ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆసక్తికరంగా రాజకీయాలు

నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి  పోటీ చేస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోం ది. ఇప్పటికైతే ఎక్కడివారు అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన స్థానాల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పోటీకి సిద్ధమైన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో వారి బలాబలాల గురించి వివిధ రకాల సర్వేలు చేయిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, బర్త్​డేలు, ఫంక్షన్లు.. ఇలా ప్రజలకు దగ్గరయ్యేందుకు అందివచ్చిన ఏ కార్యక్రమాన్నీ వదిలిపెట్టకుండా ప్రజల మధ్యనే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి సన్నద్ధమయ్యేలా ప్రచార పర్వాన్ని ఇప్పటి నుంచే కొనసాగిస్తున్నారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఆందోళన

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల హడావిడి చూస్తుంటే డిసెంబర్​లో జరగాల్సి న ఎన్నికలు ఐదారు నెలల ముందుగానే జరుగుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతల్లో కొందరు ఇప్పటికే సొంత నియోజకవర్గాల నుంచే పోటీ చేస్తామని ప్రకటించారు. సిట్టింగ్​లకే మళ్లీ సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒకింత ఆందోళన కనిపిస్తోంది. కమ్యూనిస్టులతో పొత్తు ఎవరి సీటుకు ఎసరు పెడుతుందో అర్థంగాక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సర్వేల పేరుతో చివరి నిమిషంలో తమ సీటుకు ఎసరు పెడితే ఎలాగని డౌట్ పడుతున్నారు. జిల్లాలో బీఆర్ఎస్​కు కాంగ్రెస్​ నుంచే గట్టి పోటీ ఉంటుందనే అభిప్రాయం ఉంది. దీంతో కాంగ్రెస్ అడ్డు తొలగించుకునే క్రమంలో ఆ పార్టీకి చెందిన బలమైన లీడర్లను బీఆర్ఎస్ లో చేర్చుకుంటే అప్పుడు కచ్చితంగా తమ సీటు ఎగిరిపోవడం ఖాయమని భయపడుతున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్య వస్తుందని సందేహిస్తున్నారు. 2018 ఎన్నికల్లో చివరి నిమిషంలో పార్టీ హైకమాండ్ చేసిన మార్పుతో ఆ పార్టీ కోదాడ, నల్గొండలో గెలుపొందింది. దీంతో ఈసారి కాస్త ముందుగానే అభ్యర్థులను మార్చాలని భావిస్తే ఆ ఎఫెక్ట్ నల్గొం డ, సూర్యాపేట జిల్లాలపై పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కమ్యూనిస్టుల పొత్తు ఎఫెక్ట్ పడే ఎమ్మెల్యేలను ఎక్కడ భర్తీ చేస్తారనే భయం కూడా పట్టుకుంది. బీఆర్ఎస్, కమ్యూనిస్టుల ఫోకస్ మిర్యాలగూడెంపైనే ఉంది. కాబట్టి ఆ సీటు కమ్యూనిస్టులకు ఇవ్వాల్సి వస్తే అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే భాస్కర్​రావు పక్కనే ఉన్న నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. దీంతోపాటు నల్గొండ, నకిరేకల్, మునుగోడు స్థానాల గురించి కూడా చర్చ జరుగుతోంది. ఈ మూడు చోట్ల ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ క్యాండిడేట్లు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్​రెడ్డితో సహా పలువురు బీసీ లీడర్లు నల్గొండపై గురిపెట్టారు. అయితే అమిత్ నల్గొండ ఎంపీ స్థానంపైనే ఆశలు పెట్టుకున్నారని ఓ వర్గం నేతలు ప్రచారం చేస్తుండటం గమనార్హం. నకిరేకల్​లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గట్టి పోటీ ఇస్తున్నారు. మునుగోడుపైన బీసీ లీడర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. 

కాంగ్రెస్ ముఖ్యనేతలపై కన్ను

బీఆర్ఎస్ నేతల దృష్టి అంతా కాంగ్రెస్ ముఖ్యనేతల కదలికలపైనే ఉంది. ముఖ్యంగా ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, పద్మావతి, దామోదర్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై బీఆర్ఎస్ నేతలు దృష్టి పెట్టారు. ఉత్తమ్, ఆయన భార్య పద్మావతి కోదాడ, హుజూర్​నగర్ నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. ఉత్తమ్ కోదాడ నుంచి పోటీ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే హుజూర్​నగర్ బైపోల్​లో ఓడిపోయిన పద్మావతి మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేయక తప్పదు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరు రెండు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. ఎంపీ వెంకటరెడ్డి తన సొంత నియోజకవర్గం నల్గొండ నుంచే పోటీ చేస్తానని ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రకటించారు. అయితే వెంకటరెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. అదే పరిస్థితి వస్తే అప్పుడు అనివార్యంగా నియోజకవర్గం మార్పు తప్పదని కాంగ్రెస్​లోని ఓ వర్గం భావిస్తోంది. మరోవైపు ఇబ్రహీంపట్నం, ఆలేరులో సైతం వెంకటరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. సీనియర్ నాయకుడు జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి ఈ ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలపై తండ్రీకొడుకులు ఫోకస్ పెట్టారు. జానారెడ్డి సాగర్ నుంచే పోటీ చేస్తారని చెప్తున్నప్పటికీ చివరి నిమిషంలో ఎలాంటి మార్పులైనా జరగొచ్చనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సూర్యాపేట నుంచి బరిలో దిగుతారా.. లేదంటే నల్గొండ ఎంపీగా పోటీ చేస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది.