- అమ్మను తలపిస్తోందంటున్న కాంగ్రెస్
- కాంగ్రెస్ తల్లి విగ్రహమంటున్న బీఆర్ఎస్
- అభయ హస్తమేంటి.. బతుకమ్మ ఏది అంటున్న బీజేపీ
- పాలాభిషేకాల పేరుతో మరో సారి సెంటిమెంట్ రగించే యత్నంలో గులాబీ పార్టీ
- గెజిట్ రిలీజ్ చేశాం.. వక్రీకరిస్తే కఠిన చర్యలన్న సర్కారు
హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదే అదనుగా మరోమారు సెంటిమెంట్ రగిలించే పనిలో నిమగ్నమైంది బీఆర్ఎస్. తమ హయాంలో నెలకొల్పిన విగ్రహాలను మార్చొద్దని కారు పార్టీ పట్టుబట్టుతోంది. సెంటిమెంట్ రగిలించేందుకు ఊరూరా పాలాభిషేకాలకు పిలుపునిచ్చింది. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత స్వయంగా పాల్గొన్నారు. పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విగ్రహం కాంగ్రెస్ తల్లిని తలపించేలా ఉందన్నారు.
ఉద్యమకారులతో ఆటలాడుకోవద్దంటూ మరో మారు తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా బీజేపీ కూడా తెలంగాణ తల్లి విగ్రహంపై విమర్శలు చేస్తోంది. బతుకమ్మ లేదని, ఆకుపచ్చ రంగు చీర కట్టారని అంటోంది. దీనికి తోడు కిరీటాన్ని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని విమర్శిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహం రాచరికపు పోకడలకు దూరంగా అమ్మను తలపించేలా తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో, విగ్రహావిష్కరణ సందర్భంగా చెప్పారు. తెలంగాణ తల్లి రూపకల్పనలో సంప్రదాయం, సంస్కృతులను పరిగణనలోకి తీసుకున్నామన్నారు.
ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టూబొట్టుతో, గుండ్లు, కంటెతో చేతులెత్తి మొక్కేలా ఆ తల్లి ఆకృతిని తీర్చిదిద్దామన్నారు. ఇవాళ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కిరీటాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అదే విధంగా ఎరుపు రంగు చీరను ఆకు పచ్చ కలర్‌కు ఎందుకు మార్చారని అన్నారు. ఆఖరుకు చేతి భంగిమను కూడా హస్తం గుర్తుకు దగ్గరగా మార్చుకున్నారని విమర్శించారు.
అయితే ఎమ్మెల్సీ కోదండరాం, సీపీఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు తెలంగాణ తల్లిని మాతృమూర్తిని ప్రతిబింబిచేలా ఉందని చెప్పారు. అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేసింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించినా.. రూపాన్ని సోషల్ మీడియాలో వక్రీకరించిన చట్టపరంగా చర్యలుంటాయని ప్రభుత్వం పేర్కొంది.
అమరవీరుల చిహ్నం వద్ద తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని గతేడాదే అప్పటి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ట్విట్టర్లో పోస్టు పెట్టారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మూడు విగ్రహాలు మారాయని, ఇది నాలుగో విగ్రహమని తెలంగాణ వాదులు అంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.