- ఖర్చులు భరిస్తూ యూత్ ను ఆకట్టుకునేందుకు లీడర్ల స్కెచ్
- సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ లో ఇప్పటికే మొదలు
- ఇయ్యాల్టి నుంచి ఖమ్మంలో షురూ
- డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు చెల్లించనున్న పువ్వాడ ఫౌండేషన్
ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో పొలిటికల్ లీడర్లు ఎప్పటికప్పుడు ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త స్కెచ్‌లు వేస్తున్నారు. ఎన్నికల సీజన్లో ప్రతీసారి యూత్‌ను అట్రాక్ట్ చేసేందుకు క్రికెట్ కిట్లు పంచేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ట్రెండ్ నడుస్తున్నది. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతీ యువకుల కోసం ఫ్రీ లైసెన్స్అని కొందరు నేతలు కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఇప్పటికే మూడు, నాలుగు నియోజకవర్గాల్లో సక్సెస్ ఫుల్ గా జరుగుతున్న ఈ ఫ్రీ లైసెన్స్ స్కీమ్ ఇప్పుడు మరిన్ని జిల్లాలకు విస్తరిస్తున్నది. ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో ఇయ్యాళ్టి నుంచి 45 రోజుల పాటు ఉచితంగా యువతీ యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించనున్నారు. ఖమ్మం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ క్యాంపు ఆఫీస్‌లో దీనికి సంబంధించిన దరఖాస్తులు తీసుకోనున్నారు. అక్కడ దీని కోసమే ప్రత్యేక మీ సేవా కౌంటర్ఏర్పాటు చేస్తున్నారు.
ఈ కౌంటర్ద్వారా దరఖాస్తు చేసేందుకు వచ్చిన యువతీ యువకులకు ఫ్రీగా స్లాట్ బుక్ చేస్తారు. తర్వాతి రోజు ఆర్టీఏ ఆఫీస్ కు వెళ్లి ఫొటో దిగి, డిజిటల్ సైన్ చేసి వస్తే సాయంత్రానికి మంత్రి క్యాంపు ఆఫీస్ లో లెర్నింగ్ లైసెన్స్అందజేస్తారు. తర్వాత డ్రైవింగ్ నేర్చుకొని టెస్ట్ డ్రైవ్ చేస్తే పూర్తి స్థాయి లైసెన్స్ తీసుకోవచ్చు. దీనికోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం లైసెన్స్ ఫీజు మంత్రి అజయ్‌కు చెందిన పువ్వాడ ఫౌండేషన్ ద్వారా చెల్లించనున్నారు. టూవీలర్, త్రీ వీలర్, కారు లైసెన్స్ కలిపి తీసుకోవాలనుకునే వారికి మొత్తంగా రూ.2,550 లబ్ధి జరగనుంది.
ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో..
రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఈ స్కీం అమలు చేస్తున్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు, గజ్వేల్ లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, అక్కడ బీఆర్ఎస్తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ఫ్రీ లైసెన్స్స్కీంఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక్కో చోట కనీసం నాలుగైదు వేల మంది దరఖాస్తు చేసుకుంటుండడంతో దీన్నే మిగిలిన నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ నేతలు ఫాలో అవుతున్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంకొక అడుగు ముందుకు వేసి, పర్మినెంట్ లైసెన్స్తీసుకునే టైంలో ఉచితంగా హెల్మెట్ కూడా అందిస్తామని ఆఫర్ ప్రకటించారు. ఆధార్, టెన్త్ మెమో, రెండు ఫొటోలు ఇస్తే చాలు ఫ్రీగా డ్రైవింగ్ లైసెన్స్ వస్తుండడంతో యూత్ కూడా ఈ స్కీమ్ కు అట్రాక్ట్ అవుతున్నారు.
యూత్ ఉపయోగించుకోవాలి..
ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా స్టూడెంట్లు, చిరు వ్యాపారులు, నిరుద్యోగులు డ్రైవింగ్ లైసెన్స్ తప్పక తీసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికుల కుటుంబాలు రోడ్డున పడ్తాయి. కనీసం ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి కూడా లేని పేదలు అనేక మంది చనిపోతున్నారు. అలాంటి వారికి ఈ ఫ్రీ మేళా ఉపయోగపడుతుంది. చదువు సర్టిఫికెట్స్ లేకపోయినా ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ ద్వారా లైసెన్స్ తీసుకోవచ్చు. - టి.కిషన్ రావు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్