అంత పుణ్యం, మోక్షం వచ్చేది ఉంటే.. మీరే వెళ్లి కుంభమేళాలో చచ్చిపోండి: ఎంపీ సంచలన కామెంట్స్

అంత పుణ్యం, మోక్షం వచ్చేది ఉంటే.. మీరే వెళ్లి కుంభమేళాలో చచ్చిపోండి:  ఎంపీ సంచలన కామెంట్స్

ఢిల్లీ: కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటల్లో వందల మంది చనిపోయారని.. చాలా మందికి కనీసం దహన సంస్కారాలు కూడా నిర్వహించకుండా శవాలను నదుల్లో పడేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీహార్ ఇండిపెండెంట్ ఎంపీ పప్పూ యాదవ్. కుంభమేళా తొక్కిసలాటలో చనిపోయిన వాళ్లకు మోక్షం వస్తుందని కొంత మంది బాబాలు చెబుతున్నారని.. మరికొందరు కుంభమేళాలో మరణం పుణ్యం అంటున్నారని.. ఇదెక్కడి చోద్యం అంటూ మండిపడ్డారు ఎంపీ పప్పూ యాదవ్.

కుంభమేళాలో చనిపోతే అంత మోక్షం.. పుణ్యం వస్తుందంటే.. దేశంలోని బాబాలు, ధనవంతులు అందరూ కుంభమేళాకు వెళ్లి చనిపోవచ్చు కదా.. ఆక్కడ ఆస్పత్రుల్లో.. ఇళ్లల్లో ఎందుకు చావటం అంటూ ప్రశ్నించారు పప్పూ యాదవ్. యూపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, భద్రతా వైఫల్యం.. వీఐపీ సేవలో తరించి.. సామాన్య భక్తులను గాలికి వదిలేసిందంటూ దుమ్మెత్తిపోశారు పప్పూ యాదవ్.

Also Read :- కుంభమేళాలో మోదీ పవిత్రస్నానం

బీహార్కు చెందిన లోక్ సభ ఎంపీ పప్పూ యాదవ్ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా పప్పూ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జనవరి 29న కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 300 నుంచి 600 మృతదేహాలను అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా తొలగించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. చనిపోయిన వారి దహన సంస్కారాలు హిందూ ధర్మం ప్రకారం జరగలేదని ఆరోపించారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గణాంకాల ప్రకారం.. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు. అయితే.. మృతుల సంఖ్యపై అఖిలేష్ యాదవ్ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. మృతుల సంఖ్యపై వాస్తవాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక.. ఎంపీ పప్పూ యాదవ్ మరో సంచలన ఆరోపణ కూడా చేశారు. జవహర్ లాల్ నెహ్రు ప్రధానిగా ఉన్న సమయంలో కూడా కుంభమేళా సమయంలో జరిగిన తొక్కిసలాటలో చాలామంది భక్తులు చనిపోయారని, కాకపోతే ఆ సమయంలో సోషల్ మీడియా లేకపోవడం వల్ల వాస్తవాలు బయటకు రాలేదని ఆయన చెప్పారు.