ఎమ్యెల్యే వర్సెస్​ మాజీ ఎమ్యెల్యే..నేడు ఆర్మూర్​ మున్సిపాల్టీలో బల నిరూపణ

ఎమ్యెల్యే వర్సెస్​ మాజీ ఎమ్యెల్యే..నేడు ఆర్మూర్​ మున్సిపాల్టీలో బల నిరూపణ
  • రెండు వర్గాలుగా చీలిన బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు 

నిజామాబాద్​, వెలుగు: అర్మూర్​ మున్సిపల్​ పాలకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్​ రెడ్డి వర్సెస్​ మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి వర్గాల మధ్య  రాజకీయాలు హీటెక్కుతున్నాయి. తాజాగా మున్సిపల్​ చైర్​ పర్సన్​ పండిత్​ వినీతను కుర్చీ దించేందుకు సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నేడు కలెక్టర్​ ఆధ్వర్యంలో మున్సిపల్​లో బల నిరూపణ జరుగనుంది.  

నెల నుంచి జీవన్​రెడ్డి క్యాంపులో.. 

ఆర్మూర్​ మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లుండగా 23 మంది బీఆర్​ఎస్​ , బీజేపీ నుంచి ఆరుగురు, ఇండిపెండెంట్​ కౌన్సిలర్లు ఐదుగురు, ఎంఐఎం 1, కాంగ్రెస్​ 1 ఉన్నారు.  చైర్​ పర్సన్​ పదవి బీసీ మహిళకు రిజర్వ్​ కావడంతో పండిత్​ వినీత పదవి దక్కించుకున్నారు. అప్పటి ఎమ్యెల్యే జీవన్​రెడ్డి అండతో బీజేపీ మినహా ఇతర కౌన్సిలర్లందరూ ఆమెకు మద్ధతుగా నిలిచారు.  ప్రస్తుతం పలువురు బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు కొందరు ఆమెపై అసంతృప్తి గా ఉన్నారు. వారిని మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి క్యాంపునకు తరలించారు.  

 మితిమీరిన వ్యవహారం వల్లే!

చైర్​​పర్సన్​ పండిత్​ వినీత భర్త పవన్, మరిది పండిత్​ ప్రేమ్​ మున్సిపల్​ వ్యవహారాలలో మితిమీరి జోక్యం చేస్తున్నారని బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు కొందరు అసంతృప్తిలో ఉన్నారు. దీంతో అవిశ్వాసంతో చైర్​పర్సన్​ను తొలగించాలని భావించారు. గతంలోనే అవిశ్వాస చర్చ వచ్చినప్పటికీ అప్పుడు ఎమ్మెల్యేగాఉన్న జీవన్​ రెడ్డి  బుజ్జగిస్తూ వచ్చారు.   తాజాగా పరిస్థితులు మారడంతో కౌన్సిలర్లు అవిశ్వాసానికి పూనుకున్నారు. జీవన్​రెడ్డిని దెబ్బతీయడానికి ఎమ్మెల్యే పైడి రాకేశ్​​రెడ్డి పావులు కదుపుతున్నట్టు వినిపిస్తోంది. బీఆర్​ఎస్​ కౌన్సిలర్లలో కొందరినైనా కాపాడుకునేందుకు జీవన్​రెడ్డి నెల రోజుల నుంచి హైదరాబాద్​లో క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. 

బీజేపీకి చెందిన ఆరుగురితో పాటు ఐదుగురు ఇండిపెండెంట్లు బీఆర్ఎస్​ చీలిక వర్గాన్ని కూడగట్టి పండిత్​ వినీతను చైర్​పర్సన్​ కుర్చీ నుంచి దింపాలనే ప్లాన్​లో ఉన్నట్టు తెలుస్తోంది. పండిత్​ వినీతకు వ్యతిరేకంగా, క్యాంపులో ఉన్న కౌన్సిలర్లతో ఆమెను పదవి నుంచి తప్పించినా.. తిరిగి బీఆర్​ఎస్ చైర్​పర్సన్​కే అవకాశం దక్కేలా చేయాలని జీవన్​రెడ్డి భావిస్తున్నారు. కౌన్సిలర్లు పార్టీకి వ్యతిరేకంగా వెళ్లకుండా విప్​ జారీ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన జీవన్​ రెడ్డి కనీసం మున్సిపల్​ అవిశాస్వ రాజకీయాల్లో అయినా గట్టెక్కి ఉనికి కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.