- బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
- తెల్లం వెంకట్రావు దిష్టిబొమ్మ దహనం చేసిన యూత్ కాంగ్రెస్నాయకులు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కుటుంబంతోపాటు హైదరాబాద్‌లో కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ హైకమాండ్ సైతం దాదాపుగా దీన్ని ధ్రువీకరించుకుని, నియోజకవర్గంలోని ఇతర సీనియర్ నాయకులను పిలిపించుకుని క్యాడర్‌ను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోంది.
ఇదే సమయంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ సమావేశం నిర్వహించి తాను పార్టీ మారడం లేదని, అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశానని, గత ఎమ్మెల్యే సీఎం కేసీఆర్‌ను కలిసే ప్రయత్నం చేయకుండా డెవలప్మెంట్కు అడ్డుపడ్డారని వ్యాఖ్యానించారు. తాను ఎప్పటికీ ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనిషినేనని చెప్పారు. దీంతో ‘అభివృద్ధి కోసమే అయితే పార్టీలోని ఇతర నాయకులను తీసుకెళ్లకుండా కుటుంబ సమేతంగా ఎందుకు వెళ్లారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనిషినని చెప్పుకోవడం ఏంటి’ అని స్వపక్షం, విపక్షంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై తెల్లం చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. కాంగ్రెస్, యూత్కాంగ్రెస్నాయకులు ఎమ్మెల్యే వెంకట్రావుపై దుమ్మెత్తిపోశారు. బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఊసరవెల్లే నయం : కాంగ్రెస్, టీడీపీ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కంటే రంగులు మార్చే ఊసరవెల్లే నయం అని కాంగ్రెస్, టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. బుధవారం డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్, టీడీపీ అండగా ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్నారని, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కనీసం మంత్రులు, వారి ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వలేదనే విషయం తెలియదా? అని నిలదీశారు.
అసెంబ్లీ సాక్షిగా రామాలయం అభివృద్ధికి నిధులు, ఐదు పంచాయతీలు తిరిగి తెలంగాణకు తేవాలని, కరకట్టలకు నిధులు ఇవ్వాలని అప్పటి ఎమ్మెల్యే పొదెం వీరయ్య అడిగిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ ఆరుసార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచి, గత ప్రభుత్వం రూ.100కోట్లు ఇస్తామన్నా పార్టీ మారని వీరయ్యపై అనుచిత వ్యాఖ్యలు సరికావన్నారు. వైసీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో సీటు వచ్చేలా లేదని మళ్లీ బీఆర్ఎస్ లో చేరారని, ఊసరవెల్లిలా మారిన వెంకట్రావుకు పొదెంను విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు.
టీపీసీసీ మెంబర్నల్లపు దుర్గాప్రసాద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బలుసు నాగ సతీశ్, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్సరెళ్ల నరేశ్, సీనియర్ నాయకులు తమ్మళ్ల వెంకటేశ్వర రావు, టీడీపీ లీడర్లు అజీం, కుంచాల రాజారాం, పీఏసీఎస్ చైర్మన్ అబ్బినేని శ్రీనివాసరావు, యూత్ కాంగ్రెస్ లీడర్లు ప్రెస్ మీట్లో మాట్లాడారు. తెల్లం వెంకట్రావు తీరును ఎండగట్టారు. వీరయ్య జోలికొస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
అడకత్తెరలో పోకచెక్కలా ‘తెల్లం’ పరిస్థితి
పార్టీ మారుతారని బీఆర్ఎస్ హైకమాండ్ సీరియస్‌గా ఉండడం, ఇటు కాంగ్రెస్‌లోకి వద్దామనుకుంటే వ్యతిరేక పవనాలు ఎదురు కావడంతో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. ఆదివాసీల పేరిట దుమ్ముగూడెం మండలం ములకపాడులో మంగళవారం ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిసిన విషయం తెలిసిందే. సొంత పార్టీ లీడర్లు సైతం ఆయన తీరుపై పెదవి విరుస్తున్నారు. గెలిచిన మూడో రోజు నుంచే పార్టీ మారేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇంటాబయట వ్యతిరేకతతో ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
దిష్టిబొమ్మ దహనం
పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో బుధవారం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దిష్టిబొమ్మను యూత్ కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోనూ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఎమ్మెల్యే నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. గతంలో ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో భద్రాచలం అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా? అని ప్రశ్నించారు.