పటాన్​చెరులో భగ్గుమన్న గ్రూపు రాజకీయాలు

పటాన్​చెరులో భగ్గుమన్న గ్రూపు రాజకీయాలు
  • ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలంటూ క్యాంప్ ఆఫీస్​పై కాంగ్రెస్ శ్రేణుల దాడి
  • హైకమాండ్​ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు కాంగ్రెస్ లో పొలిటికల్  వార్  రచ్చకెక్కింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లోని ఓ వర్గం నేతలు గురువారం ఎమ్మెల్యే క్యాంప్  ఆఫీసుపై దాడికి దిగారు. బీఆర్ఎస్  నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్  చేయాలని డిమాండ్  చేస్తూ నినాదాలు చేస్తూ క్యాంప్  ఆఫీసులోని కుర్చీలను విరగొట్టారు. హైవేపై బైఠాయించి ధర్నా చేశారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. 

దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్  నాయకులతో అధికారిక కార్యక్రమాలు చేస్తూ, అసలైన కాంగ్రెస్  కార్యకర్తలను ఎమ్మెల్యే తొక్కేస్తున్నారని.. పటాన్ చెరులో కాంగ్రెస్ ను భూస్థాపితం చేసే కుట్ర జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంప్​ ఆఫీసులో మాజీ సీఎం కేసీఆర్  ఫొటో ఉండడంతో కాంగ్రెస్  శ్రేణులు మండిపడ్డారు. ఎమ్మెల్యే కుర్చీపై సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టి ఎమ్మెల్యే తీరును ఖండించారు.

హైకమాండ్ కు ఎమ్మెల్యే ఫిర్యాదు..

క్యాంప్​ ఆఫీస్​పై పార్టీ కార్యకర్తలు దాడి చేసిన విషయమై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఘటన అనంతరం మీడియాతో మాట్లాడారు. సొంత పార్టీ నాయకులు క్యాంప్  ఆఫీస్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యక్తిగత దాడులకు చోటు లేదని, ఇదంతా కాటా శ్రీనివాస్ గౌడ్ చేయిస్తున్నారని ప్రజలు రెండుసార్లు ఛీకొట్టినా ఆయనకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. దాడులను ప్రోత్సహించే కాటా జీవితంలో ఎమ్మెల్యేగా గెలవడన్నారు. ఎస్పీ, ఐజీకి ఫిర్యాదు చేశానని, ఆందోళనకారులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే కోరారు.