కొల్లాపూర్, వనపర్తిలో వేడెక్కుతున్న రాజకీయం
వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకమాండ్ మెప్పు కోసం బలప్రదర్శనలు చేపడుతుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు వనపర్తి నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు మేఘా రెడ్డి, కిచ్చారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయా నియోజకవర్గ పార్టీ ఇన్చార్జీలు లేకుండానే వీరు పార్టీలో చేరి నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ సాయిచరణ్ రెడ్డి వనపర్తిలో సోమవారం భారీ వాహనాల ర్యాలీ నిర్వహించారు.
దీనిపై మాజీ మంత్రి చిన్నారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో సాయంత్రం వనపర్తిలో ఓ పంక్షన్ హాల్ లో మేఘారెడ్డి వర్గం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి చిన్నా రెడ్డి హాజరయ్యారు.
తగ్గేదే లేదు..
40 ఏండ్లుగా పార్టీలో ఎదురులేని నాయకుడిగా పేరున్న మాజీ మంత్రి చిన్నారెడ్డి తనకే టికెట్ ఇస్తారని ధీమాగా ఉన్నారు. ఇదే విషయాన్ని సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ టికెట్ కోసం పాకులాడలేదని, హైకమాండ్ తనకు పిలిచి టికెట్ ఇచ్చిందని తెలిపారు. తనకు టికెట్ ఇస్తే అందరం కలిసి పని చేయాలని, వేరే వారికి టికెట్ ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ఇదిలాఉంటే వనపర్తి టికెట్ తనకే వస్తుందని పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి ధీమాతో ఉన్నారు. పీసీసీ చీఫ్ హామీ మేరకే కాంగ్రెస్ లో చేరామని చెబుతున్నారు. పార్టీని గెలిపించే సత్తా తనకుఉందని, పార్టీలోని అన్నివర్గాలు తన నాయకత్వాన్ని ఆమోదిస్తున్నాయని చెబుతున్నారు. ఇలా చిన్నారెడ్డి, మేఘారెడ్డి ఎవరికి వారే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
కొల్లాపూర్ లో చిరకాల ప్రత్యర్థులు..
కొల్లాపూర్ రాజకీయాల్లో 30 ఏండ్లుగా ప్రత్యర్థులుగా ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీనియర్ నేత జగదీశ్వర్ రావు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. ఇటీవల కొల్లాపూర్ కు రేవంత్ రెడ్డిని రప్పించి భారీ బహిరంగ సభ నిర్వహించిన జగదీశ్వర్ రావుకు, ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో పార్టీలో చేరిన జూపల్లి వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇప్పటికే జగదీశ్వర్ రావుతో పాటు అభిలాష్ రావు, కేతూరి వెంకటేశ్, మహిళా నాయకురాలు కాటమోని తిరుపతమ్మ తదితరులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. హైకమాండ్ తనకు మాటిచ్చిందని, తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్లో చేరిన జూపల్లి భారీ ర్యాలీతో నియోజకవర్గంలో అడుగు పెట్టి తన బలాన్ని చూపేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లవద్దంటూ పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఇప్పటికే జగదీశ్వర్రావు ఆదేశాలు జారీ చేశారు. పాత ప్రత్యర్థులు ఒకే పార్టీలో ఉండడంతో కొల్లాపూర్ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
లీడర్ కోసం ఎదురుచూపులు..
అసెంబ్లీ బరిలో బీజేపీ నుంచి ఎవరు ఉంటారనే విషయం తేలకపోవడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకులు లేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పాజిటివ్ టాక్ ఉన్నా దాన్ని అందిపుచ్చుకోవడంలో బీజేపీ వెనకబడుతోందని ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం
చేస్తున్నారు.
చేరికలపై మంత్రి నజర్..
ప్రతిపక్షాలు జోరు పెంచుతుండడంతో మంత్రి నిరంజన్ రెడ్డి తనదైన శైలిలో వ్యూహాలు పన్నుతున్నారు. మండలానికో ఇన్చార్జీని నియమించి ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో చేరికల పేరుతో మీటింగ్లు పెడుతున్నారు. కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తూ పార్టీ పటిష్టతపై దృష్టి సారిస్తున్నారు.