- రాజకీయమంతా కులాల చుట్టే!
- గంపగుత్తగా ఓట్లు రాబట్టేందుకు పార్టీల ప్లాన్
- టికెట్లు, చేరికలు, ప్రచారం.. అన్నింటికీ కులమే ప్రధానం
- సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు..
- నేతలతో ప్రత్యేక భేటీలు.. హామీలు గుప్పిస్తున్న ప్రధాన పార్టీలు
- కొన్ని కులాల నుంచి వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పాట్లు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రాజకీయమంతా కులాల చుట్టూనే తిరుగుతున్నది. అన్ని ప్రధాన పార్టీలు కులాలనే టార్గెట్ చేశాయి. ఇప్పటి వరకు సీట్ల కేటాయింపులో సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేసుకున్న పార్టీలు.. ఇప్పుడు చేరికలు, ప్రచారంలోనూ అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. ప్రతి వర్గానికి చెందిన ఓటర్లకు దగ్గరయ్యేందుకు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఆయా కుల సంఘాల లీడర్లతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నాయి. ఎడపెడా హామీలు గుప్పిస్తున్నాయి. తాము ఫలానా సామాజిక వర్గం పక్షమేనని, తమ పార్టీలో ఆయా వర్గాలకు పెద్దపీట వేశామని చెప్పుకుంటున్నాయి. స్థానికంగా ఉండే పరిస్థితులకు అనుగుణంగా లెక్కలు వేసుకుని ముందుకు వెళ్తున్నాయి.
ఎవరి లెక్కలు వారివే
రాష్ట్రంలో వెలమ సామాజికవర్గం అధికార పార్టీ వైపు ఉన్నది. కనీసం నలుగురికి తగ్గకుండా రాష్ట్ర కేబినెట్‌లో వెలమ వర్గం నేతలు మంత్రులుగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలుగా బీఆర్‌ఎస్ నుంచి 8 నుంచి 10 మంది పోటీ చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నది. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్లకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది.
ఈసారి బీసీల విషయంలోనూ తన మార్క్ చూపించే ప్రయత్నం చేసింది. ఇప్పటిదాకా ప్రకటించిన వంద సీట్లలో 20 మంది బీసీలకు టికెట్లు కేటాయించారు. మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, మహేశ్ కుమార్ గౌడ్ తదితర నేతల ఆధ్వర్యంలో గౌడ వర్గాలతో మీటింగ్‌లు పెట్టిస్తున్నది. ఆలేరు టికెట్‌ను బీర్ల అయిలయ్యకు ఇచ్చి కురుమలను ఆకట్టుకునే ప్లాన్ చేసింది. ఇక అధికారంలోకి వస్తే బీసీలను సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఈ రకంగా బీసీల్లో ఉన్న కొన్ని కులాలైనా తమకు ఓట్లు వేస్తాయని బీజేపీ భావిస్తున్నది. ఇక బీఆర్ఎస్ ఏ వర్గాన్నీ వదలడం లేదు. అన్ని కులాలకు సంబంధించిన వారితో మీటింగ్స్ పెడుతున్నది.
ముస్లింలు, దళితులు ఎటువైపు
తెలంగాణలో 9 శాతం ఉన్న ముస్లింలు ఎక్కువగా ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం క్రమంగా తెలంగాణవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తున్నది. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల్లో పలుచోట్ల కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాలు గెలుచుకుంటున్నది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, భైంసా, బోధన్, కామారెడ్డి, జగిత్యాల వంటి మున్సిపాలిటీల్లో ఎంఐఎంకు ప్రాతినిధ్యం ఉంది. ముస్లింలు ఎంఐఎం తర్వాత బీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు మద్దతుగా ఉంటున్నారు.
ఈసారి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముస్లిం ఓట్లు మూడు పార్టీలకు చీలిపోయే అవకాశం కనిపిస్తున్నది. అయితే ఎంఐఎం, తాము పోటీ చేయని చోట.. బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చింది. మరోవైపు దళితుల ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు పట్టుబడుతుండగా, మాలలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ సామాజికవర్గాలు విడిపోయి.. వేర్వేరు పార్టీలకు అండగా నిలుస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తున్నది. దీంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచిన మాదిగలు ఈసారి తమ వైపు మళ్లుతారని బీజేపీ భావిస్తున్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో నిర్వహించే మాదిగల విశ్వరూప సభకు ప్రధాని మోదీ కూడా హాజరవుతున్నారు. ఇక మాలలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తున్నది.
కామారెడ్డిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు
కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్.. కుల సంఘాల వారీగా మీటింగ్‌లు నిర్వహిస్తున్నది. ఆదివారం కామారెడ్డిలో వేర్వేరు చోట్ల నిర్వహించిన కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధిత సామాజిక వర్గాల మంత్రులు, ఎమ్మెల్సీ, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. శుభం పంక్షన్హాల్లో నిర్వహించిన మైనార్టీల సమ్మేళనానికి హోం మంత్రి మహమూద్ అలీ, రేణుక గార్డెన్లో ఏర్పాటు చేసిన గౌడ సంఘం మీటింగ్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పార్శిరాములు కల్యాణ మండపంలో నిర్వహించిన పద్మశాలీల సమ్మేళనానికి ఎమ్మెల్సీ ఎల్.రమణ హాజరయ్యారు. కేసీఆర్ హయాంలోనే మైనార్టీల అభివృద్ధి జరిగిందని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. మైనార్టీల పిల్లల్లో విద్యను ప్రోత్సహించేందుకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో కుల వృత్తుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ తోడ్పాటు అందిస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. గౌడ సోదరులకు రాబోయే రోజుల్లో వైన్స్, బార్లలో రిజర్వేషన్లు పెంచేందుకు ప్రయత్నిస్తామన్నారు.
కేసీఆర్ గెలిస్తే ఈ ఏరియా పారిశ్రామికంగా, ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. చేనేత రంగాన్ని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, పద్మశాలీలంతా కేసీఆర్‌కు మద్దుతు ఇవ్వాలని కోరారు. కామారెడ్డి లారీ డ్రైవర్స్, క్లీనర్స్‌తో జరిగిన మీటింగ్‌లో స్థానిక ఎమ్మెల్యే విప్ గంప గోవర్ధన్ పాల్గొని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, బీఆర్ఎస్ స్థానిక నేతల మధ్య గొడవల నేపథ్యంలో రెడ్ల ఆత్మీయ సమ్మేళనం వాయిదా పడింది. సోమవారం కామారెడ్డిలో ముదిరాజ్‌ల సమ్మేళనంతో పాటు, యూత్, స్టూడెంట్స్ మీటింగ్స్ జరగనున్నాయి.
ఈ వర్గాల ఓట్ల కోసం నానా తిప్పలు
ముదిరాజ్‌ల నుంచి వ్యతిరేకత రావడంతో.. దీనికి చెక్ పెట్టేందుకు బిత్తిరి సత్తి అలియాస్ రవిని తమ పార్టీలోకి బీఆర్ఎస్ చేర్చుకుంది. తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్‌ను సైతం చేర్చుకుంది. మున్నురుకాపు లీడర్ల విషయంలోనూ ఎక్కడికక్కడ ఆయా పార్టీలు మీటింగ్‌లు పెడుతున్నాయి. రాష్ట్రంలో ముదిరాజ్‌ల తర్వాత అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గాలు మున్నూరుకాపులు, యాదవ కులాలు. ఈ రెండు సామాజికవర్గాలు తెలంగాణలో పార్టీల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి.
ALSO READ : కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలె .. బెల్లంపల్లిలో బీఆర్ఎస్, బీజేపీకి భారీ షాక్
మొన్నటి వరకు ఈ రెండు సామాజికవర్గాలు బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉండగా.. ఈసారి పరిస్థితి మారింది. ఆ సామాజికవర్గాలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు మళ్లుతున్నట్లు చర్చ జరుగుతున్నది. పద్మశాలీలు సిరిసిల్ల, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. పద్మశాలీలు జిల్లాల్లో పార్టీల వారీగా చీలిపోతున్నారు. దీంతో లీడర్లు ఎవరికి వాళ్లు పద్మశాలీలతో స్థానికంగా సమావేశమవుతూ తమవైపునకు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.