- ఇన్నాళ్లూ క్యాడర్‌ను పట్టించుకోని రూలింగ్ పార్టీ
- హైకమాండ్‌పై రగిలిపోతున్న అసంతృప్తులు
- నేడు బీజేపీలోకి భారీగా చేరికలు
సిద్దిపేట, వెలుగు: సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో రాజకీయాలు ఓసీ వర్సెస్ బీసీగా మారుతున్నాయి. వార్ వన్ సైడ్ అనుకున్న చోట చోటుచేసుకుంటున్న పరిణామాలు అధికార బీఆర్ఎస్ ను కలవరపెడుతున్నాయి. కొద్దిరోజులుగా గజ్వేల్‌లో బీసీ నినాదం తెరపైకి రావడం, బీజేపీ నుంచి తాను రంగంలోకి దిగుతానని సీనియర్ నేత ఈటల రాజేందర్ ప్రకటించడం, అదే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ని అసంతృప్తి నేతలంతా భారీ సంఖ్యలో బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకోవడం.. ఒకదాని వెనుక ఒకటి ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి.
ముఖ్యంగా రూలింగ్ పార్టీ నుంచి మొదలైన వలసలు..ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ కు, ఆయన అనుచరులకు ఏమాత్రం మింగుడుపడడం లేదు.
బీఆర్ఎస్లో అసంతృప్తులకు గాలం
గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీలో కొంత కాలంగా ముఖ్య నేతలు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గత ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ నియోజకవర్గాన్ని పూర్తిగా మరిచిపోయారు. ఎన్నికలకు ముందు ఇటీవల నిర్వహించిన సమావేశం మినహాయిస్తే లీడర్లకు, క్యాడర్‌కు అందుబాటులోకి రాలేదు. దీంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రగతి భవన్ తలుపులు తెరుచుకోకపోవడంతో అనేక సమావేశాల్లో తమ గొంతు విప్పారు. ఇటీవల గజ్వేల్ కేంద్రంగా ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి కొండపాక మండలాలకు చెందిన నాయకులు దుద్దెడ కేంద్రంగా మీటింగులు పెట్టుకున్నారు.
తమ సమస్యల పరిష్కారం దిశగా హైకమాండ్ చర్యలు తీసుకోకుంటే రిజైన్ చేస్తామనే అల్టిమేటం ఇచ్చారు. కొద్దిరోజుల కింద శామీర్ పేటలో కేసీఆర్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కొందరు కార్యకర్తలు లేచి అసంతృప్తిని వెల్లగక్కినా పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. ఈ పరిణామాల నేపథ్యంలో మళ్లీ కేసీఆర్ గెలిచినా తమకు ఎలాంటి ప్రాధాన్యం దక్కదని కొందరు ముఖ్య నేతలు, సీనియర్ కార్యకర్తలు పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు. ఇదే టైంలో అధికార బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి పట్ల వ్యతిరేకంగా ఉన్న నేతలు, క్యాడర్‌పై.. బీజెపీ దృష్టి సారించింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు పార్టీ మారేందుకు రెడీ కాగా, మరికొందరిని లాగేందుకు బీజెపీ పావులు కదుపుతోంది. మొన్నటి వరకు కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారితో పాటు నర్సారెడ్డిని విభేదించే వారిలో చాలామంది బీజెపీలో చేరే ఛాన్సు ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
చాపకింద నీరులా బీసీ నినాదం..
గజ్వేల్ నియోజకవర్గంలో 2.65 లక్షల ఓటర్లుండగా సగానికి పైగా బీసీ ఓటర్లు ఉన్నారు. పార్టీ ఏదైనా అభ్యర్థుల గెలుపోటములు శాసించేది బీసీలే! ముఖ్యంగా ముదిరాజ్ ఓటర్లు దాదాపు 50 వేలకు పైగా ఉండగా, తర్వాతి స్థానాల్లో మున్నూరు కాపు, పద్మశాలి, యాదవులు ఉంటారు. పార్టీలన్నీ బీసీలను ఓటర్లుగానే చూస్తుండడంతో ఇప్పటి వరకు గజ్వేల్ నుంచి వెనుకబడిన వర్గాలకు ఎలాంటి ప్రాతినిధ్యం దక్కలేదు. దీనిపై బీసీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ బీసీ నినాదాన్ని తెరపైకి తేవడంతో పాటు మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు.
ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్లను ప్రకటించడంతో బీసీ లీడర్లంతా బీజేపీ వైపు చూస్తున్నారు. ఈసారి కమలం పార్టీ తరుపున ఈటల రాజేందర్ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తుండడంతో ఆయనకు మద్దతుగా పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను వీడి కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు.
సరిహద్దుల నుంచి బైక్‌ర్యాలీ
గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు ముఖ్య నేతలతో పాటు వందల సంఖ్యలో కార్యకర్తలు గురువారం బీజేపీలో చేరనున్నారు. పట్టణంలోని ఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే సమావేశంలో బీఆర్ఎస్ అసంతృప్త నేతలు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ ఏఎంసీ చైర్మన్ రాంరెడ్డి నేతృత్వంలో దాదాపు 500 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేత జశ్వంత్ రెడ్డితో పాటు 200 మంది కార్యకర్తలు కాషాయ కండువా కప్పుకోనున్నారు.
ALS0 READ: తేలని అభ్యర్థిత్వం.. రోజుకో ఊహాగానం
ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ సరిహద్దుల నుంచి భారీ బైక్ ర్యాలీ ద్వారా బీజేపీ ముఖ్యనేతలను తోడ్కొని వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా రాష్ట్రమంతా గట్టి సందేశం పంపేందుకు బీజేపీ శ్రేణులు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తి రేపుతున్నాయి.