బీఆర్ఎస్ పార్టీలో గండ్ర, చారి వర్గపోరు

బీఆర్ఎస్ పార్టీలో గండ్ర, చారి వర్గపోరు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు:ముందస్తు ఎన్నికల ప్రచారంతో భూపాలపల్లి నియోజకవర్గంలో పాలిటిక్స్ హీటెక్కాయి. రూలింగ్​పార్టీలో రెండు గ్రూపులు ​చాలాకాలం నుంచే ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారావు, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మధ్య టికెట్​ వార్​ నడుస్తోంది. ఇటీవల ఈ విభేదాలు మరీ రచ్చకెక్కాయి.   రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి గండ్ర సత్యనారాయణ రావు, బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశముండడంతో ట్రై యాంగిల్​ వార్ ​తప్పేలా లేదు. 

చారి, గండ్ర మధ్య టికెట్ ​లొల్లి 

కొత్త జిల్లా భూపాలపల్లిలో 11 మండలాలున్నా.. ఒకే అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. జిల్లాలోని 5 మండలాలు మంథని నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1980 వరకు చిన్న గ్రామంగా ఉన్న భూపాలపల్లి బొగ్గు గనుల ఏర్పాటుతో  పట్టణంగా మారింది.  భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఇప్పటికి  మూడుసార్లు ఎన్నికలు జరగ్గా రెండుసార్లు  కాంగ్రెస్‌, ఒకసారి బీఆర్​ఎస్​ గెలిచాయి.  2009, 2018లో కాంగ్రెస్​ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి  గెలిచారు. 2014లో టీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి  విజయం సాధించారు.  2018లో   రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి తన భార్య గండ్ర జ్యోతిని వరంగల్‌‌ జడ్పీ చైర్​పర్సన్​ చేయడానికి టీఆర్ఎస్ లో  చేరారు. దీంతో ఇక్కడ  రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.  ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌‌తో కలిసి పనిచేస్తున్న మధుసూదనాచారి ప్రాబల్యం తగ్గిపోయింది. ఎమ్మెల్యేగా వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్​ పర్సన్​గా జ్యోతి హవా కొనసాగుతోంది. గవర్నర్​ కోటాలో  ఎమ్మెల్సీగా నామినేట్​అయిన మధుసూదనచారి  అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతున్నారు. దీంతో ఆయన  అనుచరుల్లో   జోష్ పెరిగింది. ఇటీవల జరిగిన  బీఆర్ఎస్ మీటింగుల్లో చారి, గండ్ర వర్గాలు బాహాబాహీకి దిగడం వారి మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరాయో స్పష్టం చేస్తున్నాయి. 

గండ్రకు వ్యతిరేక పవనాలు

నియోజకవర్గంలో ప్రస్తుతం గండ్ర వెంకటరమణారెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. భూపాలపల్లి టౌన్‌‌లో నాలుగేండ్ల కింద కట్టిన సుమారు  1100 డబుల్‌‌ బెడ్‌‌ రూం ఇండ్లు ఇప్పటికీ లబ్దిదారులకు అందజేయలేదు.  గత ఎన్నికల్లో తాను  గెలిస్తే భూపాలపల్లికి రింగ్‌‌ రోడ్డు నిర్మిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు.  జిల్లా అయినా ఇక్కడ  వ్యవసాయ మార్కెట్ లేదు.   ఇసుక,బొగ్గు లారీ లు టౌన్ లో నుంచి వెళ్లడం వల్ల యాక్సిడెంట్స్ జరగుతున్నాయని, ప్రమాదాల నివారణకోసం  ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నా పట్టించుకోవడం లేదు.  దీంతో జనాల్లో అసంతృప్తి నెలకొంది. ఎమ్మెల్యే గండ్ర భార్య జ్యోతి ప్రస్తుతం బీఆర్‌‌ఎస్‌‌ జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. భూపాలపల్లి జడ్పీ చైర్​పర్సన్​ జక్కు శ్రీ హర్షిణి నియోజకవర్గంలో  ఏ మండలంలోనూ  పర్యటించకుండా జ్యోతి అడ్డుకుంటున్నారనే విమర్శలున్నాయి. పార్టీపరంగా నిర్వహించే కార్యక్రమాల్లో సీనియర్​ లీడర్​,  ఎమ్మెల్సీ మధుసూదనచారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదంటున్నారు. ఆమె వ్యవహారంపై పార్టీలో నెలకొన్న అసంతృప్తి గండ్రకు మైనస్ గా మారనుంది. 

 కాంగ్రెస్‌‌, బీజేపీలో నయా జోష్‌‌  

కాంగ్రెస్‌‌ నుంచి గెలిచిన గండ్ర టీఆర్‌‌ఎస్‌‌లో చేరగా రెండుసార్లు ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన  సత్యనారాయణ రావు కాంగ్రెస్‌‌ లో చేరారు. ఆయన  2009లో బీజేపీ నుంచి, 2018లో ఏఐఎఫ్‌‌బీ నుంచి బరిలో నిలిచి గట్టిపోటీ ఇచ్చారు.  కాంగ్రెస్​లో చేరినప్పటినుంచి  పార్టీ  కార్యక్రమాలతో యాక్టివ్​గా ఉంటున్నారు. ఈసారి కాంగ్రెస్​ టికెట్ మీద పోటీ చేస్తే సత్యనారాయణ రావుకు సానుభూతి కలిసివస్తుందని అంచనా. కాంగ్రెస్​ నుంచి  మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే  శ్రీధర్‌‌ బాబు తమ్ముడు శ్రీను కూడా టికెట్​ ఆశిస్తున్నారు.  గత ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన చందుపట్ల కీర్తిరెడ్డి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నారు. నాలుగేండ్లుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.  ఇక్కడ పోటీ తీవ్రంగా ఉన్నా మహిళ కావడంతో కలిసివస్తుందన్న టాక్​ వినిపిస్తోంది. పోలీస్ శాఖలో  రిటైర్డ్‌‌ అయి..  సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న  కటంగూరి రాంనర్సింహారెడ్డి కూడా బీజేపీ టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  


2018 భూపాలపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు 

గండ్ర వెంకటరమణారెడ్డి                                      (కాంగ్రెస్‌‌)         69, 918 ఓట్లు 
గండ్ర సత్యనారాయణ రావు                                 (ఏఐఎఫ్‌‌బీ)      54,283 ఓట్లు
సిరికొండ మధుసూదనాచారి                               (టీఆర్‌‌ఎస్‌‌)         53,567 ఓట్లు
చందుపట్ల కీర్తిరెడ్డి                                                  (బీజేపీ)              15,744 ఓట్లు


భూపాలపల్లి ఎమ్మెల్యే  గండ్ర వెంకటరమణారెడ్డి అనుకూల అంశాలు

  •     రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం
  •     సౌమ్యునిగా పేరు
  •     జీఎంఆర్‌‌ ట్రస్ట్‌‌ పేరుతో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ  

ప్రతికూల అంశాలు

  •     కాంగ్రెస్‌‌ నుంచి గెలిచి బీఆర్‌‌ఎస్‌‌లో చేరడం
  •     రింగ్‌‌ రోడ్డు ఏర్పాటు చేయకపోవడం
  •     చిట్యాల, టేకుమట్లలో పేద రైతుల, ప్రభుత్వ భూముల కబ్జా ఆరోపణలు
  •     మాజీ స్పీకర్‌‌ చారి వర్గంతో వైరం
  •     కట్టిన 1,100 డబుల్‌‌ బెడ్‌‌రూం ఇండ్లు పంపిణీ చేయకపోవడం

ములుగు జిల్లా  ఓటర్ల వివరాలు

పురుషులు   :     1,29,762 
మహిళలు    :     1,28,900
ఇతరులు     :     06
మొత్తం         :     2,56,668