రైతుల చుట్టే రాజకీయం ..అన్ని పార్టీల చూపు రైతాంగం వైపే

రైతుల చుట్టే రాజకీయం ..అన్ని పార్టీల చూపు రైతాంగం వైపే
  • అతిపెద్ద ఓటు బ్యాంకుగా రైతు కుటుంబాలు
  • పథకాలతో  ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలు

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు రైతులపైనే ఫోకస్‌ చేశాయి. వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నవారే.. రాష్ట్రంలో పాలకులను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల చూపు రైతుల వైపే మళ్లింది. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించుకోవడానికి  రైతులను ప్రసన్నం చేసుకునే  కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి.

అతిపెద్ద ఓటు బ్యాంకు రైతులదే..

రాష్ట్రంలో పట్టాదారు పాస్​ పుస్తకాలున్న  రైతాంగం 73.40 లక్షల మంది ఉండగా.. అందులో రైతుబంధుకు ఎన్‌రోల్‌ అయిన రైతులు 72.03 లక్షల మంది ఉన్నారు. వీరే కాకుండా మరో 4 లక్షలకు పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన కౌలు రైతులు ఉన్నారు. అంటే 77.40 లక్షలకు పైగా రైతు కుటుంబాలు ఉన్నట్లు అంచనాలున్నాయి. కుటుంబంలో కనీసం ఇద్దరు ఓటు హక్కు కలిగి ఉన్నారు.  ఈ లెక్కన తక్కువలో తక్కువగా దాదాపు కోటిన్నర  నుంచి 2 కోట్లకు పైగా ఓటర్లు  రైతు కుటుంబాల్లోనే  ఉన్నారు. 

అన్ని పార్టీల దృష్టి 

అత్యధిక ఓటుబ్యాంకు ఉన్న రైతాంగం పైనే అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. ఏ మీటింగ్‌లోనైనా రైతులను ఫోకస్‌ చేస్తూనే నేతలు మాట్లాడుతున్నరు. రైతు పథకాలపైనే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. 

బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ కాంగ్రెస్‌ వస్తే రైతులకు 3 గంటల కరెంటే అంటూ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్‌ ప్రధానంగా ధరణి పోర్టల్‌, రుణమాఫీ, పంట బీమాపై ఫోకస్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ రద్దు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇలా అన్ని పార్టీలు రైతుల చుట్టే రాజకీయం చేస్తున్నాయి.

బీఆర్‌ఎస్‌ ఫోకస్‌ అంతా వారిపైనే..

అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ కూడా సంక్షేమంతో పాటు రైతులపైనే ఫోకస్​పెట్టింది. రైతు పథకాలైన రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటుతో గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఈ దఫా రైతుల కోసం మరిన్ని కొత్త పథకాలు తెచ్చేందుకు సమాయత్తమవుతోంది. కొత్తగా పంట బీమా పథకం, రైతులకు పెన్షన్‌ ఇచ్చేందుకు, ఏడాదికి ఇప్పుడిస్తున్న రూ.10 వేల రైతుబంధును పెంచే ప్లాన్​ చేస్తున్నారు.  

రైతులకు భరోసా దిశగా కాంగ్రెస్‌.. 

ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూడా రైతాంగంపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. రైతులకు ఇందిరమ్మ భరోసా పేరుతో ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే వరంగల్‌ లో జరిగిన సభలో రైతు డిక్లరేషన్‌  ప్రకటించింది. తాజాగా ప్రకటించిన గ్యారంటీ స్కీమ్‌లలోనూ రైతులకు ప్రాధాన్యం ఇచ్చింది. రైతు భరోసా పేరుతో ఏడాదికి ఎకరానికి రూ.15వేలు ఇస్తామని, రైతులతో పాటు కౌలు రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. రైతు కూలీలకు ఏటా రూ.12వేలు ఆర్థికసాయం అందిస్తామని చెప్పింది.  అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధర, వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తామని 100 రోజుల్లో చేసే గ్యారంటీ పథకంగా ప్రకటించింది. రైతు డిక్లరేషన్‌లో భాగంగా  రూ.2 లక్షల రుణ మాఫీ, 24 గంటల ఫ్రీ కరెంటు సహా ఇతర హామీలతో రైతుల విశ్వాసం పొందే ప్రయత్నం చేస్తున్నది.

ALSO READ :    బీఆర్ఎస్ సిట్టింగులకు బీఫామ్‌‌ టెన్షన్!

బీజేపీ చూపూ కిసాన్‌ వైపే..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్ర ఎన్నికలతో పాటు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే కిసాన్‌ సమ్మాన్‌ను విస్తరించే చర్యలకు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం ఏడాదికి రూ.6 వేలు ఇస్తున్న ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధిని మరో రూ.2 వేలు పెంచి రూ.8 వేలు ఇవ్వాలని యోచిస్తోంది. ఇప్పటికే పసుపు బోర్టును ప్రకటించి నిజామాబాద్‌ రైతుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చింది.

రైతులే టార్గెట్‌ గా మేనిఫెస్టోలు

తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో పార్టీలన్నీ రైతులే టార్గెట్‌ గా మేనిఫెస్టోల రూపకల్పన చేస్తున్నాయి.  మరో వారం పది రోజుల్లో మేనిఫెస్టోలు విడుదల చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ మేనిఫెస్టోల్లో రుణమాఫీ సహా రైతు సంక్షేమ పథకాలకే పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రైతు పథకాలు ఏపార్టీని అధికారంలోకి తీసుకువస్తాయో వేచి చూడాల్సిందే.