- ఢిల్లీలో శీష్‌మహల్ రచ్చ
- శీష్ మహల్‌ను కేజ్రీవాల్ 40 కోట్లతో 7స్టార్ హోటల్‌గా మార్చారని బీజేపీ ఆరోపణలు
- మీడియాతో కలిసి శీష్‌మహల్‌కు ఆప్ నేతలు
- ఆరోపణలు నిరూపించాలని బీజేపీ నేతలకు సవాల్
- పోలీసులు అడ్డుకోవడంతో పీఎం నివాసం వద్ద నిరసన
న్యూ ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్అయిన మరునాడే ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. ఆప్, బీజేపీ నేతల మధ్య నడుస్తున్న పరస్పర మాటల యుద్ధం కాస్తా ఆందోళనల దాకా వచ్చింది. ఈ సమయంలో సీఎం బంగ్లా వివాదం రాజకీయ దుమారాన్ని రేపుతున్నది.
6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని బంగ్లాను అర్వింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు 40 కోట్లు ఖర్చు చేసి 7 స్టార్‌హోటల్‌గా మార్చేశారని, ఇది ‘శీష్ మహల్’ అంటూ బీజేపీ చేసినకామెంట్లపై బుధవారం రచ్చ కొనసాగింది. బీజేపీ విమర్శలను ఆప్ తిప్పికొట్టింది.
ప్రజలకు నిజాలను చూపుతామంటూ ఉదయం ఆ పార్టీ నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ మీడియాను తీసుకొని 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని బంగ్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
అయితే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఆప్ నేతలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారు అక్కడ బైఠాయించి, నిరసన తెలిపారు. సీఎం నివాసంలోకి వెళ్లేందుకు ఓ ఎంపీ, మంత్రికి ఎందుకు అనుమతి అవసరమని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సీఎం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.
బీజేపీ అబద్ధాలు బయటపడ్డయ్: ఆప్ నేతలు
శీష్మహల్లోకి మీడియాతో వెళ్లేందుకు అనుమతించకపోవడంతో బీజేపీ అబద్ధాలు బయటపడ్డాయని ఆప్ నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ‘‘సీఎం నివాసంలో గోల్డెన్ టాయ్‌లెట్, స్విమ్మింగ్‌పూల్, మినీ బార్ ఉన్నాయని బీజేపీ లీడర్లు కొన్ని నెలలుగా ఆరోపణలు చేస్తున్నరు.
రోజుకో వీడియోను విడుదల చేస్తున్నారు. ఇవాళ మీడియాతో ఇక్కడికి వచ్చాం. బీజేపీ నేతలను రావాలని కోరాం. వారి ఆరోపణలు నిజమని నిరూపించాలని సవాల్ చేశాం. అయితే, పోలీసులు వాటర్ ఫిరంగులతో అడ్డుకున్నారు.
లోనికి అనుమతిస్తే అసలు నిజాలు బయటపడేవి” అని పేర్కొన్నారు. తాము మీడియాతో వస్తే బీజేపీ నేతలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. కాగా, ప్రధాని మోదీ అధికార నివాసం ‘రాజ్‌మహల్’ అని ఆప్ నేతలు విమర్శించారు.
ఇందుకోసం రూ.2,700 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రధాని లగ్జరీ భవనంలోకి మీడియాను అనుమతించాలని బీజేపీకి సవాల్ చేశారు. లోక్‌కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసంవైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే, వారిని పోలీసులు అడ్డుకోగా, తుగ్లక్‌రోడ్‌లోని పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించారు. తాము పీఎం భవనాన్ని ప్రజలకు చూపించాలని వస్తే ఎందుకు పారిపోతున్నారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. కాగా, పీఎం నివాసం బయట సెక్షన్ 163 కింద ఆంక్షలున్నాయని, ఎలాంటి ధర్నాలు చేయొద్దని ఆప్ నేతలను పోలీసులు వారించారు.
సీఎం ఆతిశీ నివాసం వద్ద బీజేపీ నేతల ఆందోళన
ఆప్ నేతల ఆందోళనకు ప్రతిగా ఏబీ 17 మధురా రోడ్ లోని సీఎం ఆతిశి నివాసానికి ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవా, ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు.
ఇప్పటికే కేంద్రం ఆమెకు ఈ బంగ్లాను కేటాయించిందని, ఎందుకు 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బిల్డింగ్ (శీష్ మహల్) కావాలని ఆతిశి అడుగుతున్నారని ప్రశ్నించారు. ‘‘ఢిల్లీ సీఎం అయిన ఆతిశికి ఈ బంగ్లాను కేటాయించారు.
ఈ బంగ్లాను మీకు ఎప్పుడు అలాట్ చేశారో చెప్పాలి. మీకు శీష్మహల్లోనే నివసించాలని ఎందుకు అనుకుంటున్నారో సమాధానమివ్వాలి” అని ఆతిశిని నిలదీశారు. కావాలనే ఎన్నికల ముందు ఆప్ నాటకాలాడుతున్నదని మండిపడ్డారు. శీష్‌మహల్‌ను ఇంతకుముందు ఆప్నేతలు ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.