
- హ్యాట్రిక్‌పై ఆశతో చిన్నయ్య.. గెలుపు ధీమాలో వినోద్, శ్రీదేవి
- స్పీడ్ పెంచిన కాంగ్రెస్, బీఆర్ఎస్
- ఊపందుకోని బీజేపీ క్యాంపెయిన్
- అన్ని పార్టీలకూ అసమ్మతి బెడద
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి (ఎస్సీ) నియోజకవర్గంలో పాలిటిక్స్ హీటెక్కాయి. మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారం ఊపందుకుంది. సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్.. ఈసారి ఎలాగైనా జెండా పాతాలని కాంగ్రెస్, బీజేపీ పట్టుదలతో ముందుకెళ్తున్నాయి. అయితే, ఈ మూడు పార్టీలను అసమ్మతి బెడద వెంటాడుతోంది. అధికార బీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కన్నెపల్లి, వేమనపల్లి మండలాలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు కారు దిగి.. హస్తానికి జైకొట్టారు. నియోజకవర్గానికి చెందిన మరికొందరు లీడర్లు ఇదే బాటలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీ అవుతుండడం ఆసక్తి రేపుతోంది.
చిన్నయ్యకు హ్యాట్రిక్ దక్కేనా?
బెల్లంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య ఇప్పటికే రెండు సార్లు గెలిచారు. ఈసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని సర్వశక్తులొడ్డుతున్నారు. కానీ సొంత పార్టీలోని అసమ్మతి ఆయనకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే కన్నెపల్లి ఎంపీపీ మాధవరపు సృజన, ఆమె భర్త నర్సింగరావు, వేమనపల్లి జడ్పీటీసీ, ఆమె భర్త రుద్రభట్ల సంతోష్ కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీకి పెద్ద బూస్టింగ్ ఇచ్చారు. నెన్నెల, భీమిని, తాండూర్, కాసిపేట, బెల్లంపల్లి మండలాలకు చెందిన అసంతృప్త నాయకులు హస్తం వైపు చూస్తున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ నుంచి పలువురు కౌన్సిలర్లు సైతం కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లినట్టు సమాచారం. ఇలా అసమ్మతి లీడర్లు ఎక్కడికక్కడ కారు స్పీడుకు బ్రేకులు వేస్తుండడంతో చిన్నయ్య కలవరపడుతున్నారు. క్యాడర్ ను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు.
నిత్యం తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలతో మీటింగులు పెడుతున్నారు. మళ్లీ మన సర్కారే వస్తుందని, ఎవ్వరూ పార్టీని వీడవద్దని బుజ్జగిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే చిన్నయ్యను ప్రచారంలో జనం వివిధ సమస్యలపై నిలదీస్తున్నారు. నెన్నెల, వేమనపల్లి, కన్నెపల్లి మండలాల్లోని మారుమూల గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించలేదని మండిపడ్తున్నారు. బెల్లంపల్లిలో మెడికల్ కాలేజీ, బస్ డిపో, ఇంజినీరింగ్ కాలేజీ, మండలానికో జూనియర్ కాలేజీ వంటి ప్రధానమైన హామీలను ఎమ్మెల్యే నెరవేర్చలేకపోవడం మైనస్ గా మారింది. బెల్లంపల్లిలో మ్యాంగో మార్కెట్, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్, డబుల్ బెడ్రూంల నిర్మాణం మధ్యలో ఆగిపోవడంపై ఆయన సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
సింగరేణి జాగాల్లో నివాసం ఉంటున్న వారికి పూర్తిస్థాయిలో ఇండ్ల పట్టాలు అందకపోవడం, పోడు భూముల సమస్య పరిష్కారం కాకపోవడంపైనా జనం ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆరిజిన్ డెయిరీ సీఈవో షేజల్ ఎపిసోడ్ చిన్నయ్య వ్యక్తిత్వం గురించి ప్రజల్లో చర్చకు దారితీసింది. ఇవన్నీ ఆయన గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
వినోద్ ప్రచారహోరు..
కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి గడ్డం వినోద్ ఈసారి గెలుపు ధీమాతో ముందుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి ఏనుగు గుర్తుపై పోటీ చేసిన ఆయన చిన్నయ్యకు ముచ్చెమటలు పట్టించారు. గెలుపు అంచుల దాకా వచ్చి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మచ్చలేని నాయకుడిగా పేరు ఉండడం, తన తండ్రి కాలం నుంచి నియోజకవర్గ ప్రజలతో ఉన్న అనుబంధం వినోద్‌కు కలిసొచ్చే అంశాలు. మరోవైపు బీజేపీ, బీఆర్ ఎస్ లోని అసమ్మతి నాయకులు కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. దీంతో ఆయన ఓవైపు సొంత పార్టీలోని అసమ్మతివాదులను బుజ్జగిస్తూ, మరోవైపు ఇతర పార్టీల్లోని అసంతృప్తులను ఆకర్షిస్తూ రోజురోజుకు బలం పెంచుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా నిత్యం ప్రజలతో మమేకవుతూ స్థానికంగా అందుబాటులో ఉండరనే అపవాదును తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన బిడ్డ సాక్షిగా ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే బెల్లంపల్లిలో ఇల్లు కట్టుకొని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నారు. అటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గెలుపు ధీమాతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
బీజేపీలో అసమ్మతి..
మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆ పార్టీలో అసమ్మతి మొదలైంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ మరోసారి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆరు సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనకు కాకుండా ఇటీవలే పార్టీలో చేరిన శ్రీదేవికి టికెట్ ఇవ్వడంపై భగ్గుమంటున్నారు. శ్రీదేవికి టికెట్ రద్దు చేయాలని కొద్ది రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న ఆయన.. బీజేపీ స్టేట్ ఆఫీస్ ముందు తన మద్దతుదారులతో ధర్నా చేసినా పార్టీ హైకమాండ్ స్పందించలేదు. పార్టీలో ఉన్న మరికొంత మంది అసమ్మతివాదులు శ్రీదేవితో కలిసిరాకపోవడంతో ఆమె ఒంటరిగానే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ హైకమాండ్ అసంతృప్తుల వ్యవహారాన్ని తేల్చకపోవడం శ్రీదేవికి తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలోని కీలక లీడర్లంతా హస్తం వైపు మొగ్గుచూపుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. శ్రీదేవికి పెద్దగా క్యాడర్ లేకపోవడం ఈ ఎన్నికల్లో బీజేపీకి మైనస్‌గా మారనుంది.