ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. ఇప్పటికీ కొన్ని విషయాల్లో మనం చాలా వెనుకబడే ఉంటున్నాం. అందరూ సమానమే అనే మాట మరిచి కొందరిపై వివక్ష చూపుతూ నాగరికతను మరిచిపోతున్నాం. అందులో ముఖ్యమైనది దళితులను అంటరానివారుగా చూడడం. రాజకీయంగా, సామాజికంగా వారు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. వారికి దక్కాల్సిన అవకాశాలను కూడా దక్కకుండా చేసి కొందరే అనుభవిస్తున్నారు.
ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి..
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎన్నో సభల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని ఎన్నోసార్లు ప్రకటించారు. లేకపోతే ముక్కు కోసుకుంటాను, చెవులు కోసుకుంటాను అని ప్రతిజ్ఞలు చేశారు.తెలంగాణ ఏర్పడిన తరువాత రెండుసార్లు ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాకుండా ఓ దళిత మంత్రిని ఆయన కేబినెట్ నుంచి తొలగించారు. అదే పెద్ద కులాలకు చెందిన మంత్రులు ఎన్ని అవకతవకలకు పాల్పడినా,వారిపై అవినీతి ఆరోపణలు వస్తున్నా కేసీఆర్ చూసీచూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు. మరోసారి ఎన్నికలకు వచ్చినా జనం తమనే గెలిపిస్తారని సీఎం చెబుతున్నారు తప్ప.. రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన దళితులకుఅవకాశాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఇప్పటికి కూడా కొన్ని మారుమూల గ్రామాల్లో దళితులు ఊరి బయట నివాసాలు ఏర్పాటు చేసుకొని బతుకుతున్నారు.
దళితబంధు మంచిదే కానీ..
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం మంచిదే. కానీ కొంతమందికే పది లక్షలు ఇచ్చే బదులు.. మూడు నాలుగు లక్షలు ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలి. అంటరానితనాన్ని కూకటివేళ్లతో తొలగించాలి.అంటరానితనాన్ని కొనసాగించాలని చూసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలి. మారుమూల గ్రామాల్లో ఊరి బయట కాకుండా ఊరి మధ్యలో దళితులు నివసించేందుకు వీలుగా నివాసాలు ఏర్పాటు చేయాలి. ఈ మధ్య అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు సాధారణమయ్యాయి. బాధితుల్లో చాలామంది దళితులే ఉంటున్నారు. కారణం వారిపట్ల ఉన్న చిన్నచూపు, చులకనభావం. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి అత్యంత కఠినంగా శిక్షలు పడాలి.
వృత్తుల ఆధారంగానే కులాలు
మన దేశంలో వ్యక్తులు చేసే వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. అయితే హిందువులలోని కులాలన్నింటినీ చాణక్యుడు తన ‘ఆదిహిందూ చతుర్వర్ణ వ్యవస్థ’లో నాలుగు భాగాలుగా విభజించి, మానవ శరీరంలోని నాలుగు భాగాలతో పోల్చాడు. మొదటిది తల.. తలలో కళ్లు, ముక్కు, చెవులు, మెదడు మొదలైన అతి ముఖ్యమైన భాగాలున్నాయి. బ్రాహ్మణులు, రెడ్లు, వెలమలు మొదలగు అగ్రవర్ణ కులాల వాళ్లను తలతో పోల్చాడు. రెండోది కడుపు. ఎప్పటికప్పుడు కడుపును నింపితేనే కదా! శరీరానికి సత్తువ, శక్తి వచ్చేది. ఈ కడుపుతో వైశ్యులను, వర్తకులను, వ్యాపారులను పోల్చాడు. మూడోది చేతులు. శరీరంలోని వేరే ఏ భాగాలు చేయనన్నిపనులను చేతులు చేస్తాయి. అందుకే చేతి వృత్తుల వాళ్లు, బలహీనవర్గాల వాళ్ల కులాలు ఎక్కువే. నాలుగోది కాళ్లు. మనిషి పడుకున్నప్పుడు తప్ప, శరీరాన్ని మోసేవి కాళ్లే కదా! మట్టిలోనైనా, చెత్తలోనైనా, రాళ్లు రప్పలలోనైనా
మనిషిని మోస్తూ కాపాడేవి, వెట్టి చాకిరి చేసేవి కాళ్లు. ఈ కాళ్లతో దళితులను పోల్చాడు. ఇదే ఆది హిందూ చతుర్వర్ణ వ్యవస్థలోని సారాంశం.
వైషమ్యాలతోనే కుమ్ములాటలు
అన్ని మతాలలోకెల్లా హిందూమతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు ఇలా అన్ని విషయాల్లో ఇతర మతాల కంటే ప్రయోజకంగా, ప్రశంసనీయంగా ఉండేవి. వీటన్నింటినీ మరుగునపరిచే కులాలకుమ్ములాటలు ఉన్నాయి. ఏ మతంలో లేనన్ని వందలాది కులాలు ఉన్నాయి. ఇందులో అత్యంత నీచమైనది దళితుల పట్ల అంటరానితనం. స్వాతంత్ర్యం వచ్చి 74 ఏండ్లు గడిచినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో అంటరానితనం,దళితుల పట్ల చిన్నచూపు ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. 11వ శతాబ్దంలో తురుష్కులు మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి హిందూ రాజుల్లో అనైక్యత, రెండోది హిందువుల్లోని కుల వైషమ్యాలు.
అంబేద్కర్, సంజీవయ్య జీవితాలే ఉదాహరణ
మనదేశంలో దళిత నాయకులు ఎలా అణచివేతకు గురయ్యారో తెలియాలంటే ఇద్దరు నాయకుల గురించి తెలుసుకోవాలి. మనకు స్వాతంత్ర్యం వచ్చే నాటికి మనకంటూ సొంత రాజ్యాంగం లేదు. డా.బీఆర్ అంబేద్కర్‌నాయకత్వంలో ప్రపంచ దేశాల్లోకెల్లా గొప్ప రాజ్యాంగం రూపొందింది. దళితుడైన కారణంగానే అంబేద్కర్‌కు అంతగా పేరు ప్రఖ్యాతులు దక్కలేదు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 30 ఏండ్ల వరకు అంబేద్కర్ అంటే ఎవరోచాలామందికి తెలియదు. 1990 తర్వాత మాత్రమే ఆయన గొప్ప రాజ్యాంగ నిర్మాతగా కీర్తించబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నీలం సంజీవరెడ్డి సీఎంగా ఏర్పాటైన తొలి ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా దళితుడైనదామోదరం సంజీవయ్య బాధ్యతలు తీసుకున్నారు. రెండేండ్ల తర్వాత సీఎం సంజీవరెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలు ప్రధాని నెహ్రూ వరకు వెళ్లాయి. ఆ సమయంలో సంజీవరెడ్డి స్థానంలో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే దానిపై పెద్ద చర్చ జరిగింది. సంజీవయ్యను సీఎం చేయాలని చాలామంది సూచించారు. ఈ క్రమంలోనే ఆయన ఏమైనా ఆస్తిపాస్తులు సంపాదించారా? అవినీతి ఆరోపణలు ఉన్నాయా? అనే
విషయాలపై విచారణ చేయడానికి ఢిల్లీ నుంచి ఓ వ్యక్తి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ నుంచి ఓ కార్యకర్తను వెంటపెట్టుకుని కర్నూలు సమీపంలోని సంజీవయ్య సొంత గ్రామం పెదపాడు వెళ్లారు. గ్రామ పొలిమేరలో ఓ పాడుబడిన గుడిసెలో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న ఓ ముసలావిడను సంజీవయ్య ఇల్లు ఎక్కడని అడిగారు. ఇల్లు కూలిపోయింది. సంజీవయ్య తల్లిని నేనే అని ఆ ముసలావిడ సమాధానం చెప్పిందట. సంజీవయ్య ఎంతటి నిజాయితీపరుడనే విషయం తెలుసుకుని ఆయనను ముఖ్యమంత్రిగా నియమించారు. దళితులు కావడం వలనే గొప్పవ్యక్తులైన సంజీవయ్య, అంబేద్కర్‌కు ప్రజల్లో రావలసినంత గుర్తింపు రాలేదు.
అందరూ సమానమే అనే భావన కలగాలి
మన దేశానికి భవిష్యత్తులో ఏదైనా ముప్పు ఉందంటే అది కులాల కుమ్ములాటల కారణంగానే ఫలానా కులం గొప్పది. పెద్దది, అని కాకుండా అన్ని కులాలు సమానమే అనే భావన ప్రజల్లో ఏర్పడాలి. మన దేశం ప్రపంచంలోనే మరింతగా తలెత్తుకునే స్థాయికి చేరాలంటే కులాలు సమసిపోవాలి. అంటరానితనం, వివక్ష చూపే వారిపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలి. అప్పుడే దానిని తొందరగా రూపుమాపగలుగుతాం. ‘హిందువులంతా బంధువులే’ అనే ప్రాతిపదికన ముందుకు సాగాలి. అప్పుడే మనకు క్షేమం. ప్రపంచంలో మనకు గౌరవం.
ఎన్నో రకాలుగా వివక్ష
మన రాష్ట్రంలో ఉన్న దళితులు ఎన్నో రకాలుగా వివక్ష ఎదుర్కొంటున్నారని, సామాజికంగా, ఆర్థికంగా వారికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే దానిని అరికట్టాలంటే కొన్ని కఠినచర్యలు, నిర్ణయాలు తీసుకోక తప్పదు. దేవాలయాల్లో పూజారులుగా దళితులను నియమించాలి. అప్పుడే వారికి ఒక గౌరవం వస్తుంది. ఇప్పటికే కేరళ, తమిళనాడులోని కొన్ని దేవాలయాల్లో పూజారులుగా దళితులు పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి, యాదాద్రి, శ్రీశైలంతోపాటు అన్ని ప్రధాన ఆలయాల్లో దళితులను పూజారులుగా నియమిస్తే వారి పట్ల అగ్రవర్ణాలు చూపుతున్న వివక్ష తగ్గి, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 16వ శతాబ్దంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దళితులతో సహపంక్తి భోజనం చేసేవారు. వారిని ఆలయంలోకి ప్రవేశింపజేశారు. ఈ విషయంలో పెద్ద కులాల వారిని ఆయన ఎదిరించారు. మాదిగ కక్కయ్యను ప్రియ శిష్యుడిగా స్వీకరించారు. అందుకే అగ్రకుల పూజారులు బ్రహ్మంగారిని అడుగడుగునా విమర్శించారు. అడ్డుకున్నారు. వడ్డెరలు, కమ్మరుల దేవుడిగానే బ్రహ్మంగారిని చిత్రీకరించారు.
- మునిగంటి శతృఘ్నచారి,
కార్యదర్శి, రాష్ట్ర బీసీ సంఘం