విశ్లేషణ: రైతుల జీవితాలతో  రాజకీయాలా?

దేశానికి అన్నం పెట్టే రైతే ప్రస్తుతం పస్తులు ఉండాల్సి వస్తోంది. జై కిసాన్‌‌.. రైతే రాజు.. దేశానికి వెన్నెముక రైతు.. లాంటి ట్యాగ్‌‌ లైన్లు ఎన్నో రైతుకు అంటగట్టారు. కానీ దేశం యావత్తు జల్లెడ పట్టినా రైతుకు న్యాయం జరిగిన సంఘటన ఒక్కటీ కనిపించడం లేదు. ఎక్కడో ఒకచోట, ఏదో ఒకరకంగా రైతులకు అన్యాయమే జరుగుతోంది. చిన్న, సన్నకారు రైతుల గోస ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. వరి పండించిన రైతులు పంటపైనే పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా నాయకులు వారిని ఆదుకునే ప్రయత్నం చేయకుండా ఒకరిపై మరొకరు బురద జల్లుకుంటున్నారు. వరి పేరుతో ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. రైతు బిడ్డలమని చెప్పుకునే నేతలు రైతును ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే రైతులతో రాజకీయాలు చేస్తున్నారా? అనిపిస్తోంది.

దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అన్ని పార్టీల్లో ఎన్నికల హడావుడి మొదలైనట్టుగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎలక్షన్లకు ఇంకా ఏడాదిన్నర ముందు నుంచే ఎన్నికల వేడి రాజుకుంది. ఎవరికివారు ఎన్నికల కసరత్తు చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరికి అన్నంపెట్టే అన్నదాతలపై అందరూ రాజకీయాలు చేయడం మాత్రం విచారకరం. దేశానికి వెన్నెముక, రైతే రాజు, అన్నదాతా సుఖీభవ, రైతులేనిదే రాజ్యంలేదు ఇలా ఎన్నోరకాలుగా రైతన్నలను వర్ణిస్తారు. కానీ మద్దతు ధర లేక, పండించిన వడ్లను కొనక, అకాల వర్షాలతో తడిసిముద్దై మొలకలు ఎత్తడంతో ఎక్కడికక్కడ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరైతే అప్పులపాలై వడ్లరాశులపైనే తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు ఒకరినొకరు నిందించుకుంటూ కాలయాపన చేయడం దేనికి నిదర్శనం. మేము రైతు బిడ్డలమని చెప్పుకునే రాజకీయ నాయకులకు రైతుల సమస్యల పట్ల అసలు అవగాహన ఉందా అనే అనుమానం కలుగుతోంది. రైతులను ఇప్పటికీ కూడా కేవలం ఓటర్లుగానే చూస్తున్నారు. వారి ప్రాణాలంటే ఎందుకు అంత చులకనభావం. సమస్త జీవకోటికి ఆకలితీర్చే అన్నదాతల బతుకులు మారేది ఎన్నడు. 

చిన్న, సన్నకారు రైతుల దీనావస్థ
సమాజంలో ప్రతిఒక్కరూ రైతులపై ఆధారపడి వ్యాపారాలు చేసుకుంటూ లాభాలు గడిస్తున్నారు. కానీ వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే చిన్న, సన్నకారు రైతులు మాత్రం ఆర్థికంగా మెరుగుపడినట్టు ఎక్కడా ఆధారాలు కనిపించడం లేదు. కాళ్లకు చెప్పులు సైతం లేకున్నా.. పొద్దంతా కాయకష్టం చేసినా.. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి పేద రైతులది. పదులు, వందల ఎకరాలు కలిగిన వారిలో ఎక్కువ మంది వ్యవసాయం చేసేవారి కంటే చేయించేవారు ఉంటారు. అందులోనూ యంత్రాల సహాయంతో సాగు చేయడం పెరిగిపోయింది. కానీ అసలు సమస్య సన్న, చిన్నకారు రైతులే అనుభవిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. కానీ వారి పరిస్థితిని అర్థం చేసుకుంటున్న వారు మాత్రం తక్కువే. ఇక కౌలు రైతుల సంగతి చెప్పనక్కర్లేదు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి వ్యవసాయం చేస్తున్న వీరిని అసలు రైతులుగానే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదు. రైతుబంధు వంటి పథకాలను వీరికి వర్తింపజేయడం లేదు. దీంతో నష్టాలొస్తే ప్రాణాలు వదిలేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. రాష్ట్రంలో జరిగే రైతు ఆత్మహత్యల్లో ఎక్కువ శాతం కౌలు రైతులవే కావడానికి కారణం ఇదే.

దినదిన గండంగా వ్యవసాయం
ప్రస్తుతం వ్యవసాయం అంతా మిషన్ల మీదే నడుస్తోంది. అందులో భాగంగా గ్రామాల్లో వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. పొలాన్ని చదును చేయడానికి యంత్రాలను ఉపయోగించడంతో పెట్టుబడిపెట్టడం మొదలవుతుంది. ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు, ఎరువులు కేవలం పెద్ద రైతులకే దక్కుతున్నాయి. ఇక్కడ కూడా ఎన్నో రాజకీయాలు జరుగుతాయి. దీంతో చిన్నరైతులు రసాయనాలతో శుద్ధి చేసిన విత్తనాలను పొందడానికి మధ్యవర్తిత్వం వహించే దళారులపై ఆధారపడడం ఒకెత్తయితే, దీన్ని  ఆసరాగా చేసుకుని ఎన్నో కంపెనీలు వెలుస్తున్నాయి. ఈ కంపెనీలు డబ్బు సంపాదించడమే ధ్యేయంగా రైతులకు నకిలీ విత్తనాలు ఇచ్చి వారిని మరింత నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. పంట దిగుబడిని పెంచుకోవడానికి కృత్రిమ ఎరువులు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ లాంటి వివిధ రకాల క్రిమిసంహారక మందులను సైతం వాడాల్సి వస్తోంది. ఇవి కూడా ఖర్చుతో కూడుకున్న పనే. వీటన్నింటి కారణంగా వ్యవసాయ రంగం దినదిన గండంగా మారిపోతోంది.

చేతికొచ్చేదాకా నమ్మకం లేదు
ఇక గోదావరి, కృష్ణా లాంటి నదీ తీరాల్లో ఉండేవాళ్లు అతివృష్టి, కొండ దిగువ ప్రాంతాల్లో ఉండేవారికి అనావృష్టితో పంట చేతికొచ్చే దాకా గ్యారెంటీ ఉండదు. విత్తడం, కలుపు తీయడం, కోతలకయ్యే వ్యయం ఇదంతా అదనపు వ్యయం. పంట చేతికొచ్చేముందు అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే రైతులు తమ పంటలను అటవీ జంతువుల నుంచి కాపాడుకోవడానికి రాత్రుళ్లు ప్రాణాలకు తెగించి సాహసాలే చెయ్యాల్సి వస్తోంది. తీరా పంట కోతకొచ్చాక రైతులపై ప్రకృతి సైతం కన్నెర్ర చేస్తే అప్పుడప్పుడు ఒక్క రాత్రిలోనే పంటంతా సర్వనాశనం కూడా అయిపోతోంది. రైతు అదృష్టం బాగుండి ధాన్యం కల్లానికి వస్తే కనీస మద్దతుధర అటుంచితే, కొనడానికి సైతం ఎన్ని బాధలు పడాలో రాష్ట్రంలోని రైతులు అన్ని బాధలు పడుతున్నారు. ఒకచోట వర్షాలకు తడిసి మొలకలు రావడం, మరోచోట వరదనీటిలో కొట్టుకుపోవడం.. వీటి మూలాన రాశులకుప్పలపైనే రైతుల గుండెలు ఆగిపోతున్న దృశ్యాలు మనకు ఇప్పుడు కనిపిస్తున్నాయి. 

రైతుకు సాగు తప్ప మరేదీ తెలియదు 
పంట వేస్తే చేతికి వచ్చేదాకా రైతుకు నమ్మకం ఉండటం లేదు. చేతికొచ్చిన పంట కల్లానికి  చేరే దాకా గ్యారెంటీ లేదు. కల్లానికొచ్చినా అమ్మే దాకా కష్టమే. అమ్మినా కనీస  మద్దతు ధర రాదు. వచ్చినా ఆ డబ్బులు రైతు బ్యాంకు అకౌంట్​లో పడాలంటే నెలల తరబడి ఎదురుచూడాల్సిందే. ఇంత తతంగం సాగినా లాభాల మాట అటుంచితే నష్టాల ఊబిలో చిక్కుకుంటున్నాడు. ఇన్ని కష్టాలు పడుతూ వ్యవసాయం చేయడం ఎందుకనే అనుమానం అందరికీ కలుగవచ్చు. కానీ ఈ పని తప్ప మరేపనీ రాని రైతులే మన రాష్ట్రంలో ఎక్కువ మంది. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఒకరి వద్ద పని చేయడం ఇష్టంలేక తన పొలంలో తనకు కూలి డబ్బులు మిగిలినా చాలనుకుని వ్యవసాయం చేసేవారు ఎందరో ఉన్నారు. ఇలాంటి కష్టజీవులకు సంబంధించి రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. 

కార్పొరేట్​ చేతుల్లోకి వ్యవసాయం
దేశంలో వ్యవసాయ భూములన్నీ క్రమంగా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళుతున్నాయి. ఇప్పటికే ప్రధాన నగరాల్లో రంగురంగుల బహుళ అంతస్తుల్లో శీతల గిడ్డంగులు నిర్మించి, వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం రైతులు పండించే పంటలకు ప్రభుత్వం కనీస మద్దతుధర నిర్ణయిస్తుంది. కానీ భూములన్నీ కార్పొరేట్​ శక్తుల చేతికి వెళితే ప్రస్తుత రైతులు కూలీలుగా మారాల్సి వస్తుంది. వ్యాపారమే ధ్యేయంగా కార్పొరేట్​ అధిపతులు పంటలు పండించి ఏవో సాకులుచెప్పి, ఒప్పించి పేద, మధ్యతరగతి ప్రజలకు గుదిబండగా మారుతూ ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదు. అందువల్ల రైతులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

సమన్వయంతో వ్యవహరిస్తేనే..
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు సమన్వయంతో ముందుకు కదలాలి. రైతులను ఆదుకునే, ఆదరించే పథకాలను ప్రవేశపెట్టాలి. సబ్సిడీలతో కూడిన విత్తనాలను, ఎరువులు, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్‌‌లను అందించాలి. అతివృష్టి, అనావృష్టి వలన పంటల నష్టం వాటిల్లితే సరైన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి. ప్రస్తుతం రైతులు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రవాణా ఖర్చుల రూపంలో భారీగా ఖర్చు చేస్తున్నారు. అందువల్ల రైతుల వద్దకే వెళ్లి పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసే విధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులను కంటికి రెప్పలా కాపాడుతూ, వారికి గౌరవాన్నిచ్చేలా వ్యవస్థలో మార్పు తేవాలి. ఇవన్నీ కొనసాగి రైతులకు మేలు జరగాలని ఆశిద్దాం.   - పోలం సైదులు, సోషల్​ ఎనలిస్ట్‌‌