నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వర్సెస్‌‌‌‌ భూపాల్ రెడ్డి

  • భారీగా వలసలు ఉంటాయని చెబుతున్న ఎంపీ వర్గం  
  • తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్న ఎమ్మెల్యే వర్గం 
  • పట్టణంలో కోమటిరెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే అనుచరులు
  • సోషల్​ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు

నల్గొండ, వెలుగు:  నల్గొండ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది.  ఎనిమిది మంది మున్సిపల్‌‌‌‌ కౌన్సిలర్లు బీఆర్ఎస్‌‌‌‌కు రాజీనామా చేసి, ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌లో చేరిన విషయం తెలిసిందే. అంతేకాదు కాంగ్రెస్‌‌‌‌లోకి భారీగా వలసలు ఉంటాయని, మిగిలేది ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి ఒక్కరేనని కోమటిరెడ్డి శిబిరం ప్రచారం చేస్తోంది. సర్పంచ్‌‌‌‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు కాంగ్రెస్‌‌‌‌లోకి వస్తారని ఆ వర్గం చెబుతుండగా..  ఎమ్మెల్యే వర్గం తప్పుడు ప్రచారమని కొట్టి పారేస్తోంది. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఉద్దేశపూర్వకంగా తమపై అవాస్తవాలు వైరల్ చేస్తున్నారని నల్గొండ మండల సర్పంచ్​లు, ఎంపీటీసీలు శుక్రవారం ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌ పెట్టి ఖండించారు. 

ఎంపీ వెంకటరెడ్డిని అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గం

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక దఫా రూరల్​ మండలాల్లో పర్యటించిన నేతలు ఇప్పుడు నల్గొండ పట్టణంపై ఫోకస్​ పెట్టారు. ఎమ్మెల్యే ఇప్పటికే పలు వార్డుల్లో ప్రచారం ముగించారు. ఎంపీ కోమటిరెడ్డి మాత్రం సెంటిమెంట్​ ప్రకారం శనివారం వీటీకాలనీలోని వెంకటేశ్వర టెంపుల్‌‌లో పూజలు చేసి ప్రచారం షురూ చేశారు. కాలినడకన, బైక్‌‌‌‌పై  వార్డుల్లో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుస్తున్నారు. ఈ క్రమం లో 25 వార్డులోని దుర్గామాత ఆలయానికి వస్తుండగా కాలనీ యువకులు వెంకటరెడ్డిని అడ్డుకున్నారు. ‘భూపాల్​రెడ్డి పెట్టిం చిన విగ్రహం..ఇక్కడికి రావొద్దు’ అని కొందరు యువకులు అడ్డుచెప్పడంతో వెంకటరెడ్డి టెంపుల్​బయటి నుంచే దండం పెట్టి వెనక్కి వెళ్లిపోయారు. వెంకటరెడ్డి సమక్షంలోనే భూపాల్​ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేయడంతో అక్కడి పరిస్థితులు కొంత ఉద్రిక్తతకు దారి తీశాయి.

సోషల్ మీడియాలో వీడియోలు హల్‌‌‌‌చల్​ 

ఎమ్మెల్యే, ఎంపీలు చేస్తున్న ప్రచారంపై వారి అనుచరులు ఎప్పటికప్పుడు సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎంపీ వెంకటరెడ్డిని అడ్డుకున్న యువకులు వీడియోలకు రీమీక్స్​ సాంగ్స్​ క్రియేట్​ చేసి వాట్సాప్​ గ్రూపుల్లో పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారు. నాలుగే ళ్ల నుంచి పత్తాలేని కోమటిరెడ్డి నల్గొండకు ఎందుకు వచ్చావ్? అని కామెంట్స్​పెడుతున్నారు. కౌన్సిలర్ల పార్టీ మార్పుపై ఎంపీ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. పార్టీ మారొచ్చిన లీడర్లపై కామెంట్స్​చేస్తే సహించేది లేదని, ఎమ్మెల్యే వైఖరి నచ్చకనే పార్టీలోకి వచ్చారని స్పష్టం చేస్తున్నారు. 

మున్సిపాలిటీలో పెరిగిన కాంగ్రెస్ బలం

కౌన్సిలర్ల చేరికతో మున్సిపాలిటీలో కాంగ్రెస్​ బలం పెరిగింది. మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉండగా..  20 మంది కాంగ్రెస్​ , 20 మంది బీఆర్ఎస్, బీజేపీ, ఇతర కౌన్సిలర్లు  8 మంది ఉన్నారు. చైర్మన్​ ఎన్నికప్పుడు బీఆర్ఎస్​ బలం సరిపోకపోవడంతో ఐదుగురు ఎమ్మెల్సీలు ఓటు వేసి బీఆర్ఎస్​ అభ్యర్థి సైదిరెడ్డిని చైర్మన్​ చేశారు. ఇప్పుడు సీన్​ రివర్స్ అయింది. బీఆర్ఎస్​ నుంచి 8 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్​లోకి చేరడంతో ఆ పార్టీ బలం 26కు చేరింది. బీఆర్​ఎస్ బలం 15కు తగ్గింది. దీంతో ఎమ్మెల్యే ఎన్నికలు అయ్యాక పాలకవర్గంపై అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్​ పార్టీ నెగ్గుతుందని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్​ చైర్మన్​ అభ్యర్థి బుర్రి శ్రీనివాస్​ రెడ్డి కాగా, ఆయన ప్రస్తుతం వెంకటరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం పాల్గొంటున్నారు. ఇటీవల కాంగ్రెస్​లో చేరిన వాళ్లలో వైస్​ చైర్మన్​ అబ్బగోని రమేశ్​గౌడ్​ కూడా ఉండటం గమనార్హం.