయ్య తన అనుచరుల వద్ద వాపోతున్నాడు. మరోవైపు ఉమ్మడి వరంగల్ పై  క్రమంగా పట్టుబిగిస్తున్న పల్లా రాజేశ్వర్​రెడ్డి ఉనికి  మంత్రి ఎర్రబెల్లికి ఏమాత్రం మింగుడుపడడం లేదు. ఇది ఏకంగా తన మినిస్టర్​ పదవికే ఎసరు తెస్తుందనే భయాందోళన ఆయనలో కనిపిస్తోంది. దీంతో ఉమ్మడి వరంగల్​ జిల్లాలో పరిస్థితి పల్లా వర్సెస్​ఆ నలుగురు అన్నట్లుగా తయారైందని క్యాడర్​లో చర్చ జరుగుతోంది. 

అటు ముత్తిరెడ్డి..ఇటు పోచంపల్లి..మధ్యలో పల్లా.. 

జనగామ టికెట్​తనకు రాకుండా పల్లా రాజేశ్వర్​రెడ్డి కుట్ర చేశాడని ముత్తిరెడ్డి వర్గం ఆరోపణలు చేస్తోంది. గతంలో ఆడపదడపా పోచంపల్లి వర్గం ఫ్లెక్సీలు కట్టడం, టికెట్‍ తమకే అని చెప్పుకోవడంతో ముత్తిరెడ్డి కేసీఆర్‍ దగ్గరకు వెళ్లి ఇష్యూను క్లియర్‍ చేసుకున్నాడు. కానీ, పల్లా మాత్రం ఎక్కడా బయటపడకుండా తనను తొక్కేశాడని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భావిస్తున్నారు. మరోవైపు పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డిది కూడా ఇదే పరిస్థితి. జనగామలో ముత్తిరెడ్డిని మార్చాల్సివస్తే తనకే అవకాశం వస్తుందని పోచంపల్లి అనుకున్నాడు. పార్టీ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ కేటీఆర్‍ మద్దతు ఉండడంతో తనవంతు ప్రయత్నాలు చేశాడు. జనగామ నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులతో సఖ్యత పెంచుకున్నాడు. వివిధ సందర్భాల్లో వారికి బహుమతులు, నజరానాలు ఇస్తూ తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకుని సోషల్‍ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. తీరాచూస్తే.. జనగామ సీటు అటు ముత్తిరెడ్డికి కాకుండా...ఇటు పోచారానికి కాకుండా మధ్యలో వ్యక్తి ఎగరేసుకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏం చేయాలా అని ఆ ఇద్దరు నేతలు ఆలోచిస్తున్నారు.  

పల్లా వస్తే ఎర్రబెల్లి హవాకు బ్రేక్‍

సీనియర్‍ లీడర్‍గా, రాష్ట్ర పంచాయతీరాజ్‍ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్‍రావు ఉమ్మడి వరంగల్‍ జిల్లా రాజకీయాల్లో మెయిన్‍ లీడ్‍ పోషిస్తున్నారు. ప్రభుత్వం జూన్‍ 2, ఆగస్టు 15తో పాటు పార్టీ తరఫున ఉమ్మడి జిల్లాలో ఎక్కడ సభలు పెట్టినా ముందుండి నడిపిస్తున్నారు. కాగా, జనగామలో పల్లాకు బీఆర్ఎస్​టికెట్​ఇచ్చి పల్లా ఎమ్మెల్యే అయితే తన హవాకు బ్రేక్‍ పడుతుందనే భావనలో దయాకర్‍రావు టీంలో ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే​జనగామ వంటి చిన్న జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉండదు. అదే జరిగితే పల్లా రూపంలో తన మినిస్టర్​పోస్ట్​ పోతుందని ఎర్రబెల్లి టెన్షన్​పడుతున్నట్టు సమాచారం. పాలకుర్తి ఎమ్మెల్యేగా దయాకర్‍రావు ఇన్నాళ్లూ జనగామ జిల్లా కేంద్రంలో అన్నీతానై ముందుకుసాగగా..ఇప్పుడు జనగామలో పల్లా పేరు ప్రచారంలోకి రావడం ఆయనను కలవరపెడుతోందని అంటున్నారు.. ఇప్పుడు హైకమాండ్‍ ఎర్రబెల్లి దయాకర్‍రావుకు జనగామ విషయం మరిచిపొమ్మని, ములుగులో బడే నాగజ్యోతి గెలుపు పై దృష్టి పెట్టాలని సూచించినట్టు తెలుస్తోంది.  

పల్లాపై రాజయ్య గుర్రు

స్టేషన్‍ ఘన్‍పూర్‍ ఎమ్మెల్యేగా సిట్టింగ్‍ సీటు తనకు కాకుండా కడియం శ్రీహరికి దక్కడంలో పల్లా రాజేశ్వర్‍రెడ్డి హస్తం ఉందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వర్గం ఫీల్‍ అవుతోంది. పల్లా సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలోని వేలేర్‍ మండలం సోడాశపల్లి కావడంతో ఇక్కడి రాజకీయాల్లో ఆయన సైతం తన మార్కు చూపారని భావిస్తున్నారు. కడియం.. రాజయ్యకు మధ్య జరిగిన పొలిటికల్‍ వార్‍లో పల్లా కడియం వైపు సపోర్ట్​గా నిలవడంవల్లే తనకు అన్యాయం జరిగిందని ఆయన గుర్రుగా ఉన్నారు. బుధవారం పల్లా రాజేశ్వర్‍రెడ్డి..రాజయ్యను కలిసే ప్రయత్నం చేసినా ఏదో ఒక సాకుతో దూరంగా ఉన్నారు. 

మంత్రి ఆశావాహులు అంతంతే.. 

ఉమ్మడి వరంగల్‍ జిల్లా నుంచి మూడు, నాలుగైదుసార్లు గెలిచి కేసీఆర్‍ ప్రభుత్వంలో మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నావారున్నారు. అగ్రవర్ణాల్లో ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్‍రావు ఉండగా.. రెడ్డి సామాజిక వర్గం నుంచి సీనియర్‍ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‍రెడ్డి వంటి నేతలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వీరేగాక ఉద్యమకారుడిగా, బీసీ నేతగా గతంలో వరంగల్‍ పశ్చిమ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఐదోసారి బరిలో ఉంటున్న దాస్యం వినయ్‍ భాస్కర్‍ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. రాష్ట్రంలో హరీశ్​రావు తర్వాత రికార్డు మెజారిటీతో గెలుస్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‍ దళిత కోటాలో జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మొదటిసారే ఎమ్మెల్యేగా గెలిచినా..మంత్రి పదవి దక్కించుకునే స్థాయిలో పల్లా ఉండడంతో వీరంతా ఆయన రావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. మామూలు సమయాల్లోనే కేసీఆర్‍ షాడోలా అందరిపై కమాండ్​ చూపే పల్లాకు మంత్రి పదవి వస్తే జిల్లాలో తమ పరిస్థితి ఏంటనే ఆందోళన జిల్లాలోని బీఆర్‍ఎస్‍ పార్టీ ఎమ్మెల్యేల్లో నెలకొంది. 

 హైకమాండ్‍ ఆదేశమంటున్న పల్లా

జనగామ టిక్కెట్‍ విషయంలో తాను ఇంట్రస్ట్ ​చూపకున్నా బ్లేమ్‍ అవుతున్నానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‍రెడ్డి తన అనుచరులతో చెప్తున్నారు. తాను ఎమ్మెల్యే టిక్కెట్‍ అందులోనూ జనగామ టిక్కెట్‍ అడగలేదని అంటున్నారు. హైకమాండ్‍ ఆదేశం మేరకే నడుచుకుంటాను తప్పితే సొంత ఇంట్రెస్ట్ లేదని చెబుతున్నారు. ఇప్పటికీ హైకమాండ్​ ఏది చెబితే అది చేస్తానని అంటున్నారు. కాగా, మరో వర్గం మాత్రం పల్లా రాకను స్వాగతిస్తోంది. జనగామ.. సిద్ధిపేట తరహాలో డెవలప్‍ కావాలంటే..పార్టీ పెద్దల వద్ద పలుకుబడి కలిగిన పల్లా వంటి వ్యక్తులే బెటర్‍ అని అంటుండడం కొసమెరుపు.