ఎర్రబెల్లి వర్సెస్‍ ఎర్రబెల్లి : ఓరుగల్లులో  అన్నదమ్ముల సవాల్..

  • ఓరుగల్లులో  అన్నదమ్ముల సవాల్
  • తూర్పులో ఎర్రబెల్లి వర్సెస్‍ ఎర్రబెల్లి  

వరంగల్‍, వెలుగు :  ఓరుగల్లు రాజకీయాల్లో అన్నదమ్ముల మధ్య పోరు నడుస్తోంది. ఉమ్మడి వరంగల్‍ జిల్లాలోని వరంగల్‍ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్​నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు ఈయన తమ్ముడు బీజేపీ లీడర్,​వరంగల్‍ అర్బన్‍ కో ఆపరేటివ్‍ బ్యాంక్‍ చైర్మన్‍ ఎర్రబెల్లి ప్రదీప్‍రావు మధ్య నువ్వానేనా అన్నట్టు ఉంది. మధ్యలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍..ఎర్రబెల్లి ప్రదీప్‍రావును టార్గెట్​చేయగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావుతో సఖ్యతగా ఉంటున్నాడు. దయాకర్‍రావు కూడా తమ్ముడిని కాదని నరేందర్‍ను పలు సభల్లో ‘నా తమ్ముడు’ అని పలకరిస్తున్నాడు. నియోజకవర్గానికి ఏది కావాలన్నా దగ్గరుండి ఇప్పిస్తున్నాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత తమ్ముడికి ప్రధాన పోటీదారుడిగా భావించే నరేందర్‍ను కాపాడుకోవాలని క్యాడర్​ను పిలుపునిస్తున్నాడు. దీంతో ఉమ్మడి వరంగల్​జిల్లాలోని వరంగల్‍ తూర్పు నియోజకవర్గంలో పరిణామాలను అందరూ ఆసక్తితో పరిశీలిస్తున్నారు.  

నరేందర్‍తో వేగలేక.. బీజేపీలోకి..  

రాష్ట్ర పంచాయతీ రాజ్‍ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు సోదరుడైన ఎర్రబెల్లి ప్రదీప్‍రావు ప్రజా రాజ్యం పార్టీ నుంచి వరంగల్‍ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కేసీఆర్‍ టీం ఆహ్వానం మేరకు బీఆర్‍ఎస్‍లో చేరారు. 2018 ఎన్నికల్లో టికెట్‍ వస్తుందనే ఆశతో ఉన్నా..అప్పటివరకు మేయర్‍గా ఉన్న నరేందర్‍కు అవకాశం ఇవ్వడంతో ఇండిపెండెంట్‍గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో హైకమాండ్‍, అన్న దయాకర్‍రావు మాట మీద విత్‍ డ్రా చేసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక నరేందర్‍ కనీస మర్యాద ఇవ్వడం లేదని. తన కేడర్‍పై కావాలనే పోలీస్‍ కేసులు పెట్టిస్తున్నాడని, సూటిపోటి మాటలతో మనసు నొప్పిస్తున్నాడని ఆవేదన చెందారు. నరేందర్‍ పొమ్మనలేక పొగ పెడ్తున్నాడని భావించిన ప్రదీప్‍రావు గతేడాది ఆగస్టులో బీజేపీలో చేరారు.  

తమ్మున్ని తిట్టి.. అన్నను మెచ్చుకుంటూ.. 

వరంగల్‍ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‍, ఎర్రబెల్లి ప్రదీప్‍రావుకు మధ్య రాజకీయంగా పోటీ ఉన్నా నరేందర్‍ ఆ పరిధి దాటి పలుమార్లు వ్యక్తిగత దూషణకు దిగారు. అరేయ్‍..ఒరేయ్‍ పరిధి కూడా దాటి పొడుస్తా..చీరేస్తా అంటూ వార్నింగ్‍ లు కూడా ఇచ్చారు. నోటికి చెప్పలేని స్థాయిలో బూతు పురాణం అందుకున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే నరేందర్‍ ...ప్రదీప్‍రావు సోదరుడైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావును నెత్తిన పెట్టుకుంటున్నారు. ఏ కార్యక్రమం జరిగినా లోకల్‍గా ఉండే మేయర్‍ గుండు సుధారాణి, మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజ్‍ సారయ్య, చివరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్‍కు కనీస ఆహ్వానం ఇవ్వకుండా మంత్రి దయాకర్‍రావును అతిథిగా పిలుస్తున్నారు. రథంలో ఊరేగించి..దారి పొడవునా పూలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. దయన్నే తనకు ఆదర్శమంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మంత్రి ద్వారానే కావాల్సిన నిధులు తెప్పించుకుంటున్నారు. 

తమ్ముడి రాజకీయ ప్రత్యర్థికి అన్న అండ

ఎర్రబెల్లి ప్రదీప్‍రావు ఓ విధంగా పార్టీ హైకమాండ్‍ కంటే ఎమ్మెల్యే నరేందర్‍ పోరు భరించలేకే కారు దిగి కమలం పార్టీలో చేరారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరఫున అధికార పార్టీ అభ్యర్థిపై పోటీ చేసేలా ప్లాన్​ వేస్తున్నారు. ఎమ్మెల్యేకి ఏ మాత్రం తగ్గకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి తమ్ముడిని నరేందర్‍ తీవ్రంగా దూషించిన నేపథ్యంలో తమ్ముడికి సపోర్ట్​ చేయకపోయినా తటస్థంగా ఉంటారేమోనని అంతా భావించారు. కానీ, దయాకర్‍రావు మాత్రం ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో ఇతర నియోజకవర్గాల కంటే  తూర్పు నియోజకవర్గంలోనే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారు. సదరు నియోజకవర్గంలో ఏ ప్రొగ్రాం ఉన్నా వెళుతున్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. 

‘గీసుకొండ టెక్స్​టైల్ ​పార్కులో తూర్పు నియోజకవర్గానికి చెందిన వారికి ఎక్కువ అవకాశం ఇస్తాం. గృహలక్ష్మి కింద రావాల్సిన ఇండ్ల కన్నా ఎక్కువ ఇండ్లు ఇప్పిస్తాం. ఇప్పటికే రూ.1116 కోట్లతో 24  అంతస్తుల సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్ ​నిర్మించాం. వరంగల్‍ కొత్త బస్టాండ్‍, కలెక్టరేట్‍ ఏర్పాటుతో పాటు తూర్పు నియోజకవర్గ కేంద్రంగా బీఆర్‍ఎస్‍ ఆఫీస్‍ నిర్మిస్తాం’ అని మాటిచ్చారు. ఆయన  అన్నట్లుగానే ఈ నెల 5న మంత్రి కేటీఆర్‍ వరంగల్‍ పశ్చిమ నియోజకవర్గ పర్యటనతో పాటు వరంగల్ తూర్పులో బీఆర్‍ఎస్‍ ఆఫీస్‍ ఓపెనింగ్‍ ఉండేలా చూశారు. అయితే, రాజకీయాల్లో దయాకర్‍రావును క్లోజ్‍గా చూసినవారు మాత్రం.. మంత్రి ఇదంతా స్ట్రాటజీ ప్రకారమే చేస్తున్నాడని అంటున్నారు. పార్టీ లైన్‍ దాటకుండా తూర్పు విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.