- ఫోకస్ మొత్తం ఈటల ఇష్యూ పైనే
- ఆగిన వ్యాక్సినేషన్.. తగ్గిన టెస్టులు
- ఆరోగ్యశాఖ హెల్ప్‌లైన్, కేటీఆర్, సీఎంవోకు వేలల్లో ఫిర్యాదులు
- స్పందించని కేసీఆర్, కేటీఆర్
- పార్టీ పనుల్లో ఆఫీసర్ల ఉరుకులు
- ఫాంహౌస్ నుంచే వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్న సీఎం
- అందుబాటులో ఉండని సీఎంతో పనులవుతాయా అని అనుమానాలు
హైదరాబాద్, వెలుగు: కరోనాతో వేలాది కేసులు, వందలాది మరణాలతో జనం భయాందోళనల్లో ఉండగా ప్రభుత్వ పెద్దలు పార్టీ అంతర్గత రాజకీయాల్లో బిజీగా ఉండడం విమర్శలకు దారితీస్తోంది. ఒకవైపు టెస్టులు భారీగా తగ్గించేశారు. మరోవైపు వ్యాక్సినేషన్ కూడా నిలిచిపోయింది. హాస్పిటళ్లలో బెడ్లు దొరక్క పేషెంట్లు అంబులెన్సుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. రెమ్డిసివిర్, ఆక్సిజన్ సిలిండర్ల కొరత వేధిస్తోంది. ఇంత జరుగుతున్నా.. రాష్ట్ర సర్కారు మాత్రం ఈటల రాజేందర్ వ్యవహారంపైనే దృష్టిపెట్టింది. అసలు ప్రజారోగ్యాన్ని పట్టించుకునే దిక్కులేదు. రెండ్రోజులుగా కరోనా వల్ల జనాల ఇబ్బందుల గురించి ఆలోచించే వారే కరువయ్యారు.
ఆరోగ్య శాఖను పట్టించుకునేదెవరు?
కరోనా సోకడంతో పది రోజులుగా సీఎం కేసీఆర్, కేటీఆర్ ఐసోలేషన్‌లోనే ఉంటే.. ఈటల రాజేందర్ రివ్యూ చేస్తూ వచ్చారు. మీడియా ద్వారా ప్రజలకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆయన కూడా అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఇక వైద్య ఆరోగ్య శాఖను పట్టించుకునేది ఎవరన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈటల దగ్గర్నుంచి హెల్త్ మినిస్ట్రీ తీసుకున్న కేసీఆర్.. కరోనాపై రోజూ మూడుసార్లు రివ్యూ చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. సీఎం సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి.. కరోనా పరిస్థితులపై పర్యవేక్షణ చేస్తారని ప్రకటించారు. అయితే సీఎం చెబుతున్న రివ్యూలు, పర్యవేక్షణలు ప్రకటనలకు పరిమితం కావడం తప్పితే వాటితో జనాలకు ఒరిగిందేమీ లేదు. కనీసం సరిపడా టెస్టింగ్ కిట్లు కూడా ఆఫీసర్లు తెప్పించలేకపోయారు. శనివారం వేల మంది టెస్టులు అందక నిరాశగా వెనక్కి వెళ్లిపోయారు. ఒక్కో సెంటర్‌లో రోజూ 50 టెస్టులు మాత్రమే చేయాలని హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలు ఇచ్చింది. కానీ ఒక్కో సెంటర్‌కు కనీసం నాలుగైదు వందల మంది వస్తున్నారు. ఇందులో సగం మందికి సింప్టమ్స్ ఉంటున్నాయి. అయినా టెస్టింగ్ కిట్లు లేవంటూ వెనక్కి పంపిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా ఉందో లేదో తెలుసుకునే లోపలే పరిస్థితి ప్రాణాల మీదికి వస్తోంది. టెస్టుల కోసం జనాలు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నా, కనీసం పట్టించుకోని సర్కార్ పెద్దలు.. పార్టీ పనులపై మాత్రం ఆఫీసర్లను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.
నిర్ణయాలు తీసుకునే పవర్ లేదు
టీకా డోసులు లేవన్న సాకుతో శనివారం వ్యాక్సినేషన్ ఆపేశారు. ఆదివారం కూడా ఉండదని ప్రకటించారు. కానీ మన దగ్గరకు గురువారమే 3 లక్షల డోసులు వచ్చాయి. ఇందులో 80 వేల డోసులే వినియోగించారు. ఇంకో 2.2 లక్షల డోసులు అందుబాటులో ఉన్నా.. అసలు స్టాక్ లేదన్న సాకుతో వ్యాక్సినేషన్ ఆపేశారు. మరోవైపు 18 ఏళ్లు పైబడిన వాళ్లకు వ్యాక్సినేషన్‌పై ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై సీఎం కేసీఆర్ రివ్యూ చేస్తారని, ఆ తర్వాతే స్పష్టత వస్తుందని హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ ఆఫీసర్ల హడావుడి తప్పితే.. సీఎం అసలు ఈ విషయాన్నే పట్టించుకోవడం లేదు. ఫాంహౌజ్‌లో ఉండి పార్టీ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. కానీ కరోనాపై కీలకమైన రివ్యూ గురించి పట్టించుకోవడం లేదు. టీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో ఎంత పెద్ద ఆఫీసరైనా సొంతగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. ఇన్నాళ్లూ ఆరోగ్య మంత్రిగా ఈటల ఉండడంతో.. ఆఫీసర్లకు ప్రభుత్వంతో కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉండింది. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ తానే హెల్త్ మినిస్ర్టీని అట్టిపెట్టుకోవడం, ఆయన్ను కలిసే అవకాశం ఆఫీసర్లకు లేకపోవడంతో నిర్ణయాలు మరింత ఆలస్యం కానున్నాయి.
బెడ్లు దొరక్క చస్తున్నరు
ప్రభుత్వ పెద్దలు తమలో తాము తన్నుకుంటుంటే హాస్పిటళ్ల యాజమాన్యాలు కరోనా రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. అధిక ఫీజులు వసూలు చేయడమే కాదు.. రెమ్డిసివిర్ వంటి డ్రగ్స్‌ను బ్లాక్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది. రాబోయే నాలుగు వారాలు పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించిన సర్కార్.. ఇందుకు అనుగుణంగా ప్రిపేర్ అవడంపై మాత్రం శ్రద్ధ పెట్టలేదు. ఒకవైపు హాస్పిటళ్లలో బెడ్లు దొరక్క జనాలు చస్తుంటే.. కరోనాకు ట్రీట్‌మెంట్ చేయని హాస్పిటళ్లలోని బెడ్లను కూడా బులెటిన్‌లో చూపిస్తూ.. వేలల్లో ఖాళీ బెడ్లు ఉన్నాయంటూ జనాలను తప్పుదోవ పట్టిస్తోంది. కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీపై ఆరోగ్యశాఖ హెల్ప్‌లైన్ నంబర్‌కు, మంత్రి కేటీఆర్‌కు, సీఎంవోకు సోషల్ మీడియాలో వేల మంది ఫిర్యాదులు చేస్తున్నారు. తమను ఆదుకోవాలని గోడు వెళ్లబోసుకుంటున్నారు. కానీ ఇప్పటిదాకా ఈ అంశంపై సీఎం గానీ, కేటీఆర్‌గానీ స్పందించిన దాఖలాలు లేవు. ఈటల రాజేందర్ ప్రెస్ మీట్లు పెట్టి హెచ్చరించినా.. సమావేశాలు పెట్టి బుజ్జగించినా హాస్పిటళ్ల యాజమాన్యాలు మారలేదు. ఇప్పుడు ఆ మాత్రం మాట్లాడే దిక్కు కూడా లేకుండా పోయింది.
డాక్టర్ల అసంతృప్తి
కరోనాతో రోజూ వందల మంది మరణిస్తుంటే, ప్రభుత్వం ఇలా రాజకీయాలు చేయడమేంటని డాక్టర్లు, హెల్త్ స్టాఫ్ మండిపడుతున్నారు. టెస్టులు చేయకపోవడం, బెడ్ల కొరత వంటి కీలక అంశాల నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికే నాటకాలు ఆడుతున్నారం టూ ఫైర్ అవుతున్నారు. కరోనా ట్రీట్‌మెంట్ అందించలేక తాము ఇబ్బంది పడుతున్నా.. ఇప్పటిదాకా అనేక ఫిర్యాదులు చేసినా, ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా సీఎంవో నుంచి తమకు ఎలాంటి రెస్పాన్స్ లేదని డాక్టర్ల సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు.