- హుస్నాబాద్‌లో హీటెక్కుతున్న పాలిటిక్స్!
- సీపీఐతో దోస్తీకి టీఆర్ఎస్ అడుగులు.. ?
- కాంగ్రెస్ ను వీడిన శ్రీరామ్ చక్రవర్తి.. అల్గిరెడ్డికి ఆల్ క్లియర్
- బీజేపీలో జోరుగా చేరికలు.. టికెట్ కోసం పోటాపోటీ
- ఆసక్తికరంగా మారుతున్న నియోజకవర్గ రాజకీయం
హుస్నాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు సీపీఐతో టీఆర్ఎస్ పార్టీ జతకట్టేందుకు అడుగులు వేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీరాం చక్రవర్తి బీజేపీలో చేరడం ఆసక్తి రేపుతోంది. ఈ పరిస్థితులతో రోజురోజుకూ నియోజకవర్గ రాజకీయం హీటెక్కుతోంది.
సిద్దిపేట, వెలుగు : రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో సీపీఐతో టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉండడంతో హుస్నాబాద్ సీటు సీపీఐకి కేటాయించే అవకాశం కనిపిస్తోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సొంత నియోజకవర్గం హుస్నాబాద్ కావడంతో ఆయన అదే సీటును కోరుకునే చాన్స్ఎక్కువగా ఉంది. చాడ గతంలో హుస్నాబాద్ పరిధిలోని ఇందుర్తి నుంచి ఎమ్మెల్యే గా ఎన్నిక కావడంతో పాటు, మరో రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా హుస్నాబాద్ సీటును సీపీఐకి కేటాయిస్తే చాడ వెంకటరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇదిలా ఉండగా పొత్తులో సీపీఐకి హుస్నాబాద్ అసెంబ్లీ సీటును కేటాయిస్తే ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సతీశ్‌కుమార్ కు ఈసారి హుజూరాబాద్ టికెట్ కేటాయించడమో, ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వడమో చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
బీజేపీ టికెట్‌కు పెరుగుతున్న పోటీ
నియోజకవర్గంలో ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ టికెట్ కోసం తీవ్ర పోటీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నాయకుడు జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరి టికెట్ ను ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీరాం చక్రవర్తి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. శ్రీరాం కూడా బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న, మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న హుస్నాబాద్ బీజేపీలో రానున్న రోజుల్లో పోటాపోటీ రాజకీయాలు తప్పేలా లేవని తెలుస్తోంది. ఏదేమైనా వేగంగా మారుతున్న సమీకరణలతో హుస్నాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
అల్గిరెడ్డికి లైన్ క్లియర్..
హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో మారుతున్న రాజకీయ సమీకరణలతో మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి లైన్ క్లియర్ అయ్యింది. ఇదే స్థానం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో కొన్నేండ్లుగా కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్న శ్రీరాం చక్రవర్తి బీజేపీలో చేరడం ఇప్పుడు ప్రవీణ్‌రెడ్డికి సానుకూలంశంగా మారింది. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒకసారి ఎన్నికైన ప్రవీణ్ రెడ్డి గత పార్లమెంట్ఎన్నికల ముందు పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరడంతో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను శ్రీరాం చక్రవర్తి చూస్తూ వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవడానికి శ్రీరాం చక్రవర్తి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగానే ప్రవీణ్ రెడ్డి ఇటీవల మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అల్గిరెడ్డి రాకను శ్రీరాం చక్రవర్తి వ్యతిరేకించినా పార్టీ హైకమాండ్ పట్టించుకోకపోవడంతో శ్రీరాం ఇటీవల బీజేపీలో చేరారు. దీంతో హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ ను ఆశిస్తున్న అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డికి లైన్ క్లియర్ అయినట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.