- పొలిటీషియన్లతో కలిసి ‘రియల్’ వ్యాపారుల దందా
మహబూబ్‌నగర్, వెలుగు: పాలమూరు జిల్లాలో పొలిటీషియన్లు, రియల్టర్లు సర్కారు భూములను టార్గెట్ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లోని కొందరు ఆఫీసర్లను మేనేజ్ చేసి హైవే పక్కనే ఉన్న కోట్లు విలువ చేసే అసైన్డ్, లావుని పట్టా, చెరువు శిఖం భూములను కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో వందల ఎకరాల ప్రభుత్వ భూములను మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే కబ్జాకు గురవుతున్న భూములకు రక్షణ కల్పించాలని కంప్లైంట్లు వస్తున్నా.. ఆఫీసర్లు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
భూములను గుర్తించి కబ్జాలు..
జిల్లాలోని అడ్డాకుల, భూత్పూర్, జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్ ప్రాంతాలు ఎన్ హెచ్-–44ను ఆనుకొని ఉన్నాయి. ఇందులో అడ్డాకుల, భూత్పూర్ ప్రాంతాల్లో రోడ్ సైడ్ భూముల ధరలు రూ.కోటి నుంచి కోటిన్నర వరకు పలుకుతున్నాయి. జడ్చర్ల, రాజాపూర్ ప్రాంతాల్లో హైవే పొంటి ఉన్న భూములకు రూ.కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ధరలు ఉన్నాయి. బాలానగర్ మండలం హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో ఇక్కడ ఎకరం భూమి రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పలుకుతోంది. అయితే, భూములకు రేట్లు బాగా ఉండడంతో కొందరు పొలిటికల్ లీడర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మిలాఖత్ అయ్యారు.
వారి పలుకుబడిని ఉపయోగించుకొని ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో కొందరు రెవెన్యూ ఆఫీసర్ల ద్వారా సమాచారం తెప్పించుకొని కబ్జా చేస్తున్నారు. ఉదాహరణకు బాలానగర్ మండలం ఉడిత్యాలలో సర్వే నంబర్ 436లో ఓ వర్గానికి చెందిన వారికి ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇందులో వారి స్మశానం ఉండగా, దీనిని ఆనుకొని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్ ఏర్పాటు చేసింది. బొందలగడ్డను చూసి ప్లాట్లు కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఇటీవల నిర్వాహకులు స్థానిక లీడర్ల సాయంతో అక్కడున్న గోరీలను కూల్చి చదును చేయడంతో వివాదాస్పదమైంది. ఇదే మండలం పెద్దాయపల్లిలోని సర్వే నంబర్ 102/1లో బాలానగర్ వ్యవసాయ మార్కెట్‌కు ఐదెకరాల స్థలాన్ని 2021లో కేటాయించారు.
అయితే భూమి పడావుగా ఉండడంతో స్థానికంగా ఉన్న కొందరు కబ్జా చేసి ఇటీవల కనీలు పాతారు. అలాగే రాజాపూర్ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ చెరువు పక్కనే ఓ రియల్ఎస్టేట్ సంస్థ వెంచర్ వేసింది. చెరువుకు సంబంధించి రెండు ఎకరాల శిఖం భూమి ఉండగా, ఆ భూమిని కూడా వెంచర్లో కలిపేసుకొని ప్లాట్లుగా మార్చి అమ్మేసింది. ఈ విషయంపై స్థానికులు కంప్లైంట్ చేయగా, పంచాయతీ సిబ్బంది అక్కడ బోర్డును ఏర్పాటు చేశారు. కానీ, రెండు రోజులకే ఆ బోర్డును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అలాగే భూత్పూర్ మండలంలో 59 ఎకరాల్లో ఉన్న భూదాన్ భూములను కూడా మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ భూముల్లో కూడా రియల్ వెంచర్లు వేసి అమ్ముకున్నట్లు
తెలిసింది.
కబ్జాలపై ఎమ్మెల్యే సీరియస్..
ఉమ్మడి బాలానగర్ మండలంలో జరుగుతున్న భూ కబ్జాలు, ఆక్రమణలపై జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల కింద బాలానగర్ చెరువు కట్టపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మండల రెవెన్యూ ఆఫీసర్ల సహకారంతోనే ఇక్కడి సర్కారు భూములు అన్యాక్రాంతమవుతున్నాయని విమర్శించారు. గత ఆదివారం రెవెన్యూ ఆఫీస్‌లో ఆర్ఐ వెంకట్ రెడ్డి ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయిస్తుండగా, ఎమ్మెల్యే ఆఫీస్‌ను విజిట్ చేసి ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. సోమవారం విచారణ చేసిన ఆర్డీవో, ఇతర అధికారులు ఆర్ఐ వెంకట్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. అయితే బాలానగర్ రెవెన్యూ ఆఫీస్ కేంద్రంగానే భూముల అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
సీఎంకు ఫిర్యాదులు..
జిల్లాలో సర్కారు భూముల ఆక్రమణలు, కబ్జాలపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు అందుతున్నాయి. స్థానికంగా ఉన్న ఆఫీసర్లకు పలుమార్లు భూ కబ్జాలపై కంప్లైంట్లు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీనికితోడు గతంలో ఇక్కడ పని చేసిన కొందరు ఆఫీసర్ల అండతోనే కబ్జాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రజా దర్బార్’ కు పాలమూరు జిల్లాకు సంబంధించి 194 కంప్లైట్లు రాగా, అందులో వందకు పైగా భూ కబ్జాలకు సంబంధించిన అప్లికేషన్లు ఉన్నట్లు తెలిసింది.
బౌండరీలు పెట్టాం..
ఉడిత్యాల గ్రామంలోని 436 సర్వే నంబర్లో బొందలగడ్డ ఉంది. ఇక్కడ భూమిని చదును చేశారని తెలియడంతో పంచాయతీ సెక్రటరీకి సమాచారం అందించాం. వెంటనే అక్కడ బౌండరీలు ఏర్పాటు చేయాలని ఆదేశించాం. పెద్దాయపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 102లో మార్కెట్ యార్డు స్థలం ఉంది. సర్వే చేయాలని ఏడీని కోరాం.
- శ్రీనివాస్, తహసీల్దార్, బాలానగర్