స్వపక్షంలోనే విపక్షం.. ఆర్మూర్ లో వేడెక్కిన రాజకీయం

  • -షాడో చైర్మన్ల పెత్తనం భరించలేకే!
  • -అవిశ్వాసానికి  సిద్ధమవుతున్న బీఆర్ఎస్​ కౌన్సిలర్లు

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్​ మున్సిపల్ లో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్  కౌన్సిలర్లు స్వపక్షానికే చెందిన చైర్ పర్సన్​పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. చైర్ పర్సన్ వినీత భర్త పండిత్ పవన్, ఆమె మరిది ప్రేమ్ కుమార్ పెత్తనం  భరించలేని అధికార పార్టీ కౌన్సిలర్లు  తిరుగుబాటుకు తెరలేపారు. పాలక పక్షానికి మరో ఏడాది మాత్రమే టైం ఉన్న తరుణంలో అవిశ్వాసం అంశం తెరపైకి రావడం ఆర్మూర్ లో చర్చనీయాంశంగా మారింది. షాడో చైర్మన్ల అవినీతి, అక్రమాలు భరించలేకే తాము అవిశ్వాసానికి వెళుతున్నామని  కౌన్సిలర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 

ఆరంభం నుంచి  అవినీతి మచ్చలే

ఆర్మూర్ మున్సిపల్ లో మెజారిటీ స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ సునాయాసంగా చైర్ పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. చైర్ పర్సన్ గా పండిత్ వినీత బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పాలన మొత్తం ఆమె భర్త  పవన్, ఆయన తమ్ముడు ప్రేమ్​ చేతుల్లోకి వెళ్లిపోయింది. నాలుగేళ్లలో మున్సిపల్ కమిషనర్ లుగా ఉన్న శైలజ, జగదీశ్వర్​ గౌడ్​, ప్రస్తుతం ఉన్న ప్రసాద్ చౌహాన్ తో వివాదాలు జరిగాయి. తమకు సమాచారం ఇవ్వకుండా  వెళ్లొద్దని హుకుం జారీ చేశారు. దీంతో కమిషనర్ల డ్యూటీ షాడో చైర్మన్ల కనుసన్నల్లోనే జరిగింది. తాము చెప్పిన విధంగానే మీటింగ్ లలో ఏజెండా అంశాలు పొందుపరచాలనేవారు.

  రెండున్నరేళ్ల తర్వాత  బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం కోరుతూ అప్పటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వద్దకు వెళ్లగా వద్దని నచ్చచెప్పి వారిని పంపించారు. అప్పటి నుంచి షాడో చైర్మన్లకు, బీఆర్​ఎస్ కౌన్సిలర్లకు మధ్య వాటాల పంపిణీలో తేడాలు వచ్చాయి. షాడో చైర్మన్లతో కౌన్సిలర్ల భర్తలు మున్సిపల్ చాంబర్ లోనే వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. తమ వార్డుల్లో చేసే పనులకు నేరుగా కమీషన్లు తీసుకోవడం, మున్సిపల్ లో ఔట్​సోర్సింగ్ లో జరిపిన నియామకాల్లో భారీగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వినిపించాయి.  

ట్రాక్టర్లు, ఆటోల కొనుగోలులో  డబ్బులు మింగారని కౌన్సిలర్లే ఆరోపించారు. తాజాగా ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇచ్చి షాడో చైర్మన్లు డబ్బులు తీసుకున్నారనే  ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్ల క్రితం రూ.5 లక్షలతో మున్సిపల్ ఆఫీస్ కు రిపేర్ చేయించగా, మళ్లీ ఆరు నెలల క్రితం రూ.10 లక్షలతో మరోసారి వాస్తు పేరిట రిపేర్ చేయించడంతో షాడో చైర్మన్ల అవినీతిపై  కౌన్సిలర్లు మండిపడుతున్నారు. 

అవినీతి అక్రమాలపై  మాజీ ఎమ్మెల్యే ముందు రచ్చ

షాడో చైర్మన్ల అవినీతి, అక్రమాలే ఆర్మూర్ లో బీఆర్ఎస్ కు మైనస్ గా మారాయని మూడు రోజుల క్రితం ఆర్మూర్ కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముందు బీఆర్ఎస్ కౌన్సిలర్లు రచ్చ చేశారు. అవినీతికి పాల్పడుతున్నందున తాము అవిశ్వాసానికి వెళుతున్నట్లు  స్పష్టం చేశారు. చైర్ పర్సన్ సీటును ఆశిస్తున్న ఓ ఇద్దరు నేతలు తమ భార్యలను తీసుకుని మాజీ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి తమకు సపోర్ట్​ ఇవ్వాలని కోరారు. మెజారిటీ కౌన్సిలర్లు అవిశ్వాసం కోరుతున్నందున ఓ వారం రోజులు ఓపిక పట్టాలని, హైదరాబాద్ వస్తే అందరితో చర్చిస్తానని  జీవన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. 

సపోర్ట్​ చేసిన వారికి ప్యాకేజీ 

అవిశ్వాసానికి సపోర్ట్​ చేసే వారికి ప్యాకేజీ ఇస్తామంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లతో ఆశావహులు చర్చలు జరుపుతున్నారు. ఇతరులు ఇచ్చిన దానికంటే తాను రూ.50 వేలు ఎక్కువ ఇస్తానని చైర్ పర్సన్ సీటును ఆశిస్తున్న ఓ కౌన్సిలర్​ భర్త కౌన్సిలర్ల గెట్ టుగెదర్ లో చెప్పారు. మరో కౌన్సిలర్​ భర్త మాత్రం తాను అన్న ఎలా చెప్తే అలా అంటూ ముక్కు సూటిగా చెప్పేశారట.

ఇదే విషయమై జీవన్ రెడ్డిని మెజారిటీ కౌన్సిలర్లతో కలిసి హైదరాబాద్ వెళ్ళేందుకు సిద్దమై యూ టర్న్ తీసుకుని ఆర్మూర్ వచ్చేశారు. షాడో చైర్మన్ మాత్రం తాను ఒక్కొక్కరికి రూ.2లక్షలు ఇస్తానని, అవిశ్వాసం మాటను పక్కన పెట్టాలని కోరినట్లు తెలిసింది. ఏదిఏమైనా ఏడాది పాలన కోసం కనీసం రూ.కోటి ఖర్చు చేసుకునే వారికే ఆర్మూర్ మున్సిపల్ చైర్​ పర్సన్ దక్కేలా కనిపిస్తోంది.