ఎమ్మెల్యే అండతోనే అక్రమంగా మట్టి దందా!

ఎమ్మెల్యే అండతోనే అక్రమంగా మట్టి దందా!

మెదక్, నర్సాపూర్​, వెలుగు:  నర్సాపూర్​ నియోజకవర్గంలో అక్రమ మట్టి, ఇసుక రవాణాపై రాజకీయ దుమారం రేగుతోంది. బీఆర్​ఎస్​ లీడర్ల అండదండలతోనే ఇల్లీగల్​ దందా కొనసాగుతోందని బీజేపీ, కాంగ్రెస్​ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్​లు ఢీకొనడంతో ప్రాణాలు పోతున్నా స్పందించడం లేదంటూ లీడర్లు ఆందోళనకు దిగారు. గురువారం నర్సాపూర్​ ఆర్డీఓ ఆఫీస్​ లో ధర్నాచేయడంతోపాటు, పట్టణంలో దుకాణాలు మూసివేయించారు. 

 కొన్నినెలలుగా నియోజవర్గంలోని నర్సాపూర్, శివ్వంపేట, హత్నూర, కౌడిపల్లి మండలాల్లోని చెరువుల నుంచి మట్టి, కొల్చారం మండల పరిధిలోని హల్దీ వాగు నుంచి ఇసుక పెద్ద మొత్తంలో తరలిపోతోంది. జేసీబీలతో తవ్వి టిప్పర్లలో ఇటుక బట్టీలకు, కంపెనీలకు, హైదరాబాద్​ శివారు ప్రాంతాలకు తరలిస్తున్నారు. మట్టి, ఇసుక తరలించాలంటే ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ​ డిపార్ట్​మెంట్ల పర్మిషన్​ ఉండాలి. అంతేగాక క్యూ బిక్​ మీటర్​ లెక్కన చార్జి చెల్లించాలి. పర్మిషన్​ తీసుకున్నా రూల్స్​ ప్రకారం మాత్రమే మట్టి తవ్వాలి. అయితే ఎలాంటి పర్మిషన్​ లేకుండానే చెరువుల నుంచి ఇష్టారీతిగా మట్టిని తవ్వుతున్నారు. అడ్డుకునే వారు లేకపోవడంతో వందలాది టిప్పర్ల మట్టి తరలిపోతోంది. డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్ల నిర్మాణం, కాళేశ్వరం కాల్వల పనుల కోసమని పర్మిషన్​ తీసుకుని, కొల్చారం మండలం కొంగోడ్​ హల్దీ వాగు నుంచి పెద్ద మొత్తంలో ఇసుక తరలిస్తూ ప్రైవేట్​లో అమ్మకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల బీజేపీ నాయకులు కొంగోడ్​ వద్ద హల్దీవాగు వద్ద రాత్రివేళ కాపుకాసి ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. 

భయపెడుతున్న టిప్పర్లు

నర్సాపూర్​ పట్టణం మీదుగా హైదరాబాద్​ వైపు మట్టి తరలిస్తున్నటిప్పర్లు స్పీడ్​గా వెళ్తున్నాయి. దీంతో ఈ రూట్లో ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. బుధవారం నర్సాపూర్​ - గుమ్మడిదల మధ్యలో టిప్పర్​ కారును ఢీకొన్న సంఘటనలో నర్సాపూర్ కు చెందిన బాదె హరిభూషనమ్మ మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనతో వాహనదారులు మరింత భయపడుతున్నారు. 

ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్​

నర్సాపూర్​, హత్నూర, శివ్వంపేట, కౌడిపల్లి మండలాల​పరిధిలోని అనేక చెరువుల నుంచి మట్టి, కొల్చారం మండల పరిధిలోని హల్దీ వాగు నుంచి ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. ఈ విషయమై నర్సాపూర్​ తహసీల్దార్​కు ఆర్డీఓకు, కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవు. అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలి.

- మురళీ యాదవ్​, నర్సాపూర్​ మున్సిపల్​ చైర్మెన్​

ఎమ్మెల్యే అండతోనే అక్రమ దందా

అక్రమ మట్టి దందాకు అడ్డగా నర్సాపూర్ తయారైంది. స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే ఆయన అనుచరుల ఆధ్వర్యంలోనే అక్రమ మట్టి రవాణా జరుగుతోంది. ఆఫీసర్లు చూసి చూడనట్టు వ్యవహరించడంతో ప్రజల ప్రాణాలు మట్టి టిప్పర్లకు బలైతున్నాయి. దీనికి ఎమ్మెల్యేదే పూర్తి బాధ్యత. టిప్పర్​ ఢీకొని చనిపోయిన వారి కుటుంబానికి న్యాయం చేయాలి.

- ఆంజనేయులు గౌడ్​, టీపీసీసీ అధికార ప్రతినిధి

ఎవరికి పర్మిషన్​ ఇవ్వలేదు

చెరువుల్లో నుంచి మట్టి తరలించేందుకు ఎవరికీ పరిష్మన్​ ఇవ్వలేదు. మండలంలోని వివిధ చెరువుల నుంచి నల్ల మట్టి తరలిస్తున్న వారిపై చర్యల గురించి పై అధికారులకు రిపోర్ట్​ చేశాం.   నిఘా ఏర్పాటు చేసి అక్రమంగా మట్టి తరలించే వారిపై చర్యలు తీసుకుంటాం.

- మణిభూషన్​, ఇరిగేషన్​ ఏఈ, నర్సాపూర్​