సిరిసిల్ల జిల్లాలో హీటెక్కుతున్న పాలిటిక్స్​

  • జిల్లా కేంద్రంలో గెలుపుపై భరోసాతో కేటీఆర్​
  • వేములవాడలో బీఆర్ఎస్​నుంచి చెన్నమనేని లేకపోతే చెల్మెడ 
  • రెండు సెగ్మెంట్లపై బీజేపీ ఫోకస్​
  • సానుభూతిపై కాంగ్రెస్ ​ఆశలు  

రాజన్న సిరిసిల్ల,వెలుగు : ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాలిటిక్స్ ఊపందుకుంటున్నాయి. సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ బలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు కూడా దీటుగా ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. సిట్టింగ్​ స్థానాలను మళ్లీ దక్కించుకుంటామన్న ధీమాలో ఉన్న అధికార పార్టీకి షాకిచ్చేందుకు బీజేపీ రెడీ అయ్యింది. కిందిస్థాయి నుంచి పార్టీని నిర్మించుకుంటూ పోటీకి సై అంటోంది. కాంగ్రెస్ కూడా ఈ రెండు సీట్లలో పాత అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని భావిస్తోంది. వారిపై సానుభూతి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల మీద ఫోకస్​ పెడితే గెలుపు తమదే అని భావిస్తోంది. దీంతో ఈ రెండు చోట్లా బీఆర్ఎస్​ గెలుపు అంత ఈజీ అయ్యే అవకాశం లేదు.  

బీఆర్ఎస్ ​వర్కింగ్ ​ప్రెసిడెంట్ ​ధీమా

సిరిసిల్లలో మళ్లీ తనదే గెలుపు అని మంత్రి కేటీఆర్​ధీమాగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కేటీఆర్ 89వేల మెజార్టీతో గెలవగా.. ఆయన ప్రత్యర్ధి,  కాంగ్రెస్ క్యాండిడేట్​అయిన కే.కే. మహేందర్ రెడ్డి 36వేల ఓట్లు సాధించారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో వేల కోట్లతో చేసిన అభివృద్ధే తనను  గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ముఖ్యమంత్రి కొడుకుగా, బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండడం, సిరిసిల్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయడం కేటీఆర్ కు కలిసి వచ్చే అంశాలు. సిరిసిల్ల మీద బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గతంలో ఇక్కడ బీజేపీకి పట్టు లేకపోయినా.. పార్లమెంట్​ఎన్నికల్లో బండి సంజయ్​కు సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్​లో గణనీయంగా ఓట్లు పడ్డాయి. ఇటీవల జరిగిన సెస్ ఎన్నికల్లోనూ వివిధ మండలాల్లో బీజేపీ డైరెక్టర్​అభ్యర్థులకు కూడా ఓట్లు బాగా వచ్చాయి. ఈ నేపథ్యంలో  అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఆ పార్టీ లీడర్లు పని చేస్తున్నారు. 

నేరవేరని హామీలు 

జిల్లాలోని రెండు సెగ్మెంట్లలో కొన్ని అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని పనులు నత్తనడకన సాగుతున్నాయి. సీఎం ఇచ్చిన హామీలు కూడా నెరవేరకపోవడం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది. వర్కర్ టూ ఓనర్ స్కీమ్​ కింద  నిర్మిస్తున్న వీవింగ్ పార్క్ పనులు స్లోగా జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ కి స్థలం కేటాయించలేదు.  అక్వా హబ్​ నిర్మాణం కాగితాలకే పరిమితమయ్యింది.  మిడ్ మానేరు, అన్నపూర్ణ ప్రాజెక్ట్  ప్రాంతాన్ని టూరిస్ట్​స్పాట్​గా డెవలప్ చేస్తానని చెప్పినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దక్షిణ కాశీగా పేరున్న   వేములవాడ రాజన్న ఆలయానికి స్వయంగా సీఎం కేసీఆరే  ఏడాదికి రూ. వంద కోట్ల చొప్పున నాలుగేండ్లకు 400 కోట్లు ప్రకటించినా ఇప్పటివరకు నిధులివ్వలేదు. మిడ్ మానేరు నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వపోవడం, ఎగువ మానేరును నింపేందుకు చేపట్టిన లిఫ్ట్​ పనులు పూర్తి కాకపోవడం వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చు.  

కాంగ్రెస్ కు కలిసి వస్తుందా?  

వేములవాడ, సిరిసిల్ల..రెండు చోట్లా వరుస ఓటములతో కాంగ్రెస్ కుంగిపోతోంది. వేములవాడ నుంచి గతంలో పోటీ చేసిన ఆది శ్రీనివాస్​కు ఇటీవల కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. సిరిసిల్లకు చెందిన నాగుల సత్యనారాయణను డీసీసీ పదవి నుంచి తప్పించడంపై క్యాడర్​లో అసంతృప్తి నెలకొంది. సిరిసిల్ల నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీచేసిన  కేకే మహేందర్ రెడ్డి మొదట తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయినా.. 2018లో 36 వేల ఓట్లే పొందగలిగారు. తర్వాత కూడా ఆయన  స్థానికంగా ఉండడం లేదు. ఎన్నికల టైమ్​లోనే కనిపిస్తారన్న   విమర్శలున్నాయి. వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్​కాంగ్రెస్ క్యాండిడేట్​గా పోటీ చేస్తూ వరుసగా ఓటమిపాలవుతున్నారు. వీరిద్దరికీ వరుసగా ఓడిపోయారన్న సింపతీ కొంత కలిసివస్తుందన్న ఆశ ఉంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​స్థానికంగా ఉండక పోవడం కూడా కాంగ్రెస్​కు  కలిసి వస్తోందని భావిస్తున్నారు. 

చెన్నమనేనికి పౌరసత్వ లొల్లి

వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు పౌరసత్వ సమస్య తలనొప్పిగా మారింది. ఆయన పౌరసత్వంపై  కాంగ్రెస్​ లీడర్​ఆది శ్రీనివాస్ 2009 లో  కేంద్ర హోంశాఖకు కంప్లయింట్​చేశారు. సిటిజన్ షిప్ ఆక్ట్ ప్రకారం ఒక ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు సంవత్సరం పాటు దేశంలో నివసించాలి. 2008లో ఏడాదిపాటు తాను  దేశంలోనే ఉన్నట్టు రమేశ్​బాబు కేంద్ర హోం శాఖకు తెలిపారు. దీనిపై  కేంద్ర హోం శాఖ విచారణ జరిపి ఎన్నికలకు ముందు రమేశ్​బాబు కేవలం 96 రోజులు మాత్రమే భారతదేశంలో ఉన్నట్టు  తేల్చి, ఆయన పౌరసత్వాన్ని  రద్దు చేసింది. దీనిపై రమేశ్​బాబు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఇది కోర్టులో పెండింగ్ లో ఉంది. జర్మనీలోని ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్​గా పని చేస్తున్న రమేశ్​బాబు ద్వంద్వ పౌరసత్వం కలిగిఉన్నారని, ఆయన పోటీకి అనర్హుడని హై కోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ స్టే తెచ్చుకుని పోటీ చేస్తున్నారు. 2009 నుంచి ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఒకవేళ రమేశ్​బాబుకు టికెట్ ఇవ్వకపోతే చెల్మెడ లక్ష్మీనరసింహారావుకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏడాదిన్నర క్రితం కాంగ్రెస్​ నుంచి బీఆర్​ఎస్​లో చేరిన ఆయన ఈ మధ్య వేములవాడలో యాక్టివ్​గా తిరుగుతున్నారు. మంత్రి సిరిసిల్ల జిల్లా టూర్​కు వచ్చినప్పుడల్లా కేటీఆర్​ వెంటే ఉంటున్నారు.  

పద్మశాలీ నేతకు బీజేపీ ఆహ్వానం

సిరిసిల్లలో ఎక్కువ  జనాభా ఉన్న  పద్మశాలీ వర్గానికి చెందిన సీనియర్​ నేత లగిశెట్టి శ్రీనివాస్  బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనను పార్టీలో  చేరాలని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ఆహ్వానించారు. లగిశెట్టి శ్రీనివాస్ కు బీజేపీ క్యాండిడేట్​గా బరిలో దిగితే పోటీ తీవ్రస్థాయిలో ఉంటుందని, కేటీఆర్ కు టఫ్​ ఫైట్​ఇవ్వొచ్చని భావిస్తున్నారు.  అలాగే గత ఎన్నికల్లో బీఎస్​పీ తరఫున పోటీ చేసిన ఆవునూరి రమాకాంత్​రావు తర్వాత బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో తనకు సిరిసిల్ల టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు. 

ఎములాడపై వికాస్​రావు ఆసక్తి

కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్​ చెన్నమనేని విద్యాసాగర్​రావు కొడుకు వికాస్ రావు వేములవాడ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. దీని కోసం ఆయన ఏడాదిగా వేములవాడలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యూత్​కు స్పోర్ట్స్​కిట్స్​ ఇస్తున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తండ్రికి ఉన్న పేరు ప్రఖ్యాతులు కలిసి వస్తాయని భావిస్తున్నారు. బీజేపీ నుంచి వేములవాడ టికెట్​ రాకపోతే ఇండిపెండెంట్​గా అయినా బరిలో ఉండాలనుకుంటున్నారు. 

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్​

(ఐటీ, పురపాలక శాఖ మంత్రి)

 అనుకూల అంశాలు

- ముఖ్యమంత్రి తనయుడు,బీఆర్​ఎస్ పార్టీలో కీలకపాత్ర
- అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించడం
- అనర్గళంగా మాట్లాడటం
- ప్రస్తుతానికి బలమైన ప్రత్యర్థి లేకపోవడం

ప్రతికూల అంశాలు

-    స్థానికంగా ఉండకపోవడం
-    బంధువులు, అనుచరుల ఇసుక దందా చేస్తున్నారన్న  ఆరోపణలు
-    తన సామాజిక వర్గానికే ఎక్కువ పదవులు ఇవ్వడం
-    పర్యటనకు వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాల లీడర్లను  అరెస్ట్ చేయడం

వేములవాడ ఎమ్మెల్యే రమేశ్​బాబు

అనుకూల అంశాలు

- వివాదాలకు దూరంగా ఉండటం, అందరితో కలిసిపోవడం
-  సౌమ్యుడిగా పేరు వాక్చాతుర్యం
-    తండ్రి రాజేశ్వర్ రావు వారసత్వం

ప్రతికూల అంశాలు

-    జర్మనీలో ఎక్కువ రోజులు ఉండడం   
-    ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం
-    రాజన్న టెంపుల్ కు నిధులు రాకపోవడం
-    పౌరసత్వ వివాదం, కోర్టుల చుట్టూ తిరగడం
-    వేములవాడ అభివృద్ధికి నోచుకోకపోవడం

వేములవాడ బరిలో బండి సంజయ్​? 

రానున్న ఎన్నికల్లో వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్​బరిలో నిలువనున్నారన్న ప్రచారం జరుగుతోంది. నిజంగానే ఆయన పోటీలో ఉంటే సమీకరణాలు మారిపోతాయి. హిందూత్వ సెంటిమెంట్ వర్కవుట్ అయి.. గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వేములవాడ సిట్టింగ్​ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​బాబు ఎక్కువగా జర్మనీలో ఉంటున్నారు.ఆయన  అందుబాటులో ఉండరన్న భావన ప్రజల్లో ఉంది. ఈ అంశం బీజేపీకి కలిసివస్తుందని అంటున్నారు. 2019  పార్లమెంట్ ఎన్నికల్లో వేములవాడ సెగ్మెంట్​లోనూ సంజయ్​ఎక్కువ ఓట్లు సాధించారు. ఇవన్నీ తమకు కలిసవస్తాయని బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. సంజయ్​పోటీ చేయనిపక్షంలో వేములవాడలో మంచి పట్టున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ బరిలో నిలిచే అవకాశాలున్నాయి.  గత ఎన్నికల్లో ఈయన మూడో స్థానంలో నిలిచారు. బీజేపీకి పెరిగిన ఆదరణతో ఈసారి తాను పోటీ చేస్తే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.