భాషా వివాదాల చుట్టూ రాజకీయాలు

భాషా వివాదాల చుట్టూ రాజకీయాలు

2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నవేళ  కేంద్రంలోని  బీజేపీకి,  డీఎంకే  పార్టీకి మధ్య ఏర్పడిన హిందీ భాషా వివాదం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.  ఉపాధి అవకాశాల పెంపుకోసం మేం కృషి చేస్తున్నామని  కేంద్రం చెబుతుండగా,  హిందీని బలవంతంగా  రుద్దే  ప్రయత్నం చేస్తున్నారని  తమిళనాడు  ప్రభుత్వం అంటోంది.  

దశాబ్దాలుగా  తమిళనాడుకు,  కేంద్రానికి నడుమ జరుగుతున్న  ఈ భాషా పోరాటం కేంద్ర  విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  ప్రకటనతో మరోమారు  తీవ్రమైంది.  ఫిబ్రవరి 15 , 2025న  వారణాసిలో జరిగిన కాశీ- తమిళ సంఘం సమావేశం జరిగింది.  ద్రవిడియన్  సిద్ధాంతానికి వారణాసితో అనాదిగా సంబంధాలు ఉన్నాయని 2022 నుంచి నిర్వహిస్తూ ఉన్న ఈ సంఘానికి  తమిళనాడు  ముఖ్యమంత్రి స్టాలిన్  హాజరుకాలేదు.

 ఈ సమావేశంలో  కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం 2020ని  తమిళనాడు  ప్రభుత్వం  అమలుచేయడం లేదని అందువల్ల సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద తమిళనాడుకు ఇవ్వాల్సిన రూ.2,158 కోట్లు నిధుల విడుదలను నిలిపివేస్తున్నామని ప్రకటించారు.

ధర్మేంద్ర  ప్రధాన్  ప్రకటనతో  తమిళనాడులో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి.  జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తే  మాతృభాషలు  అంతరిస్తాయని,  అందువల్ల  తల్లి భాషను  రక్షించుకోవడానికి ఎంతటి యుద్ధానికైనా సిద్ధమని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్  ప్రకటనతో రాష్ట్రమంతటా ప్రజలు వీధుల్లోకి వచ్చి ముగ్గులు,  పోస్టర్లు,  ర్యాలీలు,  హిందీ బోర్డులపై  నల్ల రంగు పూయటం వంటి నిరసనలు తెలుపుతున్నారు.  

కేంద్రం  నిధులు  నిలిపివేయడం వల్ల 40 లక్షల మంది  విద్యార్థులు, 30 వేల మంది టీచర్ల  భవితవ్యంపై  ప్రభావం చూపుతోందని  అందువల్ల  కేంద్రం భాషలతో  ఆటలాడవద్దని  ఏఐఏడీఎంకె,  మక్కల్ నీది మయం (కమలహాసన్) పార్టీలు హెచ్చరించాయి.  

హిందీ, ఇంగ్లీష్​తోపాటు ప్రాంతీయ భాష

భారతీయ భాషల మధ్య ప్రభుత్వాలు సృష్టిస్తున్న ఈ  గొడవల వల్ల 1937 నుంచి ఎంతో మంది అమరులయ్యారు. 1937లో హిందీని తప్పనిసరి చేయాలన్న రాజాజీ విధానాన్ని ఇవి రామస్వామి నాయకర్ తదితరులు తీవ్రంగా వ్యతిరేకించడంతో 1940లో వెనక్కి తీసుకున్నారు. 1948-49 నాటి విశ్వవిద్యాలయాల కమిషన్  భాషల విషయంలో విద్యావేత్తలలోనే  వివాదం ఉందని అంగీకరిస్తూ సమాఖ్య భాషగా హిందీ ఉండాలని, విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలని సూచించారు.

1964-66 నాటి  కొఠారి  జాతీయ విద్యా కమిషన్ ఈ త్రిభాషా సూత్రాన్ని సిఫారసు చేసింది. 1968లో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానంలో హిందీ మాట్లాడే  రాష్ట్రాలలో హిందీ,  ఇంగ్లీష్ తో పాటు ఒక ప్రాంతీయ భాష ఉండాలని, హిందీ మాట్లాడని రాష్ట్రాలలో ఒక ప్రాంతీయ భాష,  ఇంగ్లీషు,  హిందీ నేర్చుకోవాలని ఈ త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టారు. 

1986 జాతీయ విద్యా విధానం ఇదే విధానాన్ని కొనసాగించింది. 2020 జాతీయ విద్యా విధానంలో బీజేపీ  ప్రభుత్వం కొంత సౌలభ్యం కల్పించింది.  హిందీ తప్పనిసరి అని చెప్పలేదు. మూడు భాషలలో రెండు భారతీయ భాషలు ఉండాలని మాత్రమే చెప్పారు.

హిందీపై వ్యతిరేకత

1968 నుంచి తమిళం, ఇంగ్లీష్​లో మాత్రమే విద్యా విధానం కొనసాగిస్తున్న తమిళనాడు  ప్రభుత్వం  తాజా  విద్యా విధానంలోని  త్రిభాషా సూత్రాన్ని  వ్యతిరేకిస్తోంది.  ఉన్న రెండు భాషలే  చదవలేక,  రాయలేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు  మూడో భాష మరింత భారం అవుతుందని చెబుతోంది.  

2019లో  జాతీయ విద్యా విధానం  డ్రాఫ్ట్  తయారీ దశలోనే  హిందీపై తీవ్ర వ్యతిరేకత రావడంతో హిందీ తప్పనిసరి అనే దానిని తొలగించి ఐచ్ఛికం చేశారు. త్రిభాషా విధానం అమల్లో  విఫలమైందని,  విద్యా నాణ్యత  కొరవడిందని,  అసర్ నివేదిక  2022 ప్రకారం  ఐదవ తరగతి  విద్యార్థులలో  60 శాతం మంది  రెండో తరగతి స్థాయి పాఠాన్ని కూడా చదవలేకపోతున్నారని,  2023 నివేదిక ప్రకారం 14 నుంచి 18 సంవత్సరాల వయసువారిలో 40 శాతం మంది ఆంగ్లంలో వాక్యాలు కూడా సరిగా చదవలేకపోతున్నారని,  అటువంటప్పుడు ఇంకా మూడో భాష ఎందుకు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా  హిందీని వ్యతిరేకిస్తూ  తమిళనాడులో  స్థిరంగా నిరసనలు కొనసాగుతున్నాయి.  ఈ వ్యతిరేకతలు మలుపు తీసుకొని సంస్కృతి, రాజకీయాల వైపు వెళుతున్నాయి.  

కేంద్రం, రాష్ట్రాలు నిర్మాణాత్మక చర్చలు జరపాలి

 డీఎంకే  భాషా  సమస్యను రాజకీయ సాధనంగా వాడుకుని వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని  కొందరు వాదిస్తున్నారు.   కేంద్ర, రాష్ట్రాలు నిర్మాణాత్మక చర్చలు జరిపి ఒక ఆచరణాత్మక రాజీకి రావాలి. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యపై కేంద్రం పెత్తనం తగ్గించుకొని విధాన నిర్ణయాల్లో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలి.  

విద్యకు నిధులు ఇవ్వడంలో  మూడో భాషను  ఆయుధంగా చేసుకోవడం  సమాఖ్య స్ఫూర్తికి  విరుద్ధమని  కేంద్రం గ్రహించాలి.  బోధనా మాధ్యమం ఎంపిక చేసుకోవడంలో  రాష్ట్రాల హక్కులను కేంద్రం గౌరవించాలి.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా  కృత్రిమ మేధా కాలంలో వందలాది భాషలను ఇతర భాషల్లోకి అనువాదం చేసేటటువంటి ఆర్టిఫిషియల్ టూల్స్,  ట్రాన్స్​లేటర్లు  అందుబాటులోకి వస్తున్న  ఈ రోజులలో భాషాపరంగా అవకాశాల సృష్టి జరుగుతోందన్న  విషయాన్ని  అందరూ గ్రహించాలి.  

రాష్ట్రాలు కూడా ఇంగ్లీష్​ను అధికంగా ప్రోత్సహిస్తూ  భారతీయ భాషల పట్ల  వ్యతిరేకతను ప్రదర్శించడం సరైన విధానం కాదు.  సీబీఎస్సీ, ఐసీఎస్సీ కేంద్ర సంస్థలలో మాతృభాష లేదా ఒక ప్రాంతీయ భాష తప్పనిసరి చేస్తూనే,  ప్రభుత్వ , లోకల్ బాడీ , గురుకులంలో ఇంగ్లీష్ ప్రాధాన్యతను తగ్గించే చర్యలను ప్రభుత్వాలు వేగవంతం చేయాలి. విద్యారంగంలో ఆంగ్ల భాష అధిపత్యాన్ని తగ్గించకపోతే సమీప భవిష్యత్తులో  ‘ఒకే దేశం - ఒకే బోధన  భాష’గా  ఇంగ్లీష్​ అవతరించి  అన్ని  ప్రాంతీయ భాషలను  ప్రజల వాడుక భాషగా మాత్రమే మిగిల్చే రోజులు రానున్నాయి.

- తండ ప్రభాకర్ గౌడ్, సోషల్​ ఎనలిస్ట్-